ఉపాధి పథకం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం
● సీపీఐ నేతల విమర్శ
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడిపించాలని చూడటం కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శనివారం పాడేరు పర్యటనలో భాగంగా ఆదివాసీల సమస్యలపై పార్టీ శ్రేణులతో కలిసి వారు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పాడేరు వైద్య కళాశాలను సందర్శించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వచ్చిన ఉపాధి హామీ పథకం, ప్రస్తుతం పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అని, దీనివల్ల 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు.రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యవసాయ సంక్షోభం దృష్ట్యా కూలీలకు కనీసం 200 పనిదినాలు కల్పించాలని, కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నడిపించాలనుకోవడం కూటమి ప్రభుత్వ చేతకానితనమని వారు మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను మానుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు తదితర కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు పోతురాజు, దేవుళ్లు, సింహాచలం పాల్గొన్నారు.


