ఎం'తాటి' ఘనతో.. | 30 types of food products are made from palm trees | Sakshi
Sakshi News home page

ఎం'తాటి' ఘనతో..

Feb 8 2026 4:18 AM | Updated on Feb 8 2026 4:18 AM

30 types of food products are made from palm trees

తాటితో 30 రకాల ఆహార ఉత్పత్తుల తయారీ 

ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తల కృషి 

హెచ్‌ఆర్‌ఎస్‌లో 1993 నుంచి పరిశోధనలు 

ఇదో గ్రామీణ సౌరభం.. అమృతం దాచిన అద్భుత ఫలం.. ప్రకృతి సిగ నుంచి వచ్చిన ఆరోగ్యకర ఆహారం.. అలాంటి తాటి పండు రుచి అమోఘం.. ఈ పండ్లతో పాటు కాయలు, తేగలు, నీరా వంటి వాటితో ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రస్థానంలో నిలిచింది పందిరిమామిడి డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధన స్థానం.. మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలతో తనదైన ముద్ర వేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా..   

రంపచోడవరం:  కాలం మారినా.. తాటి రుచి మరువలేనిది. అలాంటి ఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తాటితో ఆహార ఉత్పత్తుల తయారీపై పోలవరం జిల్లా పందిరిమామిడి డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్‌ఆర్‌ఎస్‌) చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆర్థిక సహకారంతో అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి ఈ పరిశోధనలు ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తాటి మొక్కలను సేకరించి హెచ్‌ఆర్‌ఎస్‌ పెంచడం ద్వారా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు.  

చెట్లు.. 272 రకాలు 
దేశంలో మేలైన తాటి మొక్కల సేకరణలో భాగంగా ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాల నుంచి తాటి మొక్కలను సేకరించారు. ఇలా సేకరించిన 272 రకాల తాటి మొక్కలను హెచ్‌ఆర్‌ఎస్‌ వ్యవసాయ క్షేత్రంలో పెంచారు. ఇందులో తక్కువ ఎత్తుగలవి, తక్కువ వయసులో కాపునకు వచ్చేవి, పెద్ద సైజు కాయలు వచ్చే 50 రకాలను గుర్తించారు. 

పరిశోధనలకు వాటి నుంచి సేకరించిన తాటి కాయలు, తేగలు, నీరాతో ప్రయోగాలు చేశారు. తాటి చెట్ల నుంచి కల్లు కంటే నీరా సేకరణ ద్వారా అధికంగా లాభాలు ఉంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు మొదటి దశలో కల్లు కుండలకు సున్నం రాసి నీరా సేకరించేవారు. ఈ పద్ధతి శాస్త్రీయం కావడంతో కూల్‌ బాక్స్‌లో నీరా సేకరణ ద్వారా విజయం సాధించారు. తాటి బెల్లాన్ని నీరాతోనే తయారు చేస్తారు.  

మార్కెటింగ్, ఉత్పత్తిపై దృష్టి 
సుదీర్ఘ కాలం పరిశోధనల తర్వాత తాటితో అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేశారు. ప్రస్తుతం తాటి పండ్లతో ఎక్కువ స్థాయిలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాం. ఇప్పటి ఐటీడీఏ అటవీ శాఖ సహకారంతో నీరా కేఫ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. గ్రామ స్థాయిలో తాటి చెట్ల ద్వారా వచ్చే లాభాలపై రైతులను చైతన్యపరుస్తున్నాం. గిరిజన రైతుల నుంచి నీరా సేకరిస్తున్నాం. మార్కెట్‌లో తాటి బెల్లం, నీరాకు మంచి డిమాండ్‌ ఉంది. అలాగే తేగలతో తయారు చేసిన పిండిలో మంచి ఫైబర్, పోషకాలు ఉంటాయి. –డాక్టర్‌ పీసీ వెంగయ్య, హెచ్‌ఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్, పందిరిమామిడి  

పరిశోధన.. శిక్షణ
2010 సంవత్సరం నుంచి  పందిరిమామిడి హెచ్‌ఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పీసీ వెంగయ్య తాటితో సహజమైన ఆహార ఉత్పత్తుల తయారీపై పరిశోధనలు ప్రారంభించారు. తాటి తాండ్ర, నీరా, తేగల పిండి, జెల్లీ, బుర్ర గుజ్జు ప్లోర్, తాటి ముంజుల క్యాండీ, చాక్లెట్లు, బిస్కెట్లు, తాటి పండు జ్యూస్‌ వంటివి 30 రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. 2020లో ఆశ స్వచ్ఛంద సంస్థ– హెచ్‌ఆర్‌ఎస్‌ సహకారంతో తేగల పిండిని లండన్‌కు సరఫరా చేశారు. 

రెండు రకాల ఆహార ఉత్పత్తులకు పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. 2025లో  అఖిల భారత స్థాయిలో ఉత్తమ పరిశోధన స్థానంగా గుర్తించారు. తాటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల తయారీలో ఇప్పటి వరకూ 5 వేల మందికి శిక్షణ ఇచ్చారు. 1993 నుంచి తాటి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు డాక్టర్‌ పురుషోత్తం, డాక్టర్‌ రాఘవరావు, డాక్టర్‌ విజయపద్మ, డాక్టర్‌ కేటీవీ రమణ, డాక్టర్‌ సత్తిరాజు, డాక్టర్‌ నరసింహమూర్తి, డాక్టర్‌ రాజేంద్ర›ప్రసాద్‌ పాలుపంచుకున్నారు. ప్రస్తుతం డాక్టర్‌ పీసీ వెంగయ్య హెచ్‌ఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.  

కూల్‌ బాక్స్‌ టెక్నాలజీ ద్వారా..  
నీరా సేకరణలో కూల్‌ బాక్స్‌ టెక్నాలజీని ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాటిచెట్టు నుంచి కల్లు గీత మాదిరిగానే, అయితే గాలి తగలకుండా కూల్‌ బాక్స్‌లో సేకరించే దానినే నీరా అంటారు. వంద శాతం సహజంగా తయారయ్యే ద్రవం ఇది. కొబ్బరి నీళ్ల కంటే తియ్యగా ఉంటుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువ. ఐరన్‌ ఎక్కువగా ఉండడంతో రక్తహీనత నివారణకు బాగా ఉపయోగపడుతోంది. ఇందులో ఖనిజ లవణాలు పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.   

తాటి పిండి చేద్దామా.. 
తాటి తేగలను ఉడికించి ముక్కలు చేసి ఆరబెట్టాలి. తరువాత హీటర్‌ బాయిలర్‌ స్టీమ్‌లో ఉంచి తేమ పూర్తిగా తొలగిస్తారు. అనంతరం పౌడర్‌ చేస్తారు. మైదాకు బదులుగా అన్ని రకాల ఆహార పదార్థాల తయారీలో దీనిని ఉపయోగించవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.   

బెల్లం.. ప్రియం 
నీరాను రెండు నుంచి మూడు గంటల వరకూ మరగబెట్టడం ద్వారా నీరాలోని నీరు తొలగిపో యి తాటి బెల్లం తయారవుతోంది. దీనిని ఇంటి వద్ద, పరిశ్రమల ద్వారా తయారు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను కూడా రూపొందించారు. ఇలా తయారైన బెల్లం పొడిని కిలో రూ.వెయ్యికి అమ్ముతుండడం విశేషం.    

చాక్లెట్‌ల తయారీ ఇలా.. 
సాధారణ చాక్లెట్‌లు ఎలా తయారు చేస్తారో అదే విధంగా తాటి బెల్లంతో చాక్లెట్లు చేస్తారు. ఈ చాక్లెట్లలో పంచదారకు బదులుగా తాటి బెల్లం వాడతారు. అలాగే కోకో పౌడర్, బటర్‌ను వినియోగిస్తారు. ఇందులో తక్కువ గ్లైసిమిన్‌ ఉండడంతో డయాబెటిక్‌ ఫ్లెండ్లీగా ఉంటుంది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement