‘ఆమోద’o లేకుండానే భూ కేటాయింపు!? | Resolution on land allocation to Andhra Jyothi as an urgent table agenda | Sakshi
Sakshi News home page

‘ఆమోద’o లేకుండానే భూ కేటాయింపు!?

Feb 8 2026 4:09 AM | Updated on Feb 8 2026 10:37 AM

Resolution on land allocation to Andhra Jyothi as an urgent table agenda

అత్యవసరంగా టేబుల్‌ అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపుల తీర్మానం 

ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం ముందుకు ప్రతిపాదన 

వ్యతిరేకించిన కౌన్సిల్, ప్రకటన కూడా జారీ చేసిన మేయర్‌ 

అయినా డిసెంబర్‌ 12న భూ కేటాయింపుల ఉత్తర్వులు 

కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఇలా ఎలా? రికార్డులు తారుమారయ్యాయా?  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపులు జరిగాయా? కౌన్సిల్‌ ఆమోదించనప్పటికీ ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పులు చేశారా? తాజాగా ఆంధ్రజ్యోతికి భూమి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతికి (ఆమోద పబ్లికేషన్స్‌) భూ కేటాయింపుల అంశాన్ని అత్యవసరంగా, టేబుల్‌ అజెండాగా.. సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2025 ఆగస్టు 22న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు.

అయితే, ఆ తీర్మానాన్ని కౌన్సిల్‌ స్పష్టంగా తిరస్కరించినట్టు స్వయంగా మేయర్‌ కూడా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం 2025 డిసెంబర్‌ 12న ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం లేకుండా భూ కేటాయింపులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

కౌన్సిల్‌ ఆమోదించనప్పటికీ, ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పులు చేశారా? అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్‌లో ‘జంగిల్‌ రాజ్‌’ ప్రయోగించి ఆమోదం తెచ్చుకున్నట్టు హడావుడిగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జ్యోతికి భూ కేటాయింపుల విషయంలో కూడా అసలు కౌన్సిల్‌ నిర్ణయం లేకుండానే బుల్డోజర్‌ రాజకీయాలు నడిపి ఉత్తర్వులు జారీ చేశారా? ఏకంగా రికార్డులనే మార్చివేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   

కేటాయింపులు రద్దయినప్పటికీ..! 
వాస్తవానికి, తన పాత్రికేయ మిత్రునికి మేలు చేసేందుకు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయించారు. 2017 జూన్‌ 28న అప్పటి ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.50.50 లక్షల చొప్పున భూమి కేటాయించాలని నిర్ణయించింది. అయితే, కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు భిన్నంగా అతి తక్కువ ధరకు భూమిని కేటాయించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ప్రాంతంలో (హౌసింగ్‌ బోర్డు భూమి) భూమి విలువ ఎకరానికి రూ.7.26 కోట్లుగా ఉంటుందని అప్పటి విశాఖ కలెక్టర్‌ యువరాజ్‌ 2016 ఆగస్టు 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 

అనంతరం వచ్చిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా 2016 అక్టోబర్‌ 4న అదే ధరను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్లు 191/10, 191/14లలో ఉన్న అర ఎకరం భూమిని కేవలం రూ.50.50 లక్షలకే కేటాయిస్తూ 2017 జూన్‌ 28న అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ జీవో ఎంఎస్‌ నంబర్‌ 25 జారీ చేశారు.

ఈ అడ్డగోలు వ్యవహారంపై 2019 అక్టోబర్‌ 16న జరిగిన కేబినెట్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఆ భూమిని గూడులేని పేదలకు కేటాయించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించేందుకు బరితెగించింది.   

అత్యవసర టేబుల్‌ అజెండా 
భూ కేటాయింపులు వంటి కీలక అంశాలను సాధారణంగా రెగ్యులర్‌ అజెండాలో చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే టేబుల్‌ అజెండాగా అంశాలను ప్రవేశ పెట్టడం పరిపాటి. అయితే, ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ముందుగా సమాచారం ఇస్తే అడ్డంకులు ఎదురవుతాయనే భయంతోనే దీనిని అత్యవసర టేబుల్‌ అజెండాగా చివరి అంశంగా (67వ అంశం) ప్రవేశపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

‘మార్కెట్‌ ధరకు కేటాయింపు’ అని మాత్రమే పేర్కొని, అసలు ధర ఎంతన్నది స్పష్టం చేయలేదు. పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీ లోని ఈ భూమి ధర 2016లోనే ఎకరానికి రూ.7.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో ఎకరానికి రూ.20 కోట్లకు పైగా విలువ ఉంటుందని అంచనా. అంటే అర ఎకరం భూమి ధర కనీసం రూ.10 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ మార్కెట్‌ ధర పేరుతో అతి తక్కువ ధరకే భూమిని ఆంధ్ర­జ్యోతికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం.

తీర్మానాన్ని మార్చేశారా?
జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో టేబుల్‌ అజెండా 67వ అంశంగా ఆమోద పబ్లికేషన్స్‌కు భూ కేటాయింపుపై ప్రతిపాదన వచ్చింది. అయితే, చర్చకు వచ్చినప్పటికీ ఆ అంశాన్ని కౌన్సిల్‌ ఆమోదించలేదు. ఈ విషయాన్ని స్వయంగా మేయర్‌ ప్రకటిస్తూ, ఆ అంశాన్ని వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. ఆగస్టు 22న జరిగిన సమావేశం తర్వాత ఈ అంశం మరో జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు రాలేదు. అయినప్పటికీ 2025 డిసెంబర్‌ 12న ప్రభుత్వం భూ కేటాయింపులపై ఉత్తర్వులు జారీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

నిజంగా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఉత్తర్వులు జారీ చేశారా? లేక ఆమోదం పొందినట్టుగా రికార్డులను మార్చేశారా? అన్న ప్రశ్నలు జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో యోగా డే సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలో పెద్ద బండరాళ్లు తొలగించేందుకు నామినేషన్‌ పద్ధతిలో లక్షల రూపాయలు వెచ్చించిన వ్యవహారంలో కూడా ఇలాగే స్టాండింగ్‌ కమిటీ ఆమోదం లేకుండానే రికార్డులు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ఇప్పుడు ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల విషయంలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయా? అన్నది తేలాల్సి ఉంది. కౌన్సిల్‌ తీర్మానం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తే అవి చెల్లవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా, ఆమోదం లేనప్పటికీ, ఉన్నట్టుగా రికార్డులు మార్చితే సంబంధిత అధికారులు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement