పుడమి విషమెక్కుతోంది | Soils are becoming depleted due to nutrient deficiencies | Sakshi
Sakshi News home page

పుడమి విషమెక్కుతోంది

Feb 8 2026 4:04 AM | Updated on Feb 8 2026 4:04 AM

Soils are becoming depleted due to nutrient deficiencies

పోషకాల లోపంతో నిస్సారమవుతున్న నేలలు  

ఏటా పెరుగుతున్న సల్ఫర్, జింక్, ఇనుము, మెగ్నీషియం లోపం 

నేలల్లో సగానికి పైగా క్షీణించిన సేంద్రియ కర్బనం 

సూక్ష్మ పోషకాలు అందించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు 

టాప్‌–10లో తెలుగు రాష్ట్రాలు ఉండడం ఆందోళనకరం 

ఐసీఆర్‌ఐఈఆర్‌ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు 

హీలింగ్‌ సాయిల్స్‌ ఇన్‌ ఇండియా నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: నేలతల్లి నిస్సారమైపోతోంది.. సూక్ష్మపోషకాల లోపంతో.. క్షీణిస్తున్న సేంద్రియ కర్బనంతో భూసారం పూర్తిగా దెబ్బతింటోంది. దేశమంతటా కనిపిస్తోన్న ఈ ప్రభావం వ్యవసాయ పంటల సాగుపైనే కాదు.. ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారబోతుందని ఇండియన్‌ కౌన్సిల్‌ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌(ఐసీఆర్‌ఐఈఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 27వ తేదీన విడుదల చేసిన హీలింగ్‌ సాయిల్స్‌ ఇన్‌ ఇండియా నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 

ఆహారంలో కొరవడుతున్న పోషకాలు  
దేశవ్యాప్తంగా 34.59 కోట్ల ఎకరాల భూములు సాగులో ఉన్నాయి. ఇది దేశ¿ౌగోళిక విస్తీర్ణంలో 42 శాతంగా ఉంది. ఇందులో 50 శాతం వర్షాధారం కాగా, మిగిలిన 50 శాతం భూములు కాలువలు, బోర్లు, వివిధ పద్ధతుల ద్వారా సాగునీటి వనరులపై ఆధారపడి సాగవుతున్నాయి. మరో 3.20 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూములు అందుబాటులో ఉన్నాయి. సాగు భూముల్లో ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుండడంతో నేలల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోందని ఐసీఆర్‌ఐఈఆర్‌ నివేదిక తేల్చింది. 

అందులో సల్ఫర్, జింక్, ఇనుము, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషక లోపాలు ఏటా పెరగడంతో పాటు సేంద్రియ కర్బనాలు క్షీణించిపోతున్నాయని.. ఈ కారణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డుస్థాయిలో ఉన్నప్పటికీ, ఆహారంలో ఉండాల్సిన పోషకాలు దారుణంగా పడిపోతున్నాయని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నే ‘అదృశ్య ఆకలి’(హిడెన్‌ హంగర్‌) అని పిలుస్తారని పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాల్లో 0.5 శాతం కంటే తక్కువగా.. 
2009–10లో 4.3:2:1గా ఉన్న ఎన్‌పీకే నిష్పత్తి, 2024–25 నాటికి 10.9:4.4:1కి పడిపోయింది. సేంద్రియ కర్బనమైతే(ఓసీ) సగానికి పడిపోయింది. ఆరోగ్యకరమైన నేలల్లో కనీసం 1.5 శాతంగా ఉండాల్సిన సేంద్రియ కర్బనం దేశంలోని 75 శాతం రాష్ట్రాల్లో 0.75 శాతం కంటే తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 0.5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఈ కారణంగా ఏటా సుమారు 5.3 బిలియన్‌ టన్నుల పైపొర మట్టిని భూమి కోల్పోతుంది. 

2024–25లో దేశవ్యాప్తంగా నిర్వహించిన భూసార పరీక్షల్లో నాలుగింట మూడొంతుల నేలల్లో సేంద్రియ కర్బనం క్షీణించిందని, దక్షిణాది రాష్ట్రాల్లో సల్ఫర్, జింక్‌ లోపాలు అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు. సూక్ష్మ పోషకాల్లో కీలకమైన జింక్‌ లోపం అత్యధికంగా బీహార్‌ రాష్ట్రంలో 67 శాతం ఉంటే.. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 55 శాతం, రాజస్థాన్‌లో 50 శాతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం జింక్‌ లోపం ఉన్నట్టుగా గుర్తించారు. సేంద్రియకర్బనం 0.5 శాతం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యాన, పంజాబ్, రాజస్థాన్‌ ఉన్నాయి. 

ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలంగాణ, 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొటాíÙయం వంటి ఇతర పోషకాల వాడకం 80 శాతం కంటే తక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. నైట్రోజన్‌ (యూరియా)కు ఇస్తున్న సబ్సిడీ సూక్ష్మపోషకాలు, మిశ్రమ ఎరువులకు ఇవ్వడం లేదు. యూరియాపై 85–90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, ఫాస్పరస్, పొటాషియం ఎరువులపై నామమాత్రంగానే సబ్సిడీలు ఇస్తున్నారు. 

దీనివల్ల మెజార్టీ రైతులు తక్కువ ధరకు లభించే యూరియాపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారు. వాడిన నైట్రోజన్‌లో కేవలం 35–40 శాతం మాత్రమే మొక్కలకు అందుతోంది. మిగిలింది భూగర్భ జలాల్లో కలిసి ‘నైట్రేట్‌’ కాలుష్యానికి దారితీస్తోంది. ఫలితంగా నేలల్లో ఉండాల్సిన ఎన్‌పీకే (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాíÙయం) నిష్పత్తి దెబ్బతింటోంది.  

పరిష్కార మార్గాలివే.. 
»  ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందుగానే మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షల ద్వారా కేవలం రసాయన పరీక్షలే కాకుండా, నేల భౌతిక, జీవసంబంధమైన లక్షణాలను కూడా పరీక్షించాలి. 
» ప్రతి రైతుకు సాయిల్‌ హెల్త్‌కార్డులు ఇవ్వడంతో పాటు ఏ భూమిలో ఏ పోషక లోపాలు ఉన్నాయో గుర్తించి సూక్ష్మ పోషకాలను సబ్సిడీపై అందించాలి.  
» సబ్సిడీ విధానంలో మార్పులు తీసుకురావాలి. సమతుల్య ఎరువుల వాడకం ద్వారా అన్ని రకాల పోషకాలు నేలకు అందేలా చూడాలి. 
» బయో–ఫరి్టలైజర్స్‌ (జీవ ఎరువులు), రీజనరేటివ్‌ ఫారి్మంగ్‌ (పునరుత్పాదక వ్యవసాయం), పోషకాలు అధికంగా ఉండే పంట రకాలను ప్రోత్సహించాలి. 
» జీలుగ, జనుము, వంటి పంటలను సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచాలి. 
» రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, బయో ఫర్టిలైజర్స్‌ వాడకం ద్వారా సమీకృత పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి. 
»రైతులకు నేల ఆరోగ్యంపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement