గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ, నిల్వ చట్నీ..
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 70 మందికి చికిత్స
ఒకే మంచంపై నలుగురైదుగురికి సెలైన్లు
ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతున్నా.. తీరు మారని బాబు సర్కారు
గిరిజన విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం
రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అనారోగ్యం బారిన పడి విద్యార్థులు మరణిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నా.. చంద్రబాబు సర్కారులో చలనం కనపడడం లేదు. గిరిజన చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూనే ఉంది. పర్యవసానంగా తాజాగా పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం ఉదయం ఉడకని ఇడ్లీ, నిల్వ శనగపిండి చట్నీ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు ఉండగా వారిలో 89 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 70 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మంది మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్నారు. బొరగ బుజ్జిబాబుదొర అనే విద్యార్థి వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు.
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనేక మంది అనారోగ్య కారణాలతో మరణించినా సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె ఐటీడీఏ పీఓ స్మరణ్‌రాజ్‌తో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇదిలా ఉంటే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో బెడ్లు సరిపోక ఒకే మంచంపై నలుగురైదుగురిని కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


