breaking news
Alluri Sitarama Raju District News
-
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన
పాడేరు : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ ఘటన చోటుచేసుకుందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. కాశీబుగ్గ ఘటనలో మృతులకు సంతాపంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం పాడేరు పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులకు ప్రత్యేకమైన దినాల్లో ఆలయాల్లో తీవ్ర రద్దీ ఉంటుందని తెలిసి కూడా సరైన భద్రత ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. ఫలితంగా భక్తుల రద్దీ అధికమై తొక్కిసలాట జరిగిన ఏకంగా తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారన్నారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. జరిగిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్‌కు కూటమి నేతలు పూనుకుంటున్నారన్నారు. కల్తీ మద్యం కేసులో ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఉన్నట్టుండి అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ప్రజల దృష్టికి మరల్చేందుకే కూట మి ప్రభుత్వం అరెస్ట్‌ల డ్రామా ఆడుతోందన్నారు. కల్తీ మద్యం ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని జోగి రమేష్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో బడికి, గుడికి వెళ్లిన వారికి ఏమాత్రం రక్షణ లేదనడానికి గత 17 నెలల్లో సంఘటనలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా సుబ్రమణ్యం, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాంగి నాగరాజు, కన్నాపాత్రుడు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు వంతాల నరేష్, బూరా మహేష్, కిల్లు కోటిబాబు నాయుడు, మోదా బాబురావు, రాజేష్ పాల్గొన్నారు. కాశీబుగ్గ ఘటన బాధాకరం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: కాశీబుగ్గ చిన తిరుపతి స్వామి వారి ఆలయంలో భక్తుల తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందడం, 37మంది గాయాలు పాలు కావడం చాలా బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం అరకులోయ వైఎస్సార్ జంక్షన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల తొక్కిసలాట రుద్ర భూమిని తలపించిందన్నారు. కార్తీక ఏకదశి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తే కనీసం సెక్యూరిటీ కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆలయం, పరిసరాలు, రోడ్లు కిక్కిరిసిపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ పాడి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మాడగడ పీసా కమిటీ అధ్యక్షుడు ఎం. బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు బంగురు శాంతి, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్, గుంజిడి ప్రసాద్, బీబీ కామేష్, ఎల్బీ కిరణ్ కుమార్, శేఖర్ పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ఆలయాల వద్ద కానరాని భద్రత ఏర్పాట్లు తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అన్యాయం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం తొక్కిసలాటలో మృతులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన -
ఉచిత బస్సు ప్రయాణం ‘దూరం’
సీలేరు: జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలుపుకొని ముంపు మండలాలకు వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేక ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో జిల్లాల విభజన సమయంలో ముంపు మండలాలను కలుపుకొని భద్రాచలం సరిహద్దు వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాను ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం పాడేరు నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి బస్సు సర్వీసును జిల్లా అధికారులు ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ ప్రాంత ప్రజలతోపాటు విలీన మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. పథకం ప్రకటించక ముందు తిప్పిన బస్సు సర్వీసును తరువాత ఎందుకు నడపడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల కింద ఆల్ట్రా డీలక్స్ బస్సులు నడపడంతో వీటికి ఉచిత బస్సు ప్రయాణం వర్తించక మహిళలు రాయితీకి దూరమవుతున్నారు. విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా రోజుకు మూడు ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు తిరుగుతున్నాయి. నర్సీపట్నం నుంచి సీలేరుకు రెండు, పాడేరు నుంచి డొంకరాయి ఒకటి, రాజమండ్రి నుంచి సీలేరుకు ఒక సర్వీసు తిరుగుతున్నాయి. వీటికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తోంది. కండీషన్లో ఉన్న బస్సులతోపాటు అదనపు బస్సు సర్వీసులు నడకపోవడం వల్ల మహిళలతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విశాఖపట్నం, పాడేరు ప్రధాన డిపోల నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వివిధ ప్రాంతాలకు కండీషన్లో ఉన్న బస్సులతోపాటు ఉచిత ప్రయాణం వర్తించేలా సర్వీసులు నడపాలని సీలేరు ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి కోరారు. సర్వీసులు లేక సౌకర్యం కోల్పోతున్న మహిళలు -
కళా ఉత్సవ్ ఏర్పాట్లపరిశీలన
రంపచోడవరం: మారేడుమిల్లిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏకలవ్య పాఠశాలల రాష్ట్ర స్థాయి కళాఉత్సవ్ ఏర్పాట్లను రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి కళా ఉత్సవ్–2025 ఈ ఏడాది మారేడుమిల్లి ఏకలవ్యలో జరుగుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 5వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురుకుల జాయింట్ సెక్రటరీ ప్రసాద్, డీడీ రుక్మాండయ్య, ప్రిన్సిపాల్ శంకర్, తహసీల్దార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
కొయ్యూరు: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని చిట్టింపాడులో ఏర్పాటు చేసిన దివంగత జెడ్పీటీసీ వారా నూకరాజు సంతాపసభకు విచ్చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. బడి, గుడికి వెళ్లిన వారితోపాటు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు భద్రత కరువవుతోందని విమర్శించారు. ఇందుకు జెడ్పీటీసీ నూకరాజు హత్యే నిదర్శనమన్నారు. ఆయన కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్తామన్నారు. నూకరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున రూ.ఐదు లక్షల చెక్కును అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అమర్నాథ్ అందజేశారు. ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ నూకరాజు తనను కూతురిలా చూసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నామన్నారు. కొయ్యూరు మండలానికి కేటాయించే నిధులు నూకరాజు పేరిట ఇస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ చిట్టింపాడులో నూకరాజు జ్ఞాపకార్థం పార్కు నిర్మిస్తామన్నారు.దీనిపై జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రజలు కోరితే అతని జ్ఞాపకార్థం కళా మందిరం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ నూకరాజు లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ నూకరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నూకరాజు లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీ సంఘ జిల్లా నేత దొండా రాంబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, అనూషదేవి, బోయిన కుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, బి.అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జె.రాజులమ్మ, జల్లి బాబులు, సుధాకర్, అంబటి నూకాలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగుడివాడ అమర్నాథ్ కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు సంతాప సభలో ఆవేదన పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత -
ప్రకృతి సాగు ప్రోత్సాహానికి చర్యలు
● ఏపీ రైతు సాధికారిత సంస్థ ఈడీ బాబురావునాయుడు గూడెంకొత్తవీధి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ రైతు సాధికారిత సంస్థ ఈడీ టి. బాబురావునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రావణాపల్లి, పెదవలస, దేవరాపల్లి పంచాయతీల్లో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం భూమికి మేలు చేస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతుందని తెలిపారు. రైతులు ఈ విధానంలో సాగు చేపట్టాలని కోరారు. ప్రకృతి విధానంలో సాగు చేసిన పంట ఉత్పత్తులకు స్థిరమైన ధరలు కల్పిస్తామన్నారు. పెదవలస పంచాయతీ టెంట్ల వీధిలో రైజ్బెడ్ విధానంలో సాగు చేస్తున్న పసుపు పంటను ఆయన పరిశీలించారు. డీసీఎం భాస్కరరావు, గిరిజన వికాస్ సంస్థ కార్యదర్శి ఎన్. సత్యనారాయణ, కోఆర్డినేటర్లు యమున, రమ్య పాల్గొన్నారు. -
భూ తగాదాలో వ్యక్తి హత్య
● కర్రతో దాడి.. సంఘటన స్థలంలోనే మృతి ● పరారీలో నిందితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు జి.మాడుగుల: భూమి కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు హత్య గురయ్యాడు. మండలంలోని గడుతూరు పంచాయతీ బొబ్బంగిపాడులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గెమ్మెలి సత్తిబాబు(59), భార్య నీలమ్మ నివాసముంటున్న ఇంటికి ఎగువ వీధిలో పాంగి రాంప్రసాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. సత్తిబాబు ఇంటిపక్కన ఉన్న స్థలంలో భార్య నీలమ్మ పేరుమీద ప్రధానమంత్రి జన్మన్ పథకంలో ఇల్లు మంజూరైంది. అయితే పశువులు కట్టుకునేందుకు ఈ స్థలాన్ని రాంప్రసాద్ చాలా కాలం నుంచి సత్తిబాబును అడుగుతున్నాడు. దీనిపై గొడవ కూడా జరుగుతోంది. స్థలం ఇచ్చేందుకు భార్యాభర్తలు అంగీకరించలేదు.ఆ స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పథకం ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిని సహించలేని రాంప్రసాద్ ఆదివారం సత్తిబాబు ఇంటికి వచ్చి కర్రతో దాడి చేశాడు. అడ్డుకున్న భార్య నీలమ్మపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సత్తిబాబు సంఘటన స్థలంలో మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన నీలమ్మను పాడేరు జిల్లా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించినట్టు ఆయన తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ,ఎస్ఐలు హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు వారు తెలిపారు. మృతుడి కుమారుడు గెమ్మెలి సుమంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం
పట్టుకుని వార్డెన్‌కు అప్పగించిన గూడెంకొత్తవీధి పోలీసులు గూడెంకొత్తవీఽధి: పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులను పోలీసులు పట్టుకుని వార్డెన్‌కు అప్పగించారు. స్థానిక ఎస్ఐ సురేష్ శనివారం తెలిపిన వివరాలిలాఉన్నాయి. రింతాడ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గతనెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో గేటు వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులతో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముగ్గురు విద్యార్థినులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీకోసం ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. ము గ్గురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సులో ఉన్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి ఎస్ఐ తీసుకువెళ్లారు. విశాఖ నుంచి తీసుకువచ్చి, పాఠశాల వార్డెన్‌కు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
శాస్త్రోక్తంగా మార్గశిరరాట మహోత్సవం
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశా ఖ వాసుల ఆరాధ్యదైవం కనకమహాలక్ష్మి అమ్మ వారి మార్గశిర మాసోత్సవాల రా ట పూజా కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మాసోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం శనివారం ఉదయం 10.53 గంటలకు నాదస్వర సుస్వారాలు, వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు అమ్మవారి జాకెట్టు ముక్క, తాంబూలం, గాజులు, ప్రసాదం అందజేశారు. ఇప్పటి నుంచి కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలకు విస్త్రత ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో కె.రాజేంద్రకుమార్, కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో ఆగని మృత్యుఘోష
సాక్షి, విశాఖపట్నం: గుడికి వెళ్లి దండం పెట్టుకునేలోపే.. కొందరు దేవుడి దగ్గరికే వెళ్లి పోతున్నారు. భగవంతుడి దర్శనం, దీపదర్శనం చేసుకున్న రోజే.. వారి ఇంట చితి మంటలు వెలిగే రోజుగా మారుతోంది. దైవనామ స్మరణ వినిపించాల్సిన ఆలయాల్లో.. ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీతో కళకళలాడాల్సిన ఆలయాలు.. తొక్కిసలాటలు, గోడ కూలిన ఘటనలతో భయాందోళన కలిగిస్తున్నాయి. మొన్న పవిత్ర తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట, నిన్న సింహాచలం చందనోత్సవ ఘటనలు కళ్లముందే మెదులుతుండగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తజనం ఉలిక్కిపడుతోంది. సింహగిరిపై గోడ కూలి ఏడుగురు మృతి ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం చందనోత్సవం వేళ.. నృసింహుని నామస్మరణతో మారుమోగాల్సిన సింహగిరిపై హాహాకారాలు మిన్నంటాయి. సింహాచలేశుని దర్శించుకుని తరించాలనుకున్న భక్తులు.. స్వామి నిజరూప దర్శనం కాకమునుపే ఆలయ ప్రహరీ కూలిన ఘటనలో ఏడుగురు నిర్జీవులుగా మారారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నెట్టింది. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ అప్పుడు ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ మాట చెప్పి ఏడు నెలలైనా గడవక ముందే.. మరో ఆలయం మృత్యు ద్వారాలు తెరిచింది. పవిత్రమైన కార్తీక ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కలియుగ వేంకటేశ్వరుని దర్శించుకోవాలని వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో చిక్కుకుని మృత్యుఒడికి చేరుకున్నా రు. ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల భద్రత పట్టదా? ఇలా శుభ దినాల్లో స్వామిని దర్శించుకునేందుకు ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడే ప్రభుత్వం మేల్కొని.. రాష్ట్రంలోని చిన్నా పెద్దా అన్ని ఆలయాల వద్ద ముఖ్యమైన పండగలు, శుభదినాల సమయంలో రద్దీని అంచనా వేసి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు, భద్రతపై దృష్టిసారించాల్సింది. కానీ.. ఘటన జరిగిన కొద్ది రోజులకే కూటమి ప్రభుత్వం అంతా మరిచిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయటపడి. సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆలయాల్లో హడావిడి చేసిన యంత్రాంగం.. ఆ తర్వాత అంతా గాలికి వదిలేసింది. ఇప్పుడు మరోసారి అమాయక భక్తులు బలయ్యారు. ముందస్తు చర్యలు శూన్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాశీబుగ్గ ఘటన మూడో పెద్ద దుర్ఘటన. ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు భక్తులు ఊహించని రీతిలో వస్తుంటారు. దాని ప్రకారం ముందస్తు అంచనాలు వేసి, ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొన్ని ప్రైవేట్ ఆలయాలకూ భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇవేమీ పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా.. తరచూ విషాద ఘటనలకు ఆలయాలు కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కార్తీక మాసం, మార్గశిర మాసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆలయంలోనూ భద్రత, ఏర్పాట్లపై సమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఘనంగా అంబలం పూజ
అంబలం పూజభారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప మాలధారులుసాక్షి,పాడేరు: స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి అంబలం పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. వర్తక సంఘ నేత బూరెడ్డి చిట్టిబాబు స్వామి ఆధ్వర్యంలో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఈ పూజను ఏర్పాటుచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా నుంచి అయ్యప్పమాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజ అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. -
బిర్సా ముండా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
● రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్ ● ఘనంగా బిర్సాముండా జయంతి రంపచోడవరం: గిరిజన హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని గిరిజనులు ఎప్పటికీ మరువరాదని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆయన జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పీవో స్మరణ్‌రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, డీఎస్పీ సాయిప్రశాంత్, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరావు, చిన్నం బాబు రమేష్, కోసూరి సత్యనారాయణరెడ్డి, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గొర్లె సునీత బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐటీడీఏ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు. చింతూరు: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం బిర్సాముండా జయంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ముందుగా బిర్సాముండాతో పాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.పురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామల వెంకటరామయ్యను ఆయన సత్కరించారు. అనంతరం స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులతో కలిసి పీవో మొక్కలను నాటారు. డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీవో రామతులసి, ఏవో రాజ్‌కుమార్, ఏఎస్‌డీఎస్ సంస్థ డైరెక్టర్ గాంధీబాబు పాల్గొన్నారు. -
హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..
అల్లిపురం: ఒక హత్య కేసులో నిందితుడు.. చట్టం కళ్లుగప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరకకుండా ఏకంగా హిమాలయాలకు వెళ్లి.. భైరవ స్వామిగా అవతారమెత్తాడు. కాశీ, కేదార్‌నాథ్‌లో నాగసాధువులతో కలిసి తిరుగుతూ.. తన గతాన్ని పూర్తిగా చెరిపేశాననుకున్నాడు. కానీ విశాఖ టూటౌన్ పోలీసులు పక్కా వ్యూహంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఈ దొంగ స్వామి గుట్టును రట్టు చేశారు. శనివారం నగరంలో అడుగుపెట్టిన అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో హత్య చేసి.. నగరంలోని కల్లుపాకలో నివసిస్తున్న ఇసుకతోటకు చెందిన పిచ్చేటి యుగంధర్ (39) అలియాస్ రాఘవపై 2021లో ఒక హత్య కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో యుగంధర్ హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టయిన అతను కొన్నాళ్లకు బెయిలపై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. నగరంలో రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అతనిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో.. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ భైరవ డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో, ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని యుగంధర్ ఆచూకీ కోసం గాలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యుగంధర్ తన రూపురేఖలు మార్చుకుని.. ఏకంగా హిమాలయాలకు మకాం మార్చినట్లు తేలింది. కాశీ, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ‘భైరవ స్వామి’పేరుతో నాగసాధువులతో కలిసి తిరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. తరచూ తన నివాసాన్ని మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. పక్కా స్కెచ్‌తో అరెస్ట్ అయినా పోలీసులు తమ నిఘాను మరింత పటిష్టం చేశారు. యుగంధర్ సన్నిహితుల కదలికలపై సాంకేతిక నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో యుగంధర్ శనివారం నగరానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ టీమ్.. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్ వద్ద మాటు వేసింది. భైరవ స్వామి అవతారంలో, మారువేషంలో సంచరిస్తున్న యుగంధర్‌ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్లుగా చట్టానికి దొరక్కుండా.. స్వామీజీ వేషంలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు, అతని సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. భైరవ స్వామిఅవతారంలోనిందితుడు యుగంధర్ యుగంధర్అసలు రూపం -
నిలిచిన సేవలు... తప్పని అవస్థలు
● గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలకు ఆటంకం ● స్తంభించిన సెల్ సిగ్నల్, నెటవర్క్ వ్యవస్థ జి.మాడుగుల: మండలంలో వంతా పంచాయతీ కేంద్రంలో గల బీఎస్ఎన్ఎల్ సేవలు గడిచిన మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతాల గ్రామంలో శనివారం గిరిజనులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ టవర్ నుంచి సిగ్నిల్స్ వ్యవస్థ సక్రమంగా లేక సచివాలయంలో నెట్ పనిచేయకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గిరిజన ప్రజలు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెప్పారు. సమాచార వ్యవస్థ పనిచేయక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తరచూ బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు చెప్పారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. తాగునీటి సమస్య పరిష్కరించండి వంతాల పంచాయతీలో బండారువీధిలో గత కొన్నాళ్లుగా తీవ్ర త్రాగునీటి సమస్య ఎదుర్కోంటున్నామని గ్రామస్తులు తెలిపారు.గతంలో వేసిన కుళాయి పైపులు శిధిలావస్థకు చేరుకొని నీరంతా వృధా పోతుందని వీధిలోని నీరు రావటం లేదని వారు తెలిపారు.ధీంతో వీధిలో గల మహిళలు కాలినడకపోయి మంచినీటి కోసం ఊటగెడ్డలను ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర జంక్షన్ మలుపు వద్ద నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపుతప్పి వరి పొలాల్లోకి దూసుకుపోయింది. స్థానిక రైతులు గమనించి వెంటనే కారు వద్దకు వెళ్లి అద్దాలు పగుల గొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీశారు. ఈ సంఘటనపై స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం నుంచి కృష్ణాదేవిపేటకు వెళ్తున్న రాజమణి, కరుణాకర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కారులో ప్రయాణిస్తున్నారు. కిండ్ర జంక్షన్ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిందన్నారు. ప్రమాదాన్ని గమనించి అక్కడే ఉన్న రైతులు హుటాహుటిన అక్కడికి వెళ్లి కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న వారిని చాకచక్యంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా సురక్షింతగా ఉన్నారని, ఇద్దరిక స్వల్పగాయాలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు యంత్రాల సహాయంతో కార్‌ను పొలాల్లోంచి తిరిగి రోడ్‌పైకి తెచ్చారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం -
టెన్త్ పరీక్షల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు
● డీఈవో బ్రహ్మాజీరావు పాడేరు : రాబోయే టెన్త్ పరీక్ష కేంద్రాల్లో హజరయ్యే విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుతామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింటాన్స్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో కాంపౌండ్ వాల్, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, ఫర్నిచర్, ఇతర అన్ని సౌకర్యాలను పరిశీలించారు. సౌకర్యాలు లేకపోతే అన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని హెచ్ఎంలకు ఆదేశించారు. ఆయన వెంట ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్. శశికుమార్, విద్యశాఖాధికారులు మోరీ జాన్, సరస్వతిదేవి పాల్గొన్నారు. -
సరుకులు తెచ్చుకోవాలంటే వాగులు దాటాల్సిందే
● వంతెనలు లేక ఎర్నాపల్లి గిరిజనుల అవస్థలు చింతపల్లి: మండలంలో ఎర్నాపల్లి గ్రామ గిరిజనులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎర్రబొమ్మలు పంచాయతీ పరిధిలో గల ఈ గ్రామం నుంచి బయటకు రావాలంటే రెండు వాగులు దాటాల్సిందే. మోంథీ తుపాను ప్రభావం తగ్గినప్పటికీ వీటి ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారు శనివారం ఈ రెండు వాగులను దాటాల్సి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంపై వాగులపై వంతెనలు నిర్మించాలని వారు కోరుతున్నారు. -
కాకిలెక్కలు
పంట నష్టం అంచనాల్లోసాక్షి,పాడేరు: జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి అధికారులు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న లెక్కలు వేర్వేరుగా ఉండటంతో సర్వే తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వరితోపాటు రాగులు,ఇతర చిరుధాన్యాల పంటలకు సంబంధించి గురువారం నాటికి 1501 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు కలెక్టరేట్ నుంచి ప్రకటన విడుదల అయింది. పూర్తిస్థాయి సర్వే అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అయితే శనివారం సాయంత్రానికి పంట నష్టం లెక్కలు మారిపోయాయి. అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు, కొయ్యూరు, దేవీపట్నం మండలాల్లో కేవలం అన్ని పంటలు కలిపి 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నందు ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. జిల్లాలో పంట నష్టం సర్వే ఏవిధంగా జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం పెరుగుతుందని అంతా భావించిన తరుణంలో తగ్గడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.వరితో పాటు రాగులు,సామలు,కొర్రలు తదితర పంటలు ముంపునకు గురయ్యాయి.పైరు పలు చోట్ల నేలవాలింది. నష్టం గుర్తించడంలో సర్వే పారదర్శకంగా జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ● హుకుంపేట మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మాసాడ ప్రాంతంలో ఎకరా విస్తీర్ణంలో కోసిన వరి పనలు తుపానుకు తడిచిపోయాయి. వీటిని ఆరబెట్టేందుకు శనివారం బయటకు తీయగా మొలకలు రావడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మూడు రోజుల్లో పంట నష్టం సర్వేకు అధికారులు, సిబ్బంది ఎవరూ రాలేదని వారు వాపోతున్నారు. పారదర్శకంగా సర్వేలు జరగని ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో వరిపైరుకు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లగా బాధిత రైతులు 200మంది వరకు ఉంటారని అంచనా. వరిపంట ముంపునకు గురవ్వడం, నేలవాలడంతో సుమారు రూ.10లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.అలాగే సుమారు 120 ఎకరాల్లో రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినగా సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అరకులోయ టౌన్: తుపాను ప్రభావానికి అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి(రాగులు) పంటలకు నష్టం వాటిల్లింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టశాతం చూడకుండా పరిహారం ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 33 శాతం పైబడి నష్టం వాటిల్లిన రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో 33 శాతం లోపు పంట నష్టపోయిన వందలాది మంది గిరిరైతులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో మాత్రమే 33 శాతం పంట నష్టం జరిగిన రైతుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని అరకులోయ వ్యవసాయశాఖ ఏడీ వంగవీటి మోహన్‌రావు తెలిపారు. డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు మండలాల్లో 33శాతానికి పైబడి ఎటువంటి పంట నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. ● నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 33శాతం లోపు నష్టపోయిన రైతులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వంద ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరి సుమారు 65 ఎకరాలు, చోడి సుమారు 35 ఎకరాల్లో దెబ్బతింది. సుమారు రూ.15 లక్షలమేర పంట నష్టం వాటిల్లింది. అయితే 33శాతానికి మించి నష్ట పోయిన వారిలో అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో 102 మంది రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 36.07 ఎకరాల్లో రూ.4,59,347 మేర నష్టం జరిగిందని వారు తెలిపారు. వరి 25.77, చోడి 10.30 ఎకరాల్లో దెబ్బతిన్నట్టుగా వారు పేర్కొన్నారు. దేవీపట్నం / రాజవొమ్మంగి: మోంథా తుపానుకు తీవ్రంగా పంటలు నష్టపోయామని, ప్రభుత్వం పారదర్శకంగా నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో 16 మందికి చెందిన 21.66 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగిందని వారు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికి అధికారులు ఓ అంచనాకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల్లో పక్వానికి వచ్చిన మినుము పంట తుపాను వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని వారు తెలిపారు. రాజవొమ్మంగి మండలంలో పత్తి, బర్లీ, మిరప పంటలపై ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పత్తిపైరు నేలవాలింది. కొండపోడులో సాగు చేస్తున్న బర్లీ పొగాకుకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అక్కడక్కడ సాగు చేపట్టిన మిరప పైరు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. పంట నష్టం 38.36 హెక్టార్లు తుపాను వర్షాలకు జిల్లాలోని ఆరు మండలాల్లో 38.36 హెక్టార్లలోనే వరితో పాటు అన్ని పంటలకు నష్టం ఏర్పడింది. పంట నష్టాలపై సమాచారం ఉన్నచోట సర్వే జరిపాం. మొదట్లో పంట నష్టం ఎక్కువగా ఉంటుందని భావించాం. వర్షాలు తగ్గిన తరువాత పంట నష్టాలపై సర్వే జరపగా తక్కువగా కనిపించింది. – ఎస్బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు చాలా చోట్ల సర్వేకు రాలేందటున్నబాధిత రైతులు 1501 హెక్టార్లలో నష్టం జరిగిందనితొలుత కలెక్టరేట్ ప్రకటన ఇప్పుడు 38.36 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందంటున్నజిల్లావ్యవసాయాధికారి నందు పొంతన లేని పంట నష్టం వివరాలు పారదర్శకంగా చేపట్టలేదనిగిరి రైతుల ఆవేదనమోంథా తుపానుకు జరిగిన పంట నష్టానికి సంబంధించిన అంచనాలురోజుకోరకంగా ఉంటున్నాయి. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పంట భూములను ముంచెత్తాయి. దీంతో వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నష్టం ఎక్కువగా జరిగినప్పటికీ అధికారులు చేపట్టిన సర్వే కాకిలెక్కలను తలపిస్తోందని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాల గేటుకు తాళం
చింతూరు: స్వీపరు పోస్టు కోసం జరిగిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పాఠశాల గేటుకు తాళం వేసిన ఘటన మండలంలోని పెదశీతనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడకం సుబ్బారావు తాత బుచ్చయ్య గతంలో పాఠశాలకు స్థలాన్ని దానం చేశాడు. ఈ స్థలాన్ని దానం చేసిన తమ కుటుంబానికి కాకుండా వేరే మహిళకు స్వీపర్ పోస్టు ఇవ్వడంపై సుబ్బారావు అభ్యంతరం వ్యక్తంచేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన అతను శనివారం పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను సమీపంలోని రచ్చబండపై కూర్చోబెట్టారు. సుమారు గంటన్నర అనంతరం ఎస్ఐ రమేష్ గ్రామానికి చేరుకుని గేటు తాళాలు తీయించి విద్యార్థులను పాఠశాలలోకి పంపారు. అనంతరం ఆయన సుబ్బరావుతో పాటు ప్రస్తుతం స్వీపర్‌గా పనిచేస్తున్న శైలజ అనే మహిళకు చెందిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్ఎంసీ తీర్మాన ప్రకారం నాలుగేళ్ల నుంచి శైలజ స్వీపర్‌గా చేస్తోందని ఇప్పుడు ఎలా తొలగిస్తారంటూ ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై ఇరు వర్గాలతో చర్చించిన ఎస్ఐ మాట్లాడుతూ ఘర్షణ పడకుండా పాఠశాల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఎంఈవో–2 గుండి వెంకటేశ్వర్లు కూడా పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఉపాధ్యాయులు, గ్రామస్తులనుంచి వివరాలు తెలుసుకున్నారు.రచ్చకెక్కిన స్వీపర్ పోస్టు వివాదం తెరిపించిన ఎస్ఐ రమేష్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఇరువర్గాలకు సూచన -
చేపల వేటలో వినూత్నం
బొత్త పద్ధతిలో ఎరచింతూరు: ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు చేపలవేట సాగించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మండలంలోని పెదశీతనపల్లికి చెందిన శ్యామల చిన్నరాజులు సోకిలేరు వాగులో వినూత్నంగా బొత్త పద్ధతిలో చేపలవేట కోసం ఏర్పాటుచేసిన ప్రక్రియ అబ్బుర పరుస్తోంది. వాగు ఒడ్డున తాటాకులు, వెదురు బొంగులతో చిన్నపాటి చెరువులా గొయ్యని ఏర్పాటుచేసి అందులోకి చేపలు వచ్చేలా ఓ మార్గం ఏర్పాటుచేసాడు. ఆ నీటిలో తాటాకులు, పచ్చి కొమ్మలు, వేశాడు. అనంతరం దానిలో రెండు, మూడ్రోజుల పాటు ప్రతిరోజూ వరిపొట్టు, అన్నం, నూకలు వేస్తున్నట్లు చిన్నరాజులు తెలిపాడు. ఆహారాన్ని తినేందుకు వచ్చిన చేపలు పచ్చిరొట్టలో ఇరుక్కుని ఉంటాయని, చేపలు ఇరుక్కున విషయాన్ని గమనించి అవి తిరిగి బయటకు వెళ్లకుండా ద్వారం మూసేస్తానని తెలిపాడు. అనంతరం పచ్చిరొట్టలో ఇరుక్కుపోయిన చేపలను సేకరిస్తానని తెలిపారు. -
కన్నులపండువగా శ్రీనివాసుని కల్యాణం
● తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహణ ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం చింతపల్లి: కలియుగ దైవం శ్రీనివాసుని కల్యాణం కన్నులపండువగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్రాలగొప్పు సమీప నూకాంబిక ఆలయ ప్రాంగణంలో శనివారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్ పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఉదయం 11 గంటలకు టీటీడీ ప్రధాన అర్చకుడు శ్రీ సాయిస్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిగింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, కొయ్యూరు తదితర మండలాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. గొందిపాకుల వలంటీర్ల బృందం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రోగులకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఇందుకు గొందిపాకల గ్రామస్తులు విరాళాలు అందించి సహకరించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్, గొందిపాకల, ఎర్రబొమ్మలు సర్పంచ్‌లు సాగిన వరలక్ష్మి, లోతా పండన్న, ఎంపీటీసీలు మోహన్‌రావు, సత్తిబాబు, హిందూ ధర్మప్రచార పరిషత్, కల్యాణ ప్రాజెక్టు ఆర్గనైజర్లు హరికృష్ణ, చెంగలరావు, ప్రోగ్రాం అసిస్టెంట్లు చల్లా సత్యనారాయణ, కె.మహేశ్వరరెడ్డి, కార్యనిర్వాహకులు గెమ్మిలి అబ్బాయినాయుడు, బౌడు గంగరాజు, కుశలవుడు,సింహాచలం, యశ్వంత్, వెంకటేష్, రామ్మూర్తి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవులు
● విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నాగభూషణం ● రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగాకృష్ణారావు సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవీవీ నాగభూషణం(అరకులోయ), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బూసారి కృష్ణారావు(పాడేరు) నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది.కృష్ణారావు నాగభూషణం -
ఆకట్టుకున్న సాంస్కృతికనృత్యోత్సవాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పేరుతో తొలిసారిగా మోద అవార్డ్స్–2025 గిరి శీతల సాంస్కృతిక నృత్యోత్సవాలను స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే భరతనాట్యం, కూచిపూడి పోటీలకు అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు తరలివచ్చారు. పోటాపోటిగా చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిరోజు పోటీల్లో పాల్గొన్న బాలికలకు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గిడ్డి ఈశ్వరి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నృత్యాంజలి డ్యాన్స్ అకాడమి గురువు చైతన్యప్రభు, గిరి కై లాస క్షేత్రమండలి సభ్యురాలు కొట్టగుళ్లి రమాదేవి, ఇతర ప్రతినిధులు కొండపల్లి సత్యవతి, నిర్మల, వెంకటరావు పాల్గొన్నారు. -
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏలో సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పీవో స్మరణ్‌రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత, సమగ్రత కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఏపీవో డీఎన్వీ రమణ, మేనేజర్ రాజు పాల్గొన్నారు. చింతూరు: సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఐటీడీఏలో ఏక్తాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తదితరులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఏక్తా, సమగ్రత, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఏపీవో రామతులసి, ఏవో రాజ్‌కుమార్, ఎస్డీసీలు చంద్రశేఖర్, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ కూనవరం: గిరిజన ప్రాంతాల్లో ఏఎస్‌డీఎస్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమలు అభినందనీయమని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. మండల పరిధిలోని బొజ్రాయిగూడెం, తాళ్లగూడెం, కొడేరు, రావిగూడెం గ్రామాల్లో 287 గిరిజన కుటుంబాలకు ఏఎస్‌డీఎస్ సంస్థ సమకూర్చిన నిత్యావసర కిట్లను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీవో శుభం నొఖ్వాల్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు, నాగిరెడ్డి, రాము, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి నిర్మూలనకు సహకరించండి
సీలేరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ జెన్ కో సెక్యూరిటీ విజిలెన్‌న్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఇన్చార్జి ఈఈ జయపాల్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సెక్యూరిటీ విజిలెన్స్ ఇన్చార్జి కోటేశ్వరరావు, ఏవో సత్యనారాయణ, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. మోతుగూడెం: విజిలెన్స్ అవేర్నెస్ వీక్‌లో భాగంగా శుక్రవారం ఏపీ జెన్కో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం డీఏవీ స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. చీఫ్ ఇంజనీర్ రాజారావు, ఎస్ఈ చినకామేశ్వరరావు, డీఈ బాలకృష్ణ, సెక్యూరిటీ ఇన్చార్జి ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమబోర్డు
● ఏర్పాటుకు ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ అమర్ డిమాండ్ పాడేరు రూరల్: అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ అమర్ డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రం పాడేరులోని అంబేద్కర్ కూడలిలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 105 సంవత్సరాల చరిత్ర గల పోరాట కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. కార్మికుల చట్టాలు, హక్కులను నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు రమేష్, అప్పలరాజు, శ్రీను, అశోక్ పాల్గొన్నారు. -
దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. సంబల్పూర్–బెంగళూరు కంటోన్మెంట్ (08335) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–సంబల్పూర్ (08336) స్పెషల్ రైలు ఈనెల 24వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2 గంటలకు దువ్వాడకు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. కటక్–బెంగళూరు కంటోన్మెంట్ (08445) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 21వ తేదీ ఉదయం 5 గంటలకు కటక్‌లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు మధ్యాహ్నం 10.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–కటక్(08446) స్పెషల్ రైలు ఈనెల 25వ తేదీ ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2 గంటలకు దువ్వాడకు, అదేరోజు ఉదయం 11.30 గంటలకు కటక్ చేరుకుంటుంది. -
గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
సీలేరు: మోంథా తుపాను ధాటికి ఏపీ జెన్ కో సీలేరు నుంచి డొంకరాయి వెళ్తున్న 33 కెవి విద్యుత్తు వైర్లపై రెండు భారీ వృక్షాలు కూలిపోవడంతో మంగంపాడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి మండల సబ్ స్టేషన్ నుంచి దుప్పులువాడ స్టేషన్ వచ్చే 33 విద్యుత్ వైర్లపై సంపంగి గొంది అటవీ ప్రాంతం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ చెట్టు కూలిపోయింది. దీంతో దుప్పుల వాడ. దారకొండ. గుమ్మురేవుల. అమ్మవారి దారకొండ వంటి పంచాయతీ వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. -
70 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: స్థానిక పోలీసులు శుక్రవారం 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఏడు సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు... ముందగా అందిన సమాచారం మేరకు స్థానిక విల్లా ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన ఆటోను పరిశీలించగా గంజాయి బయటపడింది. 35 ప్యాకెట్లలో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కుమార్, కొర్రా సత్తిబాబు, పాంగి ధర్మరాజు, కొర్రా బొంజిబాబు, సిందేరి జక్రయ్య, సేనాపలి మాణిక్యంలను అరెస్టు చేసినట్టు సీఐ చెప్పా రు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో హెచ్‌సీ జి.మధుబాబు, పీసీలు ఎల్.రాజశేఖర్, డి.గోపి, బి.ఉమామహేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, వై.లక్ష్మణ్, బి. మహేశ్వరరావు, కె.బ్రహ్మాజీ, జె. కృష్ణ, పాల్గొన్నారు. -
కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు రూరల్: కాఫీ కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కార్మికులు ఏపీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ 2024లో కాఫీ కార్మికులతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినప్పటికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు, ఏటా అక్టోబర్‌లో పెంచాల్సిన రోజువారీ కూలి ధరలు ఈ ఏడాది పెంచలేదన్నారు. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదన్నారు. దీనివల్ల ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందన్నారు. హెల్పర్లకు ప్లాంటేషన్ కండక్టర్‌గా పదోన్నతి కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్మికులు చిన్నలమ్మ, అప్పలమ్మ, లక్ష్మి, కాంతామణి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్ -
గ్రామాల్లో రన్ ఫర్ యూనిటీ
రంపచోడవరం/ముంచంగిపుట్టు/జి.మాడుగుల/కొయ్యూరు/సీలేరు/అడ్డతీగల/రాజవొమ్మంగి: పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు యూనిటీ రన్‌ను శుక్రవారం నిర్వహించారు. జాతీయ జెండాలతో పురవీధుల్లో పోలీసులతో కలిసి విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పోలీసుల త్యాగాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో డీఎస్పీ సాయి ప్రశాంత్, సీఐలు, ఎస్ఐల, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు తదితరులు మాట్లాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగులు మరువలేనివన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తుందన్నారు. దేశరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ఎందరో పోలీసులు సంఘ విద్రోహుల చేతుల్లో అశువులు బాశారన్నారు. ప్రతీ పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలని వారు తెలిపారు.ప్రజాస్వామ్యం, సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగనిరతికి జోహర్లు అర్పించారు. రంపచోడవరంలో డీఎస్పీ సాయిప్రశాంత్ ఆధ్వర్యంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ రామకృష్ణ, జి.మాడుగులలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు, సీఆర్పీఎఫ్ 198బిఎన్ అసిస్టెంట్ కమాండెంట్ వినయ్గన్ తదితరులు పాల్గొన్నారు. కొయ్యూరులో సీఐ శ్రీనివాసరావు, కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్‌వర్మ, శంకర్రావు , ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్, అధ్యాపకులు పాల్గొన్నారు. సీలేరులో ఎస్ఐ యాసీన్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అడ్డతీగలలో సీఐ బి.నరసింహమూర్తి, ఎస్ఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగిలో సీఐ గౌరీ శంకర్, ఎస్ఐ చినబాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతూరులో సీఐ గోపాలకృష్ణ ,ఎస్ఐ రమేష్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ తదితరులు పాల్గొన్నారు. మోతుగూడెంలో ఎస్ఐ ఎస్కె సాధిక్ , సీఆర్పీఎఫ్ డీఎస్పీ లలిత్‌కుమార్, జెన్కో సెక్యూరిటీ ఇన్చార్జి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
అరకులోయటౌన్: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం దిగివచ్చి నిలుపుదచేసే వరకు పోరాడుదామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు.మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ కొర్రాగుడ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులకు గ్రామ మహిళలు గిరిజన సంప్రదాయంగా తిలకం దిద్ది, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలు, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రైవేట్ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్మించకపోగా, ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. దీంతో పేదలు, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీఅధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాడవాడలాల కోటి సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను గిరిజనులను వివరిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దిగివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎంపీటీసీలు శత్రుఘ్న, దురియా ఆనంద్ కుమార్, స్వాభి రామచందర్, సర్పంచ్‌లు కొర్రా రాధిక, పాడి రమేష్, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్ కుమార్, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్, నాయకులు కమిడి అశోక్, సుందర్రావు, కామేష్, నగేష్, ఏలేష్, ధర్మనాయుడు పాల్గొన్నారు. అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని కోనపురం పంచాయతీ కితలంగి, బొండ్యగుడ గ్రామంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలన్నారు. అనంతరం బొండ్యగుడ గ్రామంలో తుపానుధాటికి కూలిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్పంచ్‌లు గుబాయి రఘునాథ్, సెంబి సన్యాసిరావు, స్వాభి అప్పలరాజు, నాయకులు సత్యనారాయణ, మిటుకు, రఘునాథ్, రామచందర్, సుందర్రావు, సుందర్రావు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలో గల కర్రిముఖిపుట్టు పంచాయతీ దూళిపుట్టు, గొర్రెలమెట్ట, సరసంగి, వెచ్చంగి గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి ముఖి రాంప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలు వివరించడంతో స్వచ్ఛంధంగా సంతకాలు చేసి గిరిజనులు మద్దతూ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలనే సదుద్దేశ్యంతో వైఎస్సార్సీపీ చేసే మంచి కార్యక్రమానికి ప్రజల మద్దతూ తెలపాలని ఆయన కోరారు. నాయకులు అర్జున్, చలపతి, జోగారావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుదాం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ దినేష్‌కుమార్ ● 135 అర్జీల స్వీకరణపాడేరు : సమస్యలు పరిష్కారంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ దినేషకుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇతర అధికారులతో కలిసి ఆయన 135 వినతులను స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100ను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కార సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బీఎస్ నందు, డీపీవో చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల అధికారి రమణారావు, జిల్లా ప్లానింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. -
రాత్రి వేళల్లో డ్రోన్ల సంచారంపై ఫిర్యాదు
● ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ● బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ అరకులోయ టౌన్: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించే పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగురుతుండటంపై పాడేరు డీఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తెలిపారు. శుక్రవారం ఆయన గిరిజన సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాత్రివేళ డ్రోన్లు ఎగురుతుండటంపై పరిసర గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం అరకులోయ మండలంలోని తోరడంవలస, లండిగుడ, అనంతగిరి మండలం వేంగడ, మెట్టుపాడు, గాఫ్యవలస, గోమంగి పాడు, దాళిమ్మపుట్టు, కొత్తవలస, వాలసీ, హుకుంపేట మండలం మజ్జివలస, కుసుమవలస, పట్టాం పరిసరాల్లో బుధవారం, గురువారం రాత్రి వేళల్లో డ్రోన్లు ఎగరడాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారన్నారు. నవయుగ కంపెనీకి చెందిన వ్యక్తులే ఇందుకు కారణం కావచ్చని అనుమానిస్తున్నామన్నారు. సర్వేలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనుమానితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీ ప్రకటించారని, ఇప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, రాము, కిల్లో బుజ్జిబాబు, వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బురిడి దశరథ్, జిల్లా కో కన్వీనర్లు జగన్నాథం, మగ్గన్న పాల్గొన్నారు. -
అన్నవరం పోలీసుస్టేషన్ తనిఖీ
చింతపల్లి: మండలంలోని అన్నవరం పోలీసుస్టేషన్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ శుక్రవారం తనిఖీ చేశారు.చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి పోలీస్‌స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు.అనంతరం రికార్డులను పరిశీలించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా గుర్తింపు తెచ్చేందుకు పోలీసులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా కాకుండా ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ చేపట్టాలన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా రవాణా అవుతున్న దృష్ట్యా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. -
పోలీసుల సాయంతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు
కొయ్యూరు: ఆస్పత్రికి వచ్చేందుకు నిరాకరించిన గర్భిణిని ఎట్టకేలకు పోలీసుల సాయంతో వైద్య సిబ్బంది తరలించారు. వివరాలిలా ఉన్నాయి. బూదరాళ్ల పంచాయతి లోయలపాలెంకు చెందిన డిప్పల సంధ్య ప్రసవానికి అక్టోబర్ 22 గడువు ఇచ్చారు. ఇది దాటి పదిరోజులైన ప్రసవం కాలేదు. దీంతో ఆందోళన చెందిన వైద్యసిబ్బంది ఆమెను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులను బతిమలాడారు. అయినప్పటికీ గర్భిణి నిరాకరించింది. దీంతో వైద్యసిబ్బంది మంప పోలీసులను ఆశ్రయించారు. వారు లోయలపాలెంలోని గర్భిణి వద్దకు వచ్చి నచ్చజెప్పారు. అనంతరం 108 వాహనంలో శుక్రవారం రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన వైద్యులు శనివారం నరీపట్నం ఆస్పత్రికి తరలించనున్నారు. -
పక్కాగా వారాంతపు ప్రణాళిక అమలు
పాడేరు : పీహెచ్‌సీల వారీగా గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన వైద్య సేవలపై రూపొందించిన వారంతపు ప్రణాళికను పక్కాగా అమలు చేసి శతశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ సూపర్వైజర్లతో జూమ్ ద్వారా వారంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో 12 రకాల వైద్య సేవలను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోజుకు 25 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి చికిత్స అందించాలన్నారు. మాతా, శిశువులకు నిర్దేశించిన సమయానికి టీకా వేయాలన్నారు. కీటక జనిత వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన తెలుసుకున్నారు. రాఫిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్వైజర్ల సాయంతో గుర్తించిన మలేరియా కేసులకు సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రోగ నిర్థారణ అయితే వైద్యం అందించాలని సూచించారు. క్షయ రోగులకు నెలకు పౌష్టికాహార నిమిత్తం అందించే రూ.వెయ్యి సకాలంలో అందేలా చూసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలు నిర్వహించినప్పుడు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు. పచోడవరం డివిజన్ మారేడుమిల్లి పీహెచ్సీ, తాడేపల్లి ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్‌లో సీహెచ్వోగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన డి. చైతన్య ప్రియ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల చెక్కును డీఎంహెచ్‌వో అందజేశారు. ఈ క్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్, డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ సరిత, జిల్లా కుష్టువారణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి, జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ కమలకుమారి,యాక్సిస్ బ్యాంకు నోడల్ అధికారి పి. శ్యాంబాబు, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఏవో సత్యనారాయణ పాల్గొన్నారు.డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ -
మారేడుమిల్లి ఏకలవ్యలో కళా ఉత్సవ్
● ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లను పరిశీలించిన పీవో స్మరణ్‌రాజ్ రంపచోడవరం: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కళా ఉత్సవ్–2025ను ఘనంగా నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. శుకవ్రారం ఆయన మారేడుమిల్లి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు కళా ఉత్సవ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన గ్రూప్ డ్యాన్సులు, పాటలు, గిరిజన తెగల వాయిద్యాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రిన్సిపాల్ శంకర్‌ప్రసాద్, ఏడీఎంఅండ్‌హెచ్‌వో సరిత, ఎంపీడీవో బాపన్నదొర, ఎంఈవో ముత్యాలరావు, తహసీల్దార్ బాలాజీ, ఆర్ఐ ఏసుబాబు పాల్గొన్నారు. -
‘హైడ్రోపవర్’ పోరాటంపై కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదు
చింతపల్లి: హైడ్రోపవర్ ప్రాజెక్ట్, పంప్డ్ స్టోరేజ్ బాధిత గిరిజనుల తరఫున పోరాటం చేస్తున్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని వ్యాఖ్యలను కలెక్టర్ దినేష్ కుమార్ వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఎర్రవరం హైడ్రోపవర్ బాధిత గిరిజన సంఘ కన్వీనర్ బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్నాపల్లిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరుతో పోరాటాలు చేయడాన్ని కలెక్టర్ తప్పుపట్టారన్నారు. పోరాటాల్లో పాల్గొన్న నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని ఎస్పీ సమక్షంలో ఆయన హెచ్చరించడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతంలో భూబదలాయింపు చట్టాలు ఉన్నప్పటికీ భూభాగాన్ని ఖనిజాలు, ప్రాజెక్టుల పేరుతో కళ్లముందే ఆదివాసీలు కోల్పోతున్నప్పుడు రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.ఆదివాసీ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని అదాని, నవయుగ, షిరిడిసాయి వంటి ప్రైవేట్ సంస్థలకు జీవోలు ఇచ్చి రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారని మండి పడ్డారు. ప్రాజెక్టుల్లో గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని కలక్టర్ ప్రకటించారని, గిరిజన ప్రాంతంలో తమ ఉద్యోగాలే తమకు లేవని.. అలాంటిది ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనంతగిరి, అరకు, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు గిరిజన చట్టాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. గిరిజన చట్టాలను కాపాడాల్సిన కలక్టర్ పోరాటాలు చేస్తున్న గిరిజన నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకూ సమంజస మన్నారు. ప్రాజెక్టులు పేరుతో ఆదివాసీలను గిరిజన భూబాగం నుండి గెంటివేసే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఒకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రబొమ్మలు సర్పంచ్ లోతా పండయ్య, ఉప సర్పంచ్ సెగ్గే సోమరాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షులు పాంగి దనుంజయ్, కోకన్వీనర్ వెంకటేశ్వర్లు ,తాంబేలు బాబూరావు, పాంగి కామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా గౌరవఅధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ -
కాటుక బంతి కన్నీరు
సాక్షి,పాడేరు: మార్కెట్లో డిమాండ్ ఉన్న సీతమ్మ కాటుక రకం బంతి సాగు చేపట్టిన రైతులకు మోంథా తుపాను నష్టం మిగిల్చింది. పూత సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడురోజులపాటు కురిసిన వర్షాలకు బంతితోటలు నేలవాలగా పూలు కుళ్లిపోయాయి. మొగ్గలు వాడిపోయాయి. పంట చేతికందే సమయంలో మోంథా తుపాను తీరని నష్టం మిగిల్చిందని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. ● పాడేరు మండలంలో డి.గొందూరు, బరిసింగి, డోకులూరు, ఇరడాపల్లి, గుత్తులపుట్టు, గబ్బంగి, చింతలవీధి, జి.ముంచంగిపుట్టు, వంజంగి, వనుగుపల్లి, హుకుంపేట మండలంలోని సూకురు, మట్టుజోరు, గూడ, హుకుంపేట, తాడిపుట్టు, మఠం, తడిగిరి, శోభకోట, పెదబయలు మండలంలో పెదకోడాపల్లి, గంపరాయి, జి.మాడుగుల మండలంలో కోడాపల్లి పంచాయతీల పరిధిలోని ప్రాంతాల్లో 200 ఎకరాల్లో సాగు చేపట్టారు. ● మోంథీ తుపాను వర్షాలకు సుమారు 100 ఎకరాల్లో బంతి తోటలకు నష్టం వాటిల్లింది. మెట్ట, కొండపోడు భూముల్లో సాగు చేపట్టిన ఈ తోటల ద్వారా ఎకరాకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది.ఇప్పుడిప్పడే పూత ప్రారంభమైంది.ఈ సమయంలో వర్షాలకు తోటలకు పూర్తిగా నష్టం ఏర్పడింది. ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉంది. మార్కెట్లో పరిస్థితులు కలిసివస్తే ఆదాయం కూడా బాగుంటుందని గిరి రైతులు ఆశించారు. ప్రకృతి తుపాను రూపంలో వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ● ఏజెన్సీలో బంతిపూలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు బుట్ట పూలను రూ.100 నుంచి రూ.200 ధర మధ్య కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తారు. రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. వచ్చే జనవరి నెల వరకు మన్యంలో బంతిపూల అమ్మకాలు భారీగా జరిగేవి. ఈ ఏడాది నెలకొన్న పరిస్థితి అమ్మకాలను బట్టి ఏజెన్సీలో సంతల్లో బంతిపూల అమ్మకాలు లేనట్టేనని వ్యాపారులు అంటున్నారు. గిరి రైతులను నష్ట పరిచిన మోంథా తుపాను వర్షాలకు నేలవాలిన తోటలు కుళ్లిపోయిన పూలు వాడిపోయిన మొగ్గలు పెట్టుబడులు దక్కని పరిస్థితి పంట చేతికందే సమయంలో కోలుకోలేని దెబ్బ కోలుకోలేని దెబ్బ తుపాను వర్షాలు బంతిపంటను నాశనం చేశాయి. ఎకరా విస్తీర్ణంలో వేసిన కాటుక రకం బంతి తోట పూర్తి పాడైంది. వేళ్లు నానిపోవడంతో వాడిపోతున్నాయి. తోటంతా నేలవాలింది. రూ.20వేల ఆదాయం రావాల్సిన బంతి తోట ఎందుకు పనికిరాకుండా పోయింది. – గొరపల్లి ప్రసాద్, బంతి రైతు, బరిసింగి, పాడేరు మండలం -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి ఎంపిక
ముంచంగిపుట్టు: రాష్ట్రస్థాయి అండర్ 17 కబడ్డీ పోటీలకు మండలంలోని పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో టెన్త్ చదువుతున్న వంతాల పాపారావు ఎంపికయ్యాడు. ఇటీవల పాడేరులోని తలరిసింగ్ క్రీడా మైదానంలో జరిగిన అండర్ 17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాడు. మండలంలోని రంగబయలు పంచాయితీ జర్రెలపొదర్ గ్రామానికి చెందిన పాపారావు ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్ఎం కె.నారాయణ, పీడీ విశ్వనాథం,ఉపాధ్యాయులు గజేంద్ర, గుండుపడాల్, జగన్నాథం, ప్రసాద్ తదితరులు అతనిని అభినందించారు. -
పాడేరు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం
పాడేరు : ఆదికర్మయోగి అభియాన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు, కెరియర్ ప్లాన్ నిర్మించేలా తయారుచేసిన విలేజ్ యాక్షన్ ప్లాన్‌కు గుర్తింపు లభించిందని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాడే రు ఐటీడీఏకు ఆది కర్మయోగి పురస్కారం అందజేసినట్టు ఆమె పేర్కొ న్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐటీడీఏలోని తన చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాలను సమూలంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బిర్సాముండా జయంతి పురస్కరించుకుని జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలను శనివారం నుంచి ఈనెల 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఐటీడీఏ నుంచి స్థానిక కాఫీ హౌస్ వరకు కార్నివాల్ నిర్వహిస్తామన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా వివిధ ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కాఫీ హౌస్‌లో మొక్కలు నాటుతామన్నారు. బిర్సా ముండా, గిరిజన స్వతంత్య్ర సమరయోధుల చిత్రపటాలలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు. ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి గిరిజన సంస్కృతి, కళలు, వేషధారణ తదితర అంశాలపై డాక్యుమెంటరీ చేస్తామన్నారు. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న గిరిజనులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె పిలపునిచ్చారు. విలేజ్ యాక్షన్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు నేటి నుంచి 15 వరకు జన జాతీయ గౌరవ దివస్ మహోత్సవాలు పీవో తిరుమణి శ్రీపూజ -
రక్షణలేనిప్రయాణం
మన్యం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదం కలిగించే ఘాట్‌రోడ్డు ప్రయాణం.. నేటి పరిస్థితి ఇందుకు భిన్నం. జిల్లాలో పాడేరు, అనంతగిరి, మారేడుమిల్లి, రంపుల ఘాట్మార్గాల్లో ప్రయాణం ప్రమాద కరంగా మారింది. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తోందని ప్రయాణి కులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాడేరు ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ మార్గంలో అధ్వాన పరిస్థితులు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వర్షం పడితే చెరువే! ప్రమాదాల నివారణకు చర్యలు పాడేరుతో పాటు అన్ని ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐదు మీటర్ల మేర వెడల్పు చేసేందుకు అంచనాలు రూపొందించాం.అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. – బాలసుందరబాబు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, ఆర్అండ్బీ, పాడేరు జారిపడుతున్న కొండచరియలు, బండరాళ్లు అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం సీలేరు: అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో గూడెంకొత్తవీధి నుంచి ధారాలమ్మ తల్లి గుడి వరకు, సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 40 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారింది. అటవీప్రాంతాల్లో నీరు రోడ్డుపైకి వచ్చేయడంతో కోతకు గురైంది. వర్షం కురిసినప్పుడల్లా గోతులు చెరువులను తలపిస్తున్నాయి. గతేడాది వీటిని పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. గత సంక్రాంతి నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో సంభవించిన భారీ తుపానుకు గూడెంకొత్తవీధి నుంచి సీలేరు వరకు కొండచరియలు విరిగిపడటంతో సుమారు 20 చోట్ల రోడ్డు దెబ్బతింది. అప్పటిలో వాటిని తాత్కాలికంగా తొలగించినా ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సాక్షి, పాడేరు: వర్షాలు కురిసినప్పుడల్లా జిల్లాలో ఘాట్‌రోడ్లలో ప్రయాణం భయంభయంగా మారుతోంది. ప్రధాన రోడ్లపై కొండచరియలు, బండరాళ్లు జారిపడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకర మలుపులు వద్ద రోడ్డును ఆనుకుని కొండలు ఉన్నందున వర్షం పడినప్పుడల్లా బండరాళ్లు, కొండచరియలు జారిపడుతున్నాయి. ● మినుములూరు నుంచి గరికబంద వరకు సుమారు 25 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు నుంచి విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ప్రధాన రోడ్డు మార్గం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం కురినప్పుడల్లా నీరు పోయేలే డ్రైనేజీలు లేకపోవడం వల్ల రోడ్డు, రక్షణగోడలు దెబ్బతింటున్నాయి. ● వంట్లమామిడి మలుపు వద్ద రక్షణగోడలు శిథిలమయ్యాయి. సుమారు 20 మీటర్ల పొడవునా దెబ్బతినడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ● ఏనుగురాయి దిగువ ప్రాంతంలో పలు మలుపులు వద్ద రక్షణగోడల పరిస్థితి దారుణంగా ఉంది. ● వంట్లమామిడి గ్రామం దాటిన తరువాత, కోమాలమ్మ పణుకు దిగువన పలు మలుపుల్లో రక్షణగోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాన్నాళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొని ఉన్నా అధికారవర్గాల్లో స్పందన కరువైంది. ● వర్షం పడినప్పుడల్లా రాజాపురం వద్ద రోడ్డుపైకి వాగుల నీరు వచ్చేస్తోంది. దీనివల్ల రోడ్డు దెబ్బతింటోంది. ● ఘాట్ మార్గంలో రోడ్డుకు ఒకవైపున ఫైబర్ కేబుల్ ఏర్పాటు నిమిత్తం తీసిన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చలేదు. దీనివల్ల రోడ్డుదిగినప్పుడల్లా వాహనాలు దిగిపోయే పరిస్థితి నెలకొంది. ● వంజంగి కాంతమ్మ వ్యూపాయింట్‌కు సమీపంలో ఇప్పటివరకు సుమారు నాలుగుసార్లు కొండచరియలు జారిపడ్డాయి. ఈ పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా రోడ్డు అధ్వానంగా మారుతోంది. రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ● రాజాపురం డౌన్లోని మర్రిచెట్టు సమీపంలో బండరాళ్లు దొర్లిపడిన సందర్భాలు లేకపోలేదు.వర్షాలు కురిసినప్పుడల్లా ఘాట్ మార్గాల్లోప్రమాదకర పరిస్థితులు నిలిచిపోతున్న రాకపోకలు సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టని పాలకులు అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని శివలింగపురం నుంచి సుంకరమెట్ట వరకు సుమారు 40 కిలోమీటర్ల పొడవునా ఘాట్‌లో రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మలుపు వద్ద రక్షణగా ఏర్పాటుచేసిన ఐరన్ వాల్ వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ మార్గంలో ఎనిమిది ఎయిర్పిన్ బెండ్లు ఉన్నాయి. వీటిలో3, 5, 6, ఎయిర్పిన్ బెండ్ల వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడినప్పుడల్లా భీసుపురం వద్ద కొండలపైనుంచి రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చేస్తుంది. ఇక్కడ సుమారు 4 అడుగుల లోతున నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటలతరబడి నిలిచిపోతున్నాయి. అనంతగిరి పీహెచ్సీ సమీపంలో రోడ్డును ఆనుకుని ఊటగెడ్డ ప్రవహించడంతో కోతకు గురైంది. -
తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం
జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ హెచ్చరికచింతూరు: గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని మైదాన ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం తప్పదని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ హెచ్చరించారు. గురువారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారం తమ్మన్నదొర పేరుతో ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేయాలని లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఆదివాసీలు కోరుకుంటున్న విధంగా రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఆయన కోరారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
విశాఖ సిటీ : క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవలే వరుసగా రెండు కేసుల్లో ఆరుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్స్చేంజ్ 666, బ్లాక్ డైమండ్ 9.కామ్ అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్, వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆ వెబ్సైట్ డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశచూపిస్తూ బెట్టింగ్ రొంపిలోకి దించుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు వారి సొంత ఐడీలు ఇస్తూ దాని ద్వారా అనేక మందిని బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన పెయ్యిల త్రినాథ్ (23), కాశీరెడ్డి బాలసంజీవరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఏడు రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. -
హెచ్ఆర్ఏ పునరుద్ధరణ ఎప్పుడు?
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు కోల్పోయిన ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ కీలక అంశానికి సంబంధించి యాజమాన్యంపై ఉక్కు అధికారుల సంఘం, కార్మిక సంఘాలు గట్టిగా ఒత్తిడి తీసుకురాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్టీల్‌ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పుడు.. యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించింది. మొదట్లో 50 శాతం జీతం మాత్రమే చెల్లించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా 65 శాతం, ఒక్కోసారి 75 శాతం జీతం చెల్లిస్తూ.. మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించారు. ఆ సమయంలో కార్మికులకు బేసిక్, డీఏ తర్వాత అతిపెద్ద కాంపొనెంట్‌గా ఉన్న హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దాని ఫలితంగా, సగటు కార్మికుడు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చొప్పున, వెరసి సంవత్సరానికి సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు నష్టపోయారు. ఆ సమయంలో కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో జరిగిన చర్చల్లో, ప్లాంట్ పరిస్థితి మెరుగుపడినప్పుడు హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించింది. లాభాల బాట పట్టినా... స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల కష్ట ఫలితంగా, మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు ప్రారంభమై ప్రస్తుతం 90 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు ప్రారంభించిన నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా కొన్ని నెలలు లాభాలు కూడా వచ్చాయి. మూడవ ఫర్నేస్ కూడా విజయవంతంగా కొనసాగుతుండటంతో, ఈ నెల నుంచి మరింత లాభాలు సాధించగలమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. 13 నెలల తర్వాత ఉద్యోగులు నూరు శాతం జీతం అందుకున్నప్పటికీ.. వారి వేతన బకాయిలు మాత్రం 355 శాతానికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ప్లాంట్ పరిస్థితి మెరుగుపడితే హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెయిల్‌తో సమానంగా 2017 నుంచి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడంతో ఇప్పటికే వేల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులు.. ఇప్పుడు హెచ్ఆర్ఏను కూడా పొందలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల వైఫల్యంపై ఉద్యోగుల ఆగ్రహం ఈ ముఖ్యమైన విషయంలో యాజమాన్యంతో నిరంతరం చర్చించి ఒప్పించాల్సిన అధికారుల అసోసియేషన్, కార్మిక సంఘాలు విఫలమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా గుర్తింపు సంఘం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని యాజమాన్యంతో చర్చించి, తక్షణమే హెచ్ఆర్ఏ పునరుద్ధరణకు కృషి చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అదుపు తప్పితే లోయలోకి..
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516–ఈ ప్రమాదభరితంగా మారింది. కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి గూడెంకొత్తవీధి మండలం చాపరాతిపాలెం మీదుగా చింతపల్లి మండలం లంబసింగి వరకూ ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా రంపుల ఘాట్రోడ్లో కొండను తవ్వి దారిగా మలిచారు. మలుపుల్లో తవ్విన కొండ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జారి ప్రమాదకరంగా మారుతోంది. బండరాళ్లు, కొడచరియలు, మట్టి పెళ్లలు రహదారిపై విరిగిపడుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అధికారులు రహదారిపై హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదకరమైన మలుపులు వద్ద రక్షణగోడలు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి లోయలోకి పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో మలుపుల వద్ద ఏర్పాటుచేసిన ఇనుపకంచె వాహనాలకు రక్షణగా నిలవలేకపోతోంది. ● ప్రధానంగా మారేడుమిల్లి మండలం పాములేరు సమీపంలో సీతారాముల విగ్రహాలకు పైనున్న మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో రహదారి కోతకు గురైంది. పల్లానికి దిగుతున్న భారీ వాహనాలు మలుపు తిరగలేక అదుపుతప్పి కిందనున్న రహదారిపై పడిపోతున్నాయి. గతంలో కర్నాటకకు చెందిన భక్తుల వాహనం ఇదే ప్రాంతంలో ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. కాకినాడ ప్రాంతానికి చెందిన కొంతమంది చింతూరు వచ్చి తిరిగివెళుతున్న క్రమంలో ఇదే ఘాట్రోడ్లో గోపీ టర్నింగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రంపుల ఘాట్‌లో భయం భయం -
సచివాలయ ఉద్యోగుల విశేష సేవలు
పాడేరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మోంథా తుపానులో విశేష సేవలు అందించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై గురువారం పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశానికి స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 770 హెక్టార్లలో వరి, వంద ఎకరాల్లో చోడి, 300 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వివరించారు. జిల్లాలో సుమారు 278 ఇళ్లలో కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసం అయినట్టు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. చాలా చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, కొండచరియలు విరిగిపడి జనజీవనానికి ఇబ్బందులు ఎదురైనట్టు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు బాధితులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని పార్టీ అధినేత సూచించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం మరింత ఉదృతం చేయాలని, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరం చేయాలని సూచించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. -
వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
డుంబ్రిగుడ: చాపరాయి గెడ్డపై వంతెన నిర్మించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని చాపరాయి గెడ్డ ఉధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను వర్షాలు కారణంగా మూడు రోజులుగా పోతంగి పంచాయతీ పెద్దపాడు, కోసంగి, చంపపాట్టి, ఊయాలగుడ, శీలంగొంది, జాకరవలస గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. నిత్యావసర వస్తువులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెద్దపాడుకు గెడ్డ అవతల నుంచి సుమారు రూ.2 కోట్లతో అడవితల్లి బాట పేరుతో తూతు మంత్రంగా నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించారన్నారు. రోడ్డు నిర్మిస్తే సరిపోదని, వంతెన కూడా నిర్మించాలని సూచించారు. ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెడ్డను దాటి వెళ్లినప్పుడు వంతెన గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంపాపట్టి వద్ద కాజ్‌వేను పరిశీలించారు. ఈ గ్రామంలో పాఠశాల భవనం దెబ్బతినడంపై గెడ్డ అవతల ఉన్న గిరిజనులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఫోన్లో ఆదేశించారు. పంట, గృహ నష్టాలపై ప్రభుత్వానికి నివేదించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ త్రివేణిని ఫోన్లో ఆదేశించారు. చాపరాయి, చంపాపట్టి వద్ద వంతెనలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పి పరశురామ్, నియోజకవర్గం యువ నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి జిల్లాల ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, సర్పంచ్, ఉప సర్పంచ్‌లు వంతల వెంకటరావు, శెట్టి జగ్గునాయుడు, ఎంపీటీసీ రామారావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు కె.దశమి పాల్గొన్నారు. -
తాండవకు పెరుగుతున్న వరద నీరు
నాతవరం: తాండవ రిజర్వాయరులోకి ఇన్‌ఫ్లో నీరు పెరగడంతో రాత్రికి ఏ సమయంలోనైనా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డీఈ ఆనురాధ అన్నారు. ఆమె గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ ప్రారంభం నుంచి తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించేందుకు నాలుగు రోజులుగా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయిని బట్టి 350 క్యూసెక్కులు, తర్వాత రోజు 2400 క్యూసెక్కులు, రెండు రోజులుగా 1230 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 377.4 అడుగులు దాటలేదన్నారు. గురువారం ఉదయం నుంచి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2900 క్యూసెక్కులు అధికంగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 378 అడుగులకు పెరిగిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్ ఫ్లో నీటిని బట్టి ప్రాజెక్టు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి మరింత నీటిని రాత్రికి విడుదల చేసే అవకాశముందన్నారు. తాండవ ప్రాజెక్ట్ ప్రమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు అన్నారు. తాండవ నదిలోకి రాత్రి వేళల్లో దిగరాదని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు దండోరా ద్వారా తెలియజేశామన్నారు. తగ్గుముఖం పట్టిన పెద్దేరు నీటిమట్టం మాడుగుల : మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 800 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 135 మీటర్లకు తగ్గిందని జలాశయం జేఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
అనంతగిరి (అరకులోయ టౌన్): మోంథా తుపాను వర్షాలకు మండలంలోని రహదారులు శిథిలాస్థకు చేరాయి. అనంతగిరి –ఎస్.కోట ఘాట్ రోడ్డులో ఒకటో నంబర్ ఎయిర్ పిన్ బెండ్ వద్ద రక్షణగోడ కూలిపోయింది.అరకు సీఐ హిమగిరి, ఎస్ఐలు శ్రీనివాసరావు, గోపాలరావులు జేసీబీని రప్పించి పరిస్థితిని మెరుగుపరిచారు. తాడిగుడ జలపాతం సమీపంలోని కాజ్వే, వేంగడ డొంకాపూట్ కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంగవరం/దేవీపట్నం: తుపాను నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లిపూడి బురద కాలువ, పెద్దకాలువల్లో ఉధృతి నెలకొంది. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నెల్లిపూడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గోకవరం–అడ్డతీగల ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లిపూడి వాగు వద్ద బ్రిడ్జిపై నుంచి మూడు అడుగుల ఎత్తులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు సాగించకుండా పోలీసులు,రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, నెల్లిపూడి వద్ద పరిస్థితిని సమీక్షించారు. సూరంపాలెం రిజర్వాయరుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట– గోకవరం మార్గంలో ఫజుల్లాబాద్ సమీపంలో కాజ్‌వేపై వరద నీరు ఉధృతిగా ప్రవహించింది. సాయంత్రం నాలుగు గంటలకు కూడా ప్రవాహం తగ్గలేదు. దీంతో గోకవరం నుంచి ఇందుకూరుపేట వెళ్లే ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈనుకొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇందుకూరుపేట–ఎం.రావిలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్‌వేల ధ్వంసంతో అవస్థలు -
గంజాయి రవాణా నియంత్రణకు శాశ్వత చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: జిల్లాలో గంజాయి రవాణాను శాశ్వతంగా అరికట్టడానికి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్, వ్యవసాయ శాఖ, ఉద్యాన, అటవీ, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, డీఆర్డీఏ, ట్రైబల్ వెల్ఫేర్, ఎకై ్సజ్, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశంలో తీసుకున్న కార్యచరణ అమలుపై ఆరా తీశారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్న వివరాలను తెలుసుకున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమీక్ష సమావేశానికి పూర్తి సమాచారంతో అధికారులు రావాలన్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న పంటల వివరాలు తెలుసుకున్నారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల, కళాశాలల్లో వారానికి ఒకటి రెండు క్లాసులు తీసుకోవాలన్నారు. ఆదివాసీ సేవా కేంద్రాల సిబ్బందికి గంజాయి సాగు, రవాణా గుర్తించేలా శిక్షణ ఇప్పించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ గంజాయి రవాణా, సాగు చేసిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, ఆస్తులను జప్తు చేస్తామన్నారు. గంజాయి స్మగ్లర్లకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతు నాయుడు, డీఈవో బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా ఉద్యాన అధికారి కర్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
ముంచంగిపుట్టు: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శులు పాపారావు, సన్యాసిరావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో యువతీయువకులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పాపారావు, సన్యాసిరావులు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి పేదలకు వైద్యం దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నామన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఎంప్లాయిస్,పెన్షనర్ల యూనియన్ అధ్యక్షుడు మోదకొండ, వైఎస్సార్సీపీ మండల నేత కొండలరావు, పంచాయతీ బూత్ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎటపాక: వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు ఆధ్యర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం కన్నాయిగూడెం, గుండాలలో పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కురినాల వెంకటేశ్వర్లు, శీలం నాగేశ్వరావు, గుండాల ఉప సర్పంచ్ తోట శశి కుమార్, గుండి రాము, యర్రగొల్ల నరసింహరావు, దార రమేష్, చల్లా మణి, కాకని సురేష్, కల్పన, ముత్తిబోయిన రాము, ముక్కా శ్రీను, రాఖి సతీష్, యడ్ల బాలజీ, గుండి రామారావు, నడిపింటి దుర్గాప్రసాద్, కొత్తపల్లి సాత్విక్, మమిడి నవీన్ తదితరులు పాల్గొన్నారు -
కమనీయం శ్రీవారి కల్యాణం
సాక్షి,పాడేరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్,ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం, పూజాసామగ్రి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లడ్డూ ప్రసాదాలను భక్తులకు టీటీడీ అధికారులు అందజేశారు. పాడేరులోని పలుశాఖల అధికారులు, ఉద్యోగులు ,వర్తకుల ఆర్థికసాయంతో భారీ స్థాయిలో అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు, మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, గృహనిర్మాణ సంస్థ డీఈఈ వంతెన్భ రాజబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, ముకుందు, కారం దేముడు, కొణతాల సతీష్, వర్తక సంఘం ప్రతినిధులు, మహిళా భక్తులు కల్యాణోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టీటీడీ అర్చకులకు ఘన సన్మానం పట్టణంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపిన తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, టీటీడీ అధికారులు ఉమానీలకంఠేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరి దేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకుడు ఉప్పల రామం, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి, కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, వంతెన్బ రాజబాబు దంపతులు ఘనంగా సన్మానించి, ఉమానీలకంఠేశ్వరస్వామి చిత్రపటాలను అందజేశారు. -
నేడు ఈఎన్సీ చీఫ్ పదవీ విరమణ
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2023 ఆగస్ట్ 1న తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన ఆయన యాంటీ సబ్‌మైరెన్ వార్ఫేర్ స్పెషలిస్ట్‌గా తక్కువ కాలంలోనే పేరు సంపాదించారు. పలు యుద్ధ నౌకల కెప్టెన్‌గా విధులు నిర్వర్తించి.. మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్‌గానూ, నెట్‌సెంట్రిక్ ఆపరేషన్స్‌లో ప్రిన్సిపల్ కమాండర్‌గా, నేవల్ డైరెక్టరేట్(పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌గా, ఫ్లాగ్ ఆఫీసర్‌గా, ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈఎన్సీ చీఫ్‌గా రాకముందు.. నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్‌వో)గా బాధ్యతలు చేపట్టారు. మిలాన్–2024తో పాటు మలబార్, టైగర్ ట్రయాంఫ్.. ఇలా ఎన్నో కీలక నౌకాదళ విన్యాసాలు వైస్ అడ్మిరల్ పెంధార్కర్ సారథ్యంలో విశాఖలో విజయవంతంగా నిర్వహించారు. పెంధార్కర్‌కు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించేందుకు తూర్పు నౌకాదళంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి ఈఎన్సీ చీఫ్‌ని రెండు రోజుల్లో రక్షణ మంత్రిత్వ శాఖ నియమించే అవకాశం ఉంది. -
ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ పనుల పరిశీలన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సూచన సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్‌లో కొండచరియలు జారిపడి ధ్వంసమైన రోడ్డు ప్రాంతాన్ని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనను తెలుసుకున్న ఆయన గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బండరాళ్లు తొలగింపు, రోడ్డు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన ప్రమాద సంఘటన దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్‌లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అటవీ, ఆర్అండ్బీ పోలీసుశాఖలను ఎమ్మెల్యే కోరారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ పాడేరు: వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వద్దని ప్రతి ఒక్కరి సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖను ప్రగతిపథంలో నడిపించేందుకు సరైన ప్రణాళికపరంగా పని చేయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ఎవరికి కేటాయించిన విధులు వారు నిర్వర్తించాలన్నారు. రోజు వారీ విధులను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రజలు వైద్యారోగ్య సమస్యలపై ప్రతిరోజు కార్యాలయ పని దినాల్లో సాయంత్రం 3గంంటల నుంచి 6గంటలకు నేరుగా వచ్చి కలవాలని, లేకుంటే 7671868055 నంబర్‌కు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని సూచించారు. -
ఆశ్రమ పాఠశాల సందర్శన
రంపచోడవరం: మండలంలోని ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలను సర్పంచ్ కోసు రమేష్బాబుదొర, ఎంపీటీసీ వంశీ కుంజం గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు సత్యనారాయణ, బొబ్బా శేఖర్, వేల్ఫేర్ అసిస్టెంట్ బాపన్నమ్మ, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.అల్లం తోడుతో లారీ బోల్తాతగరపువలస : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా గురువారం ఉదయం ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ నీళ్లకుండీల వద్ద జాతీయ రహదారి మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి లారీ బోల్తా పడింది. బెంగుళూరు నుంచి అల్లం లోడుతో కోల్కత్తా వెళ్తున్న లారీ జాతీయ రహదారిలో రెయిలింగ్‌ను దూసుకుని సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయట పడ్డారు. 5న పుణ్యనదీ హారతి సింహాచలం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వచ్చే నెల 5న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండ దిగువ వరాహ పుష్కరిణి(కోనేరు)కి పుణ్యనదీ హారతి నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఇన్చార్జ్ ఈవో ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఆరోజు కొండదిగువ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను తిరువీధిగా కోనేరు వద్దకు తీసుకెళ్లి, అక్కడ ద్వయ హారతి, నక్షత్ర హారతి, కుంభ హారతి కార్యక్రమాలు జరుపుతామన్నారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరారు. అలాగే కోనేరు గట్టుపై దీపారాధన కార్యక్రమంలో పాల్గొని, తరించాల్సిందిగా పిలుపునిచ్చారు. -
దెబ్బతిన్న వరిపైరు పరిశీలన
జి.మాడుగుల: మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలను గురువారం చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి, శాస్తవేత్తలు జోగా రావు, బాలహుస్సేన్‌రెడ్డి, ఏవో వరప్రసాద్ పరిశీలించారు. దీనిలో భాగంగా వారు సింగర్భ, నిట్టాపుట్టు, గొడ్డుబూసులు గ్రామాల్లో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన వరిపైరును గుర్తించారు. ఇటువంటి పైరును కట్టలుగా కట్టి నిలబెట్టాలని రైతులకు సూచించారు. పొలాల్లో వరద నీరు నిల్వ లేకుండా అంతర్గత కాలువలు ఏర్పాటుచేసి బయటకు పంపాలని తెలిపారు. గింజ రంగు మారితే ఒక మిల్లీమీటరు ప్రొపికొనజోల్ను లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు. -
నేటి నుంచి రేడియోలజిస్టుల సదస్సు
హాజరుకానున్న 600 మంది రేడియాలజిస్టులు మహారాణిపేట : రాష్ట్ర రేడియోలజిస్టుల వార్షిక సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నగరంలో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ రేడియోలజీకల్ ఇమేజింగ్ అసోసియేషన్(ఏపీఐఆర్ఐఏ) రాష్ట్ర అధ్యక్షుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.సురేష్ తెలిపారు. గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్న డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్లో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 600 మంది రేడియాలజిస్టులు, వైద్య అధ్యాపకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. తొలిరోజు గీతం మెడికల్ కాలేజీలో ఫీటల్ రేడియాలజీపై ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు. రెండో, మూడో రోజుల్లో వైద్య ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, శాసీ్త్రయ పత్రాల ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో 160 రేడియోలజీ పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నామన్నారు. సదస్సులో రాష్ట్ర స్థాయి రేడియాలజీ క్విజ్ నిర్వహించనున్నామన్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీకి చెందిన ఆచార్య డాక్టర్ రాజు శర్మ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కాకర్ల సుబ్బారావు ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఉమా మహేశ్వరరెడ్డి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ వర్మ, డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సూచనలు
చింతపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో బుధవారం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖాధికారులు చిన్నగెడ్డ, చింతబారు, లోతుగెడ్డ, జంక్షన్, సంకాడ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. గ్రామాల్లో వరి, రాజ్మా ,చిక్కుళ్ల పంటలను పరిశీలించారు. పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా బయటకు పంపాలని, ఎక్కువగా నీరు నిలిస్తే పెద్దకాలువలు చేసి మోటార్ల ద్వారా నీటిని తరలించాలని, గింజలు రంగుమారితే 200మిల్లీ లీటర్ల ప్రోపికోన్జోల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీట మునిగిన వరి పనలను ఐదు శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి, చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, శాస్త్రవేత్త జోగారావు, ఏవోలు మదుసూధన్‌రావు, గిరిబాబు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: మండలంలో పత్తి, పొగాకు, వరి సాగు చేస్తున్న రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏఓ చక్రధర్ సూచనలు చేశారు. ఆయన పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి, పొలాల్లోకి చేరిన వరద నీటిని గండ్లు కొట్టి దిగువకు వదిలిపెట్టేయాలని సూచించారు. పంటలకు తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ● సరియాపల్లి, గుమ్మసిరగంపుట్టులో సీసీ రోడ్లకు శంకుస్థాపన ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో జెడ్పీ నిధులు రూ.10లక్షలతో 200 మీటర్ల సీసీరోడ్డుకు, గుమ్మాసిరగంపుట్టు గ్రామ సమీపంలో బరడ వెళ్లే మార్గంలో జెడ్పీ నిధులు రూ.5లక్షలతో 100 మీటర్ల సీసీరోడ్డు పనులకు బుధవారం ఆమె సర్పంచులు,ఎంపీటీసీలు,నేతల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దశాలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి బోర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. జగనన్న స్ఫూర్తితో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నడూ లేనివిధంగా జెడ్పీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీపీ సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు సుభాష్‌చంద్ర, నరసింగరావు, గంగాధర్, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నబ్బో, గణపతి పాల్గొన్నారు. -
బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
● ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సిందే ● ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ అరకులోయ టౌన్: మోంథా తుపానుకు పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధితులు అధైర్యపడొద్దని, నష్టపోయిన అన్నివర్గాలకు తమ పార్టీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నష్టపరిహారం సకాలంలో అందించేందుకు పోరాడుతుందన్నారు. అరకులోయ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి, తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పంటలు నీట మునిగి రెండు రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచన వేయకపోవడం చాలా దారుణం అన్నారు. ఇప్పటికై నా నష్టపోయిన గిరి రైతులకు నేరుగా రూ. 50వేలు పరిహారం చెల్లించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధితుల వివరాలు సేకరించి, మానవత దృక్పథంతో ఆలోచించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
జలాశయాలకు వరద తాకిడి
దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాల్లోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. రైవాడ జలాశయానికి భారీగా నీరు రావడంతో నాలుగు గేట్లు తెరిచి 12వేల క్యూసెక్కులను శారదానదిలో బుధవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో 10వేల క్యూసెక్కుల ఉన్న ఇన్‌ఫ్లో, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 11వేల క్యూసెక్కులు, ఒంటి గంట సమయానికి 12 క్యూసెక్కులుగా ఇన్‌ప్లో పెరుగుతూ వచ్చింది. అప్రమత్తమైన జలాశయం పర్యవేక్షణ డీఈ జి. సత్యంనాయుడు తదితర ఇంజనీరింగ్ అధికార్లు ఇన్‌ఫ్లో ఆధారంగా స్పిల్‌వే గేట్లు ద్వారా శారదానదిలోకి వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా 12వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.97 మీటర్లకు చేరుకుంది. పెద్దేరుకు పోట్టెత్తిన వరద మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయంలోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే నీటిని రెండు ప్రధాన గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు పొంగి ప్రవహిస్తుండడంతో ఎల్.పొన్నవోలు, జేడీ పేట, సత్యవరం, జంపెన, వీరనారాయణం వీరవల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.80 మీటర్లకు చేరుకుంది. జత్యవరం, జంపెన, గొటివాడ అగ్రహారం గ్రామాల వద్ద పెద్దేరుపై గల వంతెనల వద్ద సచివాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదస్థాయిలో కోనాం చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువైనట్టు ఇన్చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 99.10 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 800 క్యూసెక్కులు పెరగడంతో సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. -
అప్పన్నకు నిత్యకల్యాణం
నిత్యకల్యాణంలో స్వామికి యజ్ఞోపవీతధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు.కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.48.07 లక్షలు డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గత ఆగస్టు 20 నుంచి ఈ నెల 29 వరకు హుండీల ద్వారా రూ.48,07,930 నగదు లభించింది. 61.510 గ్రాముల బంగారం, 941 గ్రాముల వెండి వచ్చింది. అలాగే 33 అమెరికా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, యూఏఈకి చెందిన 10 ధీరమ్స్, సౌదీ అరేబియన్కు చెందిన 5 రియల్, ఒమన్‌కు చెందిన 1/2 రియల్, జర్మనీకి చెందిన 25 యూరోలతో పాటు పలు విదేశీ కరెన్సీ లభించింది. ఈ లెక్కింపులో ఈవో కె.శోభారాణి, జగన్నాథస్వామి ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి, ఎస్బీఐ మేనేజర్ జె.నరసింహారావు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరిసేవ సభ్యులు పాల్గొన్నారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్‌లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్‌లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్‌స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్‌కుమార్ ముటట్కర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిననార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
తుపాను బాధితులకు తక్షణం పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించారంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివ రామ కృష్ణ, నీలి రవి, సనపల రవీందర్ భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
సీలేరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడెం కొత్తవీధి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ పాంగి దుర్జొ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి తదితరులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అభ్యసించాలని, సర్కారు వైద్య సేవలు మరింతగా అందరికీ అందేలా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి, బడా కంపెనీలకు వాటి నిర్వహణ అప్పగించేందుకు చూస్తోందన్నారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య, సామాన్యులకు ప్రభుత్వ వైద్యం అందే పరిస్థితి ఉండదన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం సీలేరు పంచాయతీ వైఎస్సార్సీపీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా పేలూరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా గణేష్, నూకరాజు, బాబులాల్. వెంకట్రావు. కార్యదర్శులుగా కిముడు విశ్వనాథ్, వంతల మారి బాబు, శ్రీకాకుళపు నూకరాజు, కొర్ర రాజేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగ సీలేరు పంచాయతీ అధ్యక్షురాలుగా కంకిపాటి రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులుగా కిల్లో నాగమణి, వంతల ధోన, కార్యదర్శులు వంతల రజిని, కుప్ప కుమారిలను ఎన్నుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు సాంబమూర్తి. మొట్టడం సత్యనారాయణ , పాడేరు ఎస్సీ సెల్ అధ్యక్షురాలు స్వర్ణ లత, మండల ప్రధాన కార్యదర్శులు వంతల చంటి బాబు,కొర్ర బలరాం తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● సిబ్బందికి డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశం ● ఈదులపాలెం పీహెచ్సీ తనిఖీ పాడేరు రూరల్: తుపాను వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. ఈదులపాలెం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపట్టిక, రిజిస్టర్లను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ విధుల్లో లేకపోవడంతో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య పర్యవేక్షకురాలు డిప్యుటేషన్‌ను రద్దు చేసి తిరిగి రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గర్భిణులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మలేరియా, డయేరియా,టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కుష్టు, ఎయిడ్స్నియంత్రణ అధికారి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గంగవరం : తుపాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్‌వో పిల్లి సరిత వైద్య సిబ్బందిని సూచించారు. గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. పీహెచ్‌సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మసీ విభాగంంలోని మందుల స్టాకు, వ్యాక్సిన్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బర్త్ వెయిటింగ్ హాల్లో ఉన్న గర్భిణులతో మాట్లాడి ఆరోగ్య భద్రతపై సూచనలిచ్చారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో రక్త పరీక్షలు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న బర్త్ వెయిటింగ్ భవనాన్ని ఆమె సందర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్సు సర్వీసులపై ఆరా తీశారు, సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ భావన, డాక్టర్ శ్వేత, వైద్య సిబ్బంది తదితరులున్నారు.అడిషనల్ డీఎంహెచ్‌వో సరిత -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశాఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. అధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ స్థానిక సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పుష్పయాగం కోసం తిరుమలకు తరలించారు. వీటిలో 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలు ఉన్నట్లు హిమాన్షు ప్రసాద్ తెలిపారు. -
శిథిల భవనాలను కూల్చివేయండి
డుంబ్రిగుడ: తుపానుకు నేలకూలిన పాఠశాల భవనాన్ని పూర్తిగా తొలగించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి నేలకూలిన వంతర్డ పాఠశాల భవనాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. భవన శిథిలాలను వెంటనే తొలగించేలా ఎంపీడీవోకు ఆదేశాలు ఇచ్చారు. మండలంలో ఇలాంటి భవనాలను ముందుగానే గుర్తించి కూల్చివేయాలన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఆదేశించారు. పాకలో పాఠశాల నిర్వహిస్తున్న ఆయన అక్కడి వెళ్లారు. పశువుల పాకలా ఉన్న దీనిలో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తారని అధికారులను ప్రశ్నించారు. వంతర్డ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు డుంబ్రిగుడలో గృహాలను పరిశీలించారు. లివిటిపుట్టులో పాఠశాల భవన నిర్మాణం పూర్తికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఈవోలను ఆదేశించారు. ఎంఈవోలకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం -
పంట నష్టానికి పరిహారం చెల్లించండి
● మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్ హుకుంపేట: మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటనష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించిఆదుకోవాలని మాజీ ఎమెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తాడిపుట్టు పంచాయతీలోని గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికందాల్సిన వరి పంట వరద పాలైందన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి బాధిత రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కొనుక్కునే పరిస్థితి దాపరిస్తుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించాలని స్థానికులు నినాదాలు చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కేంద్రంతో పోరాడి 17 వైద్య కళాశాలలు తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. జగనన్నకు మంచి పేరు వస్తుందని భయంతో పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతుందని, మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలని జగనన్న ముందుకు వస్తే దానిని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. ఎంపీపీ సీతమ్మ, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, సర్పంచులు నరసింగరావు, గంగాధర్, సుభాష్, నొబినా, వసంత, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల,నోబ్బో, గణపతి, వైఎస్సార్సీపీ మండల నేతలు పాల్గొన్నారు. వైద్యం కొనుక్కోవాల్సిన దుస్థితి ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సరియాపుట్టులో కోటి సంతకాల సేకరణ -
జిల్లా ఆస్పత్రిలోవైద్యసేవలపై ఆరా
పాడేరు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత ఆదేశించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని బుధవారం ఆమె సందర్శించారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డులో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. రోగులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం వడ్డించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రిలో నీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రోగుల పట్ల మర్యాదగా మెలగాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకట్, ప్రసూతి విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత చొరవతో..
పాడేరు రూరల్: భారీ వర్షాలకు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ 12వ మైలురాయి గ్రామ సమిపంలో ఈదులపాలెం ప్రధాన రహదారి మార్గంలో బుధవారం భారీ వృక్షం విరిగి పడింది. స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన వార్డు సభ్యుడు పాతను సింహాచలం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, గిరిజనులు చెట్టు కొమ్మలను తొలగించారు. మొదలు భాగాన్ని జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ముంచంగిపుట్టు: మండలంలోని జర్రెల పంచాయతీ కొత్తూరు గ్రామంలో బుధవారం కొర్ర సోనాయి అనే గిరిజన మహిళ ఇంటి గోడ కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్సీపీ నేత సురేష్, వార్డు సభ్యుడు పరశురాం, పీసా కమిటీ కార్యదర్శి జీనబంధు అక్కడికి వెళ్లి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. గోడ కూలిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారిని కోరారు. -
మోంథా.. ముంచెత్తింది
మోంథా తుపాను ముంచెత్తింది. బుధవారం కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరు ఘాట్‌తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.పాడేరుకు సమీపంలోని జేసీ బంగ్లా రోడ్డు, లంబసింగి ఘాట్, అనంతగిరి మండలం నిమ్మలపాడు రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంట పొలాలు చాలా చోట్ల నీటమునిగాయి. సమాచారమిచ్చినా రాలేదు తుపానుకు జీలుగుచెట్టు పడటంతో ఇల్లుపై పడటంతో ఒకపక్క పూర్తిగా ధ్వంసమైంది. మాకు వేరే ఇల్లు లేదు. వైఎస్సార్సీపీ నేతలు పాంగి నరసింగరావు, పి.రాంప్రసాద్ సహకారంతో మండల అధికారులకు సమాచారం అందించాం. ప్రస్తుతానికి ఒక్క అధికారి కూడా మాగ్రామాన్ని సందర్శించలేదు. – వంతల గోపినాథ్, సాగిరివలస, సొవ్వ పంచాయతీ●ఎటువంటి సాయం చేయలేదు తుపాను వర్షాలకు మా పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి వచ్చిన అధికారులు జరిగిన నష్టాన్ని చూశారు. అయితే నష్టపోయిన మాకు ఎటువంటి సాయం చేయలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అధికారులు తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికన సాయం చేయాలి. – సాగర గుర్మిసింగ్, డుంబ్రిగుడ సాక్షి,పాడేరు: జిల్లాలోని 163 గ్రామాలపై తుపాను ప్ర భావం చూపింది. పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయి లో వసతులు లేక బాధితులు ఇబ్బందులు పడ్డారు. ● మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లోని అవతలి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ● పాడేరు–పెదబయలు మండలాల సరిహద్దులోని పరదానిపుట్టు కాజ్వే మీదుగా మత్స్యగెడ్డ ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా సుమారు 100 మారుమూల గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. రాళ్లగెడ్డ, బొయితిలిగెడ్డ, చాపరాయిగెడ్డ, దిగుడుపుట్టు, సంతారి గెడ్డల్లో వరద ఉధృతి నెలకొంది. 500 ఎకరాల్లో పంటకు నష్టం భారీ వర్షాలతో లోతట్టు వ్యవసాయ భూముల్లో ఖరీఫ్ పంటలకు నష్టం ఏర్పడింది. పాడేరు మండలం వంజంగి కొత్తవలస ప్రాంతంలో కొండవాగుల ఉధృతికి పంట భూముల మీదుగా వరద ప్రవాహం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతదశలో ఉన్న వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు వరదనీటి ముంపునకు గురయ్యా యి. చాలాచోట్ల వరిపంట నేలవాలింది. సుమారు 500 ఎకరాల్లో వరి, చిరుధాన్యాల పంటలకు నష్టం ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 278 గుడిసెలు, మట్టి ఇళ్లకు నష్టం: కలెక్టర్ దినేష్‌కుమార్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు 278 గుడిసెలు,మట్టి ఇళ్లకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ దినేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 12 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.18.08 లక్షల వాటిల్లినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా నాలుగు పశువులు, 8 గొర్రెలు, మేకలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13 పునరావాస కేంద్రాల్లో 774 మందిని తరలించి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించామని ఆయన వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.3వేలు ఇస్తామని తెలిపారు. పొంగిన వాగులు.. గాలులకు కూలిన చెట్లు రాజవొమ్మంగి: రెండో రోజు బుధవారం రాజవొమ్మంగిలో రోజంతా ఈదురు గాలులతో వర్షం కురిసింది. కట్టెల పొయ్యిలపై ఆధారపడిన పేద గిరిజన కుటుంబాలు వంట చెరకు, నిత్యావసరాలకోసం ఇబ్బంది పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వాగుల వరదనీరు వటిగెడ్డ రిజర్వాయర్‌లో చేరడంతో పొంగి ప్రవహించింది. ఈదురుగాలులకు దూసరపాము లబ్బర్తి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుర్గానగర్ సమీపంలో ఆర్అండ్బీ రహదారిపై పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భూపతిపాలెం, ముసురుమిల్లికి జలకళ రంపచోడవరం: మోంథా తుపానుకు కురిసిన వర్షాలు సాగునీటి ప్రాజెక్ట్‌లకు మేలు చేశాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ముసురుమిల్లి ప్రాజెక్ట్‌కు గేట్లు ఏర్పాటుచేయకపోవడంతో నీరు దిగువకు పోతోంది. రోడ్డుపై జారిపడిన కొండచరియలు జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం పొంగి ప్రవహిస్తోంది. ఉరుము గ్రామ సమీపంలో రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పెదలంక, వైబీ గొందూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఇంటిపై కూలాయి. సొలభం వెళ్లే మార్గంలో కామెటమ్మ ఘాట్‌రోడ్డులో చెట్టు కూలిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారి దెబ్బతింది. వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లుపుట్టు–గొడ్డ మధ్యలో బ్రిడ్జి వద్ద, కుంబడిసింగి, రాళ్లగెడ్డ ఉధృతిగా ప్రవహించడంతో ఈమార్గంలో రాకపోకలు నిలిపివేశారు. కంఠవరం సమీపంలో వరద నీటికి వరి పంట నీటమునిగింది. కొయ్యూరు: తుపాను వల్ల కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. విద్యుత్ సరఫరాకు మంగళవారం అర్ధరాత్రి నుంచి అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రానికి కూడా రాలేదు. డౌనూరు–చింతపల్లి రహదారిలో తులబాలగెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో పోలీసులు నర్సీపట్నం– చింతపల్లి మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరుసగా రెండు రోజుల పాటు కొయ్యూరుకు నర్సీపట్నం డిపో నుంచి బస్సులు రాలేదు. దీంతో అత్యవసరమైన వారు మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. 12 ఇళ్లకు నష్టం వర్షాలకు మండలంలో 11 ఇళ్లు పాక్షికంగా ఒక ఇళ్లు పూర్తిగా దెబ్బతిందని ఇన్చార్జి తహసీల్దార్ కుమారస్వామి బుధవారం రాత్రి తెలిపారు. నష్టానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. నిలిచిన రాకపోకలు హుకుంపేట: మండలంలో చీడిపుట్టు, లివిటి వంతెనలపైనుంచి గెడ్డలు పొంగి ప్రవహించడంతో అడ్డుమండ, జేకేమండ, రాప, ఉప్ప, మత్స్యపురం పంచాయతీలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 28 గ్రామాలకు రాకపోకలు బంద్ డుంబ్రిగుడ: కితలంగి పంచాయతీకి వెళ్లే మార్గంలో కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంపపట్టి వద్ద కాజ్‌వేపై నుంచి గెడ్డ పొంగి ప్రవహించడంతో సుమారు 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాపరాయి వద్ద ఉన్న పెద్దపాడు, కోసంగి గ్రామాల వారధిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాటితోపాటు అరకులోయ మండలంలోని పలు గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆయా ప్రాంతాల గిరిజనులు నిత్యావసర సరకులకు ఇబ్బందులు పడ్డారు. చాపరాయి గెడ్డ వరదనీటితో పోటెత్తింది. వరద బీభత్సం నుంచి తేరుకోని మన్యం బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం వరద ఉధృతి తగ్గని గెడ్డలు, వాగులు కూలిన చెట్లు వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ పరిహారంకోసం బాధితుల ఎదురుచూపులు ప్రభుత్వం చెప్పేదానికి భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు -
వరి రైతులూ.. అప్రమత్తత అవసరం
చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి చింతపల్లి: మోంథా తుపానుకు కురుస్తున్న వర్షాల పట్ల వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. మంగళవారం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో వ్యవసాయశాఖ ఏడీ తిరుమలరావు, వ్యవసాయాధికారులతో కలిపి పర్యటించారు. దీనిలో భాగంగా చౌడుపల్లి, గాడిదలమెట్ట, చెరువూరు, రింతాడ, అసరాడ, ఏబులం గ్రామాల్లో వరి పైరును పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. వర్షాలకు పైరు నేలకొరిగిన సందర్భంలో అంతర్గత కాలువల ద్వారా పొలంలో వర్షం నీటిని తొలగించాలని సూచించారు. గింజలు రంగుమారడం, మాగుడు, మావిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటికి 200 ఎంఎల్ ప్రొపికొనజోల్ మందును నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. గింజ గట్టిపడే దశలో పైరు అధిక వర్షాలకు గురైనా, నేలకొరిగిన కంకిలో మొలకలు కనపడినా 5శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల స్పటిక ఉప్పు లీటరు నీటికి) పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు. మండల వ్యవసాయాధికారులు టి.మధుసూదనరావు, కె.గిరిబాబు, వీఏఏలు పాల్గొన్నారు. -
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా
● ఏర్పాటు చేయాలి ● ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చింతూరు: రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంపచోడవరం జిల్లా ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. పాడేరు దూరాభారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారం సాయిబాబు, పొడియం రామకృష్ణ, కాక సీతారామయ్య, మడివి రాజు, తిరపతిరావు, ముత్తయ్య, రామయ్య, సుబ్బయ్య, నాగయ్య, రాజమ్మ పాల్గొన్నారు. -
తుపాను ప్రభావిత కుటుంబాలను ఆదుకోండి
అనంతగిరి (అరకులోయ టౌన్): మెంథా తుపాను ప్రభావిత గిరిజనులకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కోనాపురం పంచాయతీ చప్పాడి, వంట్లమామిడి గ్రామాల్లో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి పర్యటించారు. వంట్లమామిగి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, చప్పడి గ్రామానికి చెందిన 45 కుటుంబాలను బొర్రా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు జారిపడుతున్న విషయాన్ని ఆయన పీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న వారు ప్రభావిత ప్రాంతాల గిరిజనులను బొర్రా ప్రభుత్వ ఆశ్రమపాఠశాలకు తరలించారు. బొర్రా నుంచి కోనపురం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పీవోను గ్రామస్తులు కోరారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని వారికి పీవో హామీ ఇచ్చారు. ఎంపీటీసీ నవీన్, సర్పంచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ -
వర్ష బీభత్సం
మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే ప్రాజెక్ట్‌ల నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఘాట్‌రోడ్లు ప్రమాదకరంగా మారడంతో రాత్రిపూట ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో కొండచరియలు జారిపడ్డాయి. అనంతగిరి ఘాట్ రోడ్డులో కొండ వాగుల ప్రవాహం రోడ్డుపైకి వచ్చేయడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. సాక్షి,పాడేరు: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. జనజీనవం స్తంభించింది. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో విస్తరించిన రాళ్లగెడ్డ ఉధృతికి చీడిపుట్టు కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. లో వరద ప్రవాహం అఽధికంగా ఉండడంతో చీడిపుట్టు కాజ్వే మీదుగా వరదనీరు జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. అరకులోయ మండలంలోని మారుమూల మాదల పంచాయతీలో వేగవతి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సరిహద్దు ఒడిశా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులకు పాడేరు మండలం నందిగరువులో చెట్టు నేలకూలింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో సుత్తిగుడ వద్ద భారీ వృక్షం నేలకూలింది. జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్‌లో కూలిన చెట్లను అధికారులు వెంటనే తొలగించారు. రాజవొమ్మంగి మండలంలోని వణకరాయి, దూసరపాము జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఇదే మండలంలో అనంతగిరి వెళ్లే మార్గంలో చెట్టు కూలిన ఘటనలో పాకలో మేక అక్కడికక్కడే మృతి చెందింది. వరద పరిస్థితులను జిల్లా కేంద్రంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొత్తవలస– కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి.సుమారు గంట పాటు కొండ నుంచి వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. బండరాళ్లు,మట్టి పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనుల్లో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. ఈమార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను ముందస్తుగా నిలిపివేతతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతగిరి ఘాట్‌రోడ్డుపైకి వరద ప్రవాహం అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు కొండల నుంచి వరదనీరు రోడ్డుపైకి వచ్చేయడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. జిల్లాలో 534.6 ఎంఎం వర్షపాతం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 534.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా అనంతగిరిలో 78.8, ముంచంగిపుట్టులో 45.8, అరకులోయలో 41.2, డుంబ్రిగుడలో 35.6, హుకుంపేటలో 34.6, పాడేరులో 34.2, కొయ్యూరులో 30.2, జి.మాడుగులలో 29, అడ్డతీగలలో 22.2, పెదబయలులో 21.6, దేవీపట్నంలో 19.8, రంపచోడవరంలో 19.6, చింతపల్లిలో 17.8, వై.రామవరంలో 17.6, రాజవొమ్మంగిలో 16.6, మారేడుమిల్లిలో 13.8, గూడెంకొత్తవీధిలో 13.4, గంగవరంలో 10.8, చింతూరులో 10.2, కూనవరంలో 7.6. వీఆర్‌పురంలో 7.4, ఎటపాక మండలంలో 6.8 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. పొంగిన చాపరాయి గెడ్డ డుంబ్రిగుడ: తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో పెద్దపాడు, కోసంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటసీమ రోడ్డు మార్గంలో డోమంగి వద్ద వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు: మండలంలో మంగళవారం వీచిన బలమైన ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొయ్యూరు కాలువ ఉధృతంగా ప్రవహించింది. జి.మాడుగుల: మండలంలో మోంథా తుపాను వర్షాలకు మంగళవారం గెమ్మెలి పంచాయతీ జి కొత్తూరులో బొంగరం వెంకటరావుకు చెందిన ఇంటిగోడ కూలిపోయింది. సొలభం పంచాయతీ వయ్యారిగరువులో పాంగి బాలరాజు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. పొంగిన గెడ్డలు, వాగులు వంతెనలపై నుంచి వరద నీటి ప్రవాహం ఈదురు గాలులకు కూలిన చెట్లు ప్రమాదకరంగా ఘాట్‌రోడ్లు ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు రైల్వేలైన్‌పై జారిపడిన కొండచరియలు ముందురోజే రాకపోకలు నిలిపివేతతో తప్పిన భారీ ప్రమాదం అత్యధికంగా అనంతగిరిలో 78.8 ఎంఎం వర్షపాతం నమోదు ప్రమాదస్థాయికి బలిమెల నీటిమట్టం ఉధృతంగా మత్స్యగెడ్డరైల్వే ట్రాక్‌పై కొండచరియలు జారిపడటంతో దెబ్బతిన్న ప్రాంతంమూతపడిన పర్యాటక ప్రాంతాలు డుంబ్రిగుడ: మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చాపరాయి జలవిహారి, అరకు పైనరీ, కొల్లాపుట్టు కాటేజీలు మూతపడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వరకు మూసివేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మోతుగూడెం: కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈనీటికి పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నీరు తోడవడంతో సీలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బలిమెల ప్రాజెక్ట్‌కు వరద తాకిడి నెలకొంది. ఈ ప్రాంతం నుంచి గుంటవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రంపచోడవరం/చింతూరు: తుపాను నేపథ్యంలో మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డులో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేసినట్టు మారేడుమిల్లి సీఐ గోపినరేంద్రప్రసాద్, చింతూరు ఎస్ఐ రమేష్ తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు సూచించారు. -
ధారాలమ్మ ఘాట్ మూసివేత
సీలేరు: తుపాను నేపథ్యంలో ధారాలమ్మ ఘాట్ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఏపీ జెన్కో చెక్ పోస్ట్ వద్ద మూసివేశారు. వాహన రాకపోకలు జరగకుండా ఎస్ఐ యాసిన్ చర్యలు చేపట్టారు. సీలేరు నుంచి గూడెం కొత్తవీధి వరకు ఉన్న సుమారు 50 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటమే కాకుండా చెట్లు కూలిపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేశామన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని తమ సిబ్బంది సహకారంతో మైదాన ప్రాంతాలకు పంపిస్తామని ఎస్ఐ తెలిపారు. ప్రమాదస్థాయికి బలిమెల ఆంధ్రా ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో ఇరు రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1507.21 అడుగుల మేర ఉంది. 104.3066 టీఎంసీల నిల్వల ఉన్నట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3219 క్యూసెక్కులు ఉండగా దిగువకు 1617.8 క్యూసెక్కులు వెళ్తోంది. ఏక్షణాన్నైనా బలిమెల డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు. గుంటవాడ జలాశయ నీటిమట్టం 1342.8 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1525 క్యూసెక్కులు కాగా విద్యుత్ ఉత్పత్తికి 1276 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీజెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోకి నీరు చేరే ప్రమాదం ఉన్నందున ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఏడీ జైపాల్, క్యాంప్ ఏఈ సురేష్ ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. డీవాటరింగ్ నిమిత్తం రెండేసి మోటార్లను ఏర్పాటుచేశారు. గుంటవాడ ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. మెయిన్, రెగ్యులేటరీ డ్యామ్‌ల వద్ద డీజిల్, సైరన్‌ను సిద్ధం చేశారు. -
ప్రమాదకర వాగులు దాటొద్దు
జి.మాడుగుల: మండలంలో గ్రామాల మధ్య గల గెడ్డలు, వాగులు మోంథా తుపాను వలన కురిసన వర్షాలకు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు వల్ల ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్ తెలిపారు. మండలంలో కుంబిడిసింగి పంచాయతీ కేంద్రానికి పోయే మార్గంలో మంగళవారం వర్షపునీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను ఆయన పరిశీలించారు. గెడ్డ ప్రవాహా ఉధృతి ఎక్కువగా ఉండడంతో సచివాలయ సిబ్బంది, పోలీస్ అధికారులు సహాయంతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఆయన మాట్లాడుతూ తుపాను వర్షాల వలన గెడ్డలు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని గెడ్డలు, వాగులు వాటే ప్రయత్నాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. నాటు పడవల ప్రయాణాలు చేయొద్దు ముంచంగిపుట్టు: మోంథా తుపాను తగ్గే వరకు నాటు పడవల ప్రయాణాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో చేయొద్దని ఎస్ఐ జె.రామకృష్ణ కోరారు. మండలంలోని సుజనకోట, లక్ష్మీపురం పంచాయతీల్లో మంగళవారం ఎస్ఐ రామకృష్ణ పర్యటించి.తుఫాన్ ప్రభావంపై గిరిజనులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. తుఫాన్‌తో రెవెన్యూ,పోలీసు,ఆరోగ్య శాఖాల అధికార యంత్రాంగమంతా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామస్తులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులకు తెలియజేయాలని, తుఫాన్ తగ్గేంత వరకు ప్రజలంతా అధికారులకు సహకారించాలని ఆయన కోరారు. -
బోసిపోయిన రైల్వేస్టేషన్
● పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు ● ఆలస్యంగా బయలుదేరిన పలు రైళ్లు తాటిచెట్లపాలెం (విశాఖ): తుఫాన్ దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వీటిలో ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన, విశాఖపట్నం చేరుకోవలసిన పలు రైళ్లు ఉన్నాయి. మరికొన్ని రైళ్లు దారిమళ్లించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఈ సమాచారాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరవేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. సమాచారం తెలియక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. మంగళవారం మొత్తంగా 19 రైళ్లను రద్దు చేయగా 11 రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. బుధవారం కిరండూల్–విశాఖపట్నం(18516)నైట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మచిలీపట్నం(17220) ఎక్స్‌ప్రెస్, రాయగడ–గుంటూరు(17244)ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–హైదరాబాద్(07166) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. 30వ తేదీన లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, ముంబయి–భువనేశ్వర్(11019)కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పూరీ–తిరుపతి(17479)ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. -
పునరావాస కేంద్రాలకు గిరిజనుల తరలింపు
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు పోలీసుస్టేషన్ పరిధిలో ధారకొండ గాలికొండ పంచాయతీలకు చెందిన తోకరాయి. చట్రాపల్లి గ్రామాల ప్రజలను కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాలతో సీలేరు ఎస్ఐ యాసీన్ ఆధ్వర్యంలో 250 మంది గిరిజనులు సురక్షిత ప్రాంతాలకు మంగళవారం తరలించారు. సీలేరు పోలీసులు తోకరాయి, చట్రాపల్లి గ్రామాలకు వెళ్లి స్థానికులకు తుపాను అప్రమత్తత, జాగ్రత్తలపై అవగాహన కల్పించి, వారిని ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగా తోకరాయి గ్రామంలో ఉన్న 65 కుటుంబాల గిరిజనులు ధారకొండ సచివాలయం భవనంలోను, చట్రాపల్లి గ్రామంలో ఉన్న ఆరు కుటుంబాలను సప్పర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. వీరికి ఎస్ఐ యాసీన్ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి వారికి భోజన సదుపాయాలను కల్పించారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సంప్రదించాలని అందుబాటులో పోలీస్ సిబ్బంది మహిళా పోలీస్ విఆర్వోలు ఉన్నారని వారికి భరోసా కల్పించారు. గత సంఘటన పునరావృతం కాకుండా... గత ఏడాది సెప్టెంబరు 8 న ఈ ప్రాంతంలో సంభవించిన భారీ తుపానుతో తోకరాయి, చట్రాపల్లి గ్రామ సమీపంలోని కొండచరియలు జారి పడడంతో బాటు, భారీ చెట్లు గ్రామ సమీపానికి కొట్టుకు వచ్చి పెను నష్టం సంభవించింది. చట్రాపల్లి గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మోంథా తుపాను నేపద్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తోకరాయి గ్రామ ప్రజలను ధారకొండ ఆశ్రమ పాఠశాలకు, చట్రాపల్లి గ్రామ ప్రజలను సప్పర్ల ఆశ్రమ పాఠశాలకు సీలేరు ఎస్ఐ యాసిన్ తమ సిబ్బందితో కలసి వాహనాలను తీసుకెళ్ళి వారిని తరలించి అక్కడ అవసరమైన వసతి, ఆహార ఏర్పాట్లను చేశారు. అప్రమత్తంగా ఉండాలి తుపాను తీవ్రతరం కానుండడంతో శివారు గ్రామ గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సీలేరు ఎస్ఐ యాసీన్ సూచించారు. ఎవరు బయటకు రావద్దని అత్యవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాగులు, గెడ్డలు దాటవద్దని మంగళవారం తమ సిబ్బందితో కలిసి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.తోకరాయి, చట్రాపల్లి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన యంత్రాంగం -
అందుబాటులో 15 యూనిట్ల రక్తం
పాడేరు రూరల్: ఇండియన్ రెడ్ క్రా స్ సొసైటీ అల్లూరి జిల్లా కేంద్రం బ్రాంచి జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో అవసరమైన రక్తం నిల్వ లేకపోవడంతో సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించా రు. అత్యససరాల వినియోగం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం జిల్లా బ్రాంచి నుండి బి.పాజిటివ్–5 యూనిట్లు, ఓ.పాజిటివ్–10 యూనిట్లు సేకరించి మంగళవారం పాడేరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్రావు తెలిపారు, అవసరమైన వారు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● మట్టి గృహాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు సాక్షి,పాడేరు: మోంథా తుపానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అఽధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని, మట్టి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారులపై చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించాలని,రాత్రి సమయంలో రహదారి ప్రమాదాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఓ సారి సమాచారం అందజేయాలన్నారు. జనరేటర్లు, డీజిల్, విద్యుత్ స్తంభాలు, ఇసుక బస్తాలను అవసరమైన ప్రాంతాలకు తరలించాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ట్యాంకులలో తాగునీటిని నింపి ఉంచాలని ఆదేశించారు.అన్ని ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాల్లో విద్యార్థులు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ మహిళా పోలీసులంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ తనిఖీ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తుపాను కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్ తనిఖీ చేశారు.జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు.కంట్రోల్ రూమ్‌లో అధికారులు, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,డీఆర్వో పద్మలత తదిత రులు పాల్గొన్నారు. -
బస్సులకు డిమాండ్
● ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రద్దు డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ద్వారకా బస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. కొంతమేర ఆర్టీసీ బస్సుల వద్ద (ఇచ్ఛాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం వరకు వెళ్లేందుకు) రద్దీగా ఉండగా.. ఓఎస్ఆర్టీసీ బస్సులకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్లో నిత్యం ఖాళీగా కనిపించే ఓఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ రైళ్ల రద్దు కారణంగా మంగళవారం కిటకిటలాడింది. తుఫాన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు రద్దు చేసుకోవడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు మంగళవారం ఖాళీగా దర్శనమిచ్చాయి. -
బంతి రైతు ఉసూరు
● ధర పతనంతో దిగాలు ● బుట్ట పూలు రూ.200 నుంచి రూ.50కు తగ్గుదల ● మోంథా తుపాను ఎఫెక్ట్ సాక్షి,పాడేరు: మోంథా తుపాను వర్షాలు బంతిరైతుకు నష్టం కలిగించాయి. పూల ధరను ఒక్కసారిగా పతనం చేశాయి. మొన్నటి వరకు బుట్ట పూలు రూ.150నుంచి రూ.200 ధరకు వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే వర్షాలతో బంతిపూలకు డిమాండ్ లేదన్న వ్యాపారులు మంగళవారం బుట్ట పూలను రూ.50ఽకు కొనుగోలు చేశారు. దీంతో గిరి రైతులు ఉసూరుమన్నారు. దూర ప్రాంతాల నుంచి వర్షంలో తడుస్తూ ఎంతో ఆశతో స్థానిక మార్కెట్‌కు తీసుకువచ్చారు. వ్యాపారులు చెల్లించిన ధర వారిని నిరాశకు గురి చేసింది. ముద్దబంతితో పాటు సీతమ్మకాటుక (చిన్నరకం)పూల ధర భారీగా తగ్గిపోయింది. -
అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పూజారి శైలజ
అనకాపల్లి: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులను ఉన్నత స్థాయి స్థితికి తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో ఔత్సాహికులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానన్నారు. పూజారి శైలజ కామన్వెల్త్ సహా పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని, అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు httpr//rportr.ap.gov.in, refirteration/payerrefirtration వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. -
వరి పొలాల్లో నీటిని తొలగించాలి
అనకాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి పొలాల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు సూచించారు. మండలంలో తుమ్మపాలలో వరి పొలాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒకట్రెండు చోట్ల లోతట్టు ప్రాంతాలు మినహా వరి పంట ఇప్పటి వరకు నీట మునగలేదన్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి పిలక దశలో ఉందన్నారు. ఈ దశలో నష్టం తక్కువగా ఉంటుందని, పూత దశలో గానీ, పొట్ట దశలో గానీ పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరి పంట పాలు పోసుకునే దశలో ఉంటే, పొలంలో నీటిని కాలువల ద్వారా తొలగించి, తెగుళ్ల నివారణ కోసం వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపికోనిజోల్ మందును చల్లుకోవాలన్నారు. పంట గింజ గట్టిపడే దశలో ఉంటే వర్షపునీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించి, గింజ మొలకెత్తకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల ఉప్పును లీటరు నీటికి) కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు మాట్లాడుతూ దిమిలి, కట్టుబోలు గ్రామాల్లో శారదా నది గట్టు తెగిపోకుండా ఇసుక బస్తాలతో పటిష్టపరిచే చర్యలను తీసుకున్నామన్నారు. రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయశాఖ అధికారి సుమంత, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఏడీఆర్ ముకుందరావు, అనకాపల్లి జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు -
అప్పన్న భక్తుల రక్షణకు చర్యలు
సింహాచలం: తుఫాన్ నేపథ్యంలో ిసింహాచలం దేవస్థానంలోని అన్ని విభాగాలను ఈవో ఎన్.సుజాత అప్రమత్తం చేశారు. కొండపైన, కొండ దిగువ ఉన్న విభాగాలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పర్యవేక్షించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ఉద్యోగులంతా అధికారుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే దేవస్థానం హెల్ప్‌లైన్ నంబర్ల(93987 34612, 0891–2954944)ను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వరద ఉధృతి ఉంటే రాకపోకలు వద్దు
డుంబ్రిగుడ: వరద ఉధృతి ఉన్న వంతెన మార్గంలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన కొర్ర పంచాయతీ సరిహద్దు ఒంటిపాక జంక్షన్ వద్ద వంతెనను పరిశీలించారు. బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహించడంతో ఈ మార్గంలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు పంటలు కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు. ఎంపీడీవో ప్రేమసాగర్, తహసీల్దార్ త్రివేణి పాల్గొన్నారు. హుకుంపేట: చీడిపుట్టు వద్ద వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడంతో ఈమార్గంలో రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాగులపై కల్వర్టుల పరిశీలన చింతూరు: చింతూరు, కూనవరం మండలాల్లో మంగళవారం ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ పర్యటించారు. వాగులపై కల్వర్టులను పరిశీలించారు. వరద ప్రభావిత గ్రామాలు, పునరావాస కేంద్రాలు, పల్లపు ప్రాంతాలు, కంట్రోల్ రూంలు, నిత్యావసర సరకుల పంపిణీ వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పల్లపు ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాను దృష్ట్యా బుధవారం ఐటీడీఏలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీవో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఎటపాక: మండలంలోని సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వైద్య శాఖలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చిలుకూరి ముక్తేశ్వరరావు(63) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై చింతూరు నుంచి భద్రాచలం వస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లిపాక నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి డీకొట్టింది. ఈ ప్రమాదంలో ముక్తేశ్వరరావు తీవ్ర గ్రాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ముక్తేశ్వరరావు -
ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధం
పాడేరు: మోంథా తుఫాన్ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో అవసరమైన చోటికి వెళ్లి వైద్యసేవలు అందించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధం చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ఈ టీమ్‌లు రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తాయని చెప్పారు. ప్రత్యేక వైద్యాధికారి పర్య వేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన తుఫాన్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఆయన మాట్లాడారు. పీహెచ్సీ వైద్యులు, సీహెచ్‌వోలు, ఆరోగ్య విస్తరణాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సమ్మె విరమించిన 105 మంది వైద్యులు సోమవారం విధుల్లోకి చేరారని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్టు తెలిపారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న 75 మంది గర్భిణులను అంబులెన్స్‌లలో సోమవారం ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, శిశువులు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్ కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది పాల్గొన్నారు. -
కోటి సంతకాలతో ప్రైవేటీకరణను అడ్డుకుందాం
అనంతగిరి(అరకులోయటౌన్): కోటి సంతకాల సేకరణతో వైద్యకళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని చిలకలగెడ్డ, కాశీపట్నంలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామ సభలు, కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారన్న అక్కసుతో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని చెప్పారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, పేదలకు ఉచిత వైద్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతల సన్నిహితుల జేబులు నింపడానికే కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి కై నా కూటమి ప్రభుత్వ పెద్దలు వైద్య కళాశాలల ప్రైవేటీ కరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, చిలకలగెడ్డ సర్పంచ్ అప్పారావు, మాజీ ఎంపీపీ రవణమ్మ, జిల్లా బిసీ సెల్ అధ్యక్షుడు కుమార్, పార్టీ నాయకులు పైడమ్మ, సింహాచలం, సన్యాసిరావు, సీతమ్మ, కె. సత్యావతి, కమ్మన్న, రమేష్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మత్స్యలింగం -
12 మండలాలపై తుఫాన్ ప్రభావం
సాక్షి, పాడేరు: మోంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు.సోమవారం ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని 163 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తించామన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 9 మండలాలతో పాటు పాడేరు నియోజకవర్గంలో పాడేరు, అరకులోయ నియోజకవర్గంలో అరకులోయ, అనంతగిరి మండలాల్లో మోథా ప్రభావం అధికంగా ఉండవచ్చని, ఆ మేరకు ఆయా మండలాల్లో సచివాలయాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, పోలీసు సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 63 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామని, గుడిసెల్లో ఉన్నవారిని అక్కడకు తరలిస్తామన్నారు. ఆహార పదార్థాలతో పాటు మందులు కూడా సిద్ధం చేసినట్టు చెప్పారు. వాగులు, గెడ్డలు,రిజర్వాయర్లు,నదులలో నిరంతరం నీటిమట్టాన్ని గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.11 హెలిపాడ్స్,21 క్రేన్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. విద్యుత్‌తో పాటు అన్నిశాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని,ఘాట్రోడ్లపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గర్భిణులను ముందస్తుగానే ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, పాడేరు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం 24గంటల పాటు పనిచేస్తుందన్నారు. తుఫాన్‌తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన,ఎలాంటి సంఘటనలు జరిగినా 7780292811 నంబర్‌కు సమాచారం ఇచ్చి అత్యవసర సహాయం పొందాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్దర్, ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పివో తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్‌కుమార్ -
జోరుగా వర్షాలు
మోంథా ఎఫెక్ట్..● అప్రమత్తమైన అధికారులు ● ఆందోళనలో అన్నదాతలుసాక్షి, పాడేరు: మోంథా తుఫాన్ ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి పాడేరుతో పాటు అన్ని మండలాల్లోను జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో గిరిజన రైతుల్లో ఆందోళన నెలకొంది. వరితో పాటు చిరుధాన్యాల పంటలు కోత దశలో కళకళాడుతున్నాయి. వర్షాల కారణంగా పంటలు నష్ణపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని జీకేవీధిలో 20.2 మిల్లీమీటర్లు, అడ్డతీగలలో 8.4, దేవిపట్నంలో 2,8, గంగవరంలో 2.8, అరకులోయలో 2.2, డుంబ్రిగుడలో 2, పాడేరులో 1.4, అనంతగిరి 1.2, వై.రామవరంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు తుఫాన్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సోమవారం తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, అన్ని ఉన్నత,ప్రాథమిక పాఠశాలలు తెరవవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: పీవో స్మరణ్‌రాజ్ రంపచోడవరం: తుఫాన్ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను పీవో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్‌కు సంబంధించిన సమాచారం, ప్రజల ఇబ్బందులను తెలుసుకుని నివేదికలు ఇవ్వాలని తెలిపారు. ఏడు మండలాల్లో బాధితుల నుంచి కంట్రోల్ రూమ్‌కు సమాచారం వ చ్చిన వెంటనే స్పందించి తగు చర్య లు తీసుకోనున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని ఏపీవో జనరల్ డి.ఎన్.వి. రమణను ఆదేశించారు. పీవో వెంట డీటీ జిలానీ, బి.మార్గదర్శి, పి.లక్ష్మిరెడ్డి, నాగేంద్ర తదితరులు ఉన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో మెరిసిన గిరిజనుడు
ముంచంగిపుట్టు: మండలంలోని పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్తాడి ప్రసాద్ అథ్లెటిక్స్ పోటీ ల్లో మెరిశాడు. ఈ నెల 26న విశాఖపట్నంలోని పోలీసు బేరక్స్ మైదానంలో వెటరన్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రసాద్ సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్‌త్రోలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రసాద్‌కు పతకాలతో పాటు సర్టిఫికెట్లను విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అందజేశారు. డిసెంబర్ 13,14 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీలకు ప్రసాద్ ఎంపికయ్యాడు.800 మీటర్ల పరుగులో మొదటి స్థానం -
జలాశయాల గేట్లు ఎత్తివేత
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల అధికారులు మోంథా తుఫాన్‌తో అప్రమత్తమయ్యారు. తుఫాన్‌తో సరిహద్దులో విస్తారంగా భారీ వర్షాలు కురిస్తాయని, నీటి నిల్వలు పెరుగుతాయని ముందగానే భావించిన జలాశయాల అధికారులు నీరు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం నీటి మట్టం 2,590 అడుగులు కాగా సోమవారం నాటికి 2,583.60 అడుగులుగా నమోదైంది. డుడుమ జలాశయం ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,747.95 అడుగులు ఉంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జోలాపుట్టు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి ఉదయం 10 వేల క్యూసెక్కుల నీటిని డుడుమకు విడుదల చేశారు, క్రమేపి నీటి విడుదల పెంచుతూ సాయంత్రం 5గంటలకు 18వేల క్యూసెక్కుల నీటిని డుడుమ జలాశయంలోకి విడుదల చేశారు.డుడుమ జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 14వందల క్యూస్కెల నీటిని దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేశారు. డొంకరాయి డ్యామ్ నుంచి.. మోతుగూడెం: తుఫాన్ నేపథ్యంలో డొంకరాయి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయం ఏడు గేట్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,037 అడుగులు కాగా 1,034 అడుగులకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిపై రాకపోకలు సాగించవద్దని జెన్కో అధికారులు తెలిపారు.జోలాపుట్టు నుంచి 18వేలు, డుడుమ నుంచి 14వేల క్యూసెక్కుల నీరు విడుదల -
లబ్బూరు ఏకలవ్యలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
● రూ.40లక్షలతో నీటి సౌకర్యం కల్పనకు ప్రతిపాదనలు ● ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కన్సల్టెంట్ కృష్ణారావు ముంచంగిపుట్టు: లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కన్సల్టెంట్ జి.కృష్ణారావు తెలిపారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడిన్షియల్ పాఠశాలను సోమవారం కన్సల్టెంట్ కృష్ణరావు,నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. నీటి ఎద్దడి, ప్రహారి,అసంపూర్తి భవనాల సమస్యలు విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లారు. సమీప గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కృష్ణారావును కలిసి నీటి సమస్యతో పిల్ల లు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.40 లక్షలతో ఏకలవ్య పాఠశాలలో తాగునీటి సౌక ర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఓఎస్డీ మూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ రామదాసులు పాల్గొన్నారు. -
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ): తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరే, విశాఖమీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను గమ్యం కుదించింది. అలాగే వాల్తేర్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేసింది. ఏ పరిస్థితినైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్ఎం లలిత్‌బోహ్ర ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అయితే ముందుగా 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినా, సాయంత్రానికి కొన్ని రైళ్లు యథావిథిగా బయల్దేరాయి. 28న రద్దు చేసిన రైళ్లు 1)కిరండూల్–విశాఖ(18516)నైట్ ఎక్స్‌ప్రెస్ 2)విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ 3)కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ 4)విశాఖపట్నం–కోరాపుట్(58538)పాసింజర్ 5)కోరాపుట్–విశాఖపట్నం(58537)పాసింజర్ 6)కోరాపుట్–విశాఖపట్నం(18511)ఎక్స్‌ప్రెస్ 7)రాజమండ్రి–విశాఖపట్నం(67285)మెము 8)విశాఖపట్నం–రాజమండ్రి(67286)మెము 9)విశాఖపట్నం–కాకినాడ(17268) ఎక్స్‌ప్రెస్ 10)కాకినాడ–విశాఖపట్నం(17267) ఎక్స్‌ప్రెస్ 11)విశాఖపట్నం–గుంటూరు(22875) డబుల్ డెక్కర్ఎక్స్ప్రెస్ 12)గుంటూరు–విశాఖపట్నం(22876) డబుల్డెక్కర్ఎక్స్ప్రెస్ 13)బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్‌ప్రెస్ 14)విశాఖపట్నం–పలాస(67289)మెము 15)పలాస–విశాఖపట్నం(67290)మెము 16)విజయనగరం–విశాఖపట్నం(67288) మెము 17)బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531)పాసింజర్ 18)విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్ 19)విశాఖపట్నం–గుణుపూర్(58506) పాసింజర్ 20)గుణుపూర్–విశాఖపట్నం(58505) పాసింజర్ 21)భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 22)భువనేశ్వర్–సికింద్రాబాద్(17015)విశాఖ ఎక్స్‌ప్రెస్ 23)భువనేశ్వర్–పుదుచ్చేరి(20851) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వాల్తేర్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ డెస్క్‌లు ● విశాఖపట్నం–0891–2746330 / 2744619 ● విజయనగరం–08922–221202 ● శ్రీకాకుళం రోడ్–08942–286213 / 286245 ● దువ్వాడ– 0891–2883456 ● రాయగడ–0891–2885744 / 2885755 ● నౌపడ–0891–2885937 ● అరకు–08936–249832 ● కోరాపుట్–0891–2884318 / 2884319 ● జగదల్పూర్–0891–2884714 / 2884715 ● బొబ్బిలి–0891–2883323 / 2883325 -
గ్రామసభల ఆమోదంతోనే హైడ్రో పవర్ ప్రాజెక్టులు
సాక్షి, పాడేరు: గ్రామసభల ఆమోదంతోనే జిల్లాలో చిట్టంవలస, గుజ్జెలి ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ తెలిపారు. నెడ్‌క్యాప్ అధికారులతో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల వేలాది ఎకరాల భూములు, 250 గ్రామాలు మునిగిపోతాయని, 50వేల మంది గిరిజనులకు నష్టం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలతో 116 ఎకరాల అటవీ భూమి, 1,302 ఎకరాల అటవీయేతర భూములు ప్రభావితం అవుతాయన్నారు. దూదికొండ, భీమవరం, కుసుమువలస ముంపు ప్రాంతం 304 ఎకరాలకే పరిమితమన్నారు. దూదికొండ, ముసిరిగుడ, చిప్పపల్లి, డుంబ్రిగుడ, మజ్జివలస గ్రామాల పరిధిలో 52 గుడిసెలకు మాత్రమే నష్టం ఉంటుందని చెప్పారు. ఉంగళగుడ, కొగువలస, అడ్డుమండ, శంకుపర్తి, దామపర్తి తదితర ప్రభావిత గ్రామాలన్నింటికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. గిరిజన చట్టాలకు అనుగుణంగానే ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతాయని, గిరిజనుల భూములన్నీ ప్రభుత్వ రంగ సంస్థ నెడ్కాప్ సంస్థకే అప్పగిస్తామని, ఆసంస్థ ఆధ్వర్యంలోనే పనులు జరుగుతాయని తెలిపారు. ఈ పీ ఎస్పీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాల ద్వారా 400 మందికి ప్రత్యక్షంగాను, 3,000 మందికి పరోక్షంగాను ఉద్యోగ,ఉపాఽధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల ప్రభావిత గ్రామాలతో పాటు సమీప గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలల అభివృద్ధి, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలతో సమగ్ర అభివృద్ధికి నెడ్‌క్యాప్ సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూగర్భ పైప్‌లైన్‌తో పాటు సమాంతర పైప్‌లైన్ కోసం ప్రణాళిక రూపొందిస్తామని, అన్ని ప్రభావిత, సమీప గ్రామాలకు పైపుల ద్వారా తాగునీటిని అందిస్తామని చెప్పారు. నెడ్‌క్యాప్ సంస్థ ఎండీ కమలాకర్, జీఎం శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పీఎస్పీ ప్రాజెక్ట్‌లకు అన్ని సర్వేలు పూర్తి చేసిన తరువాత ప్రభావిత గ్రామాల్లో గ్రామసభల ద్వారా తగిన నిర్ణయం తీసు కుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు. ప్రాజెక్ట్‌లకు ఆమోదం వస్తే గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పునరావాస కల్పనకు చర్యలు కలెక్టర్ దినేష్‌కుమార్ -
పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఎర్రవరం జలపాతానికి వెళ్లే రహదారిని మూసివేస్తున్న రెవెన్యూ సిబ్బందిచింతపల్లి: తుఫాన్ నేపథ్యంలో మండలంలో పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్టు తహసీల్దారు కె.శంకరరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎర్రవరం జలపాతం, చెరువులు వేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం తదితర పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్టు ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. తమ సిబ్బందితో రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. -
రుషికొండలో డీఐజీ పర్యటన
కొమ్మాది: తుఫాన్ నేపథ్యంలో రుషికొండ బీచ్‌ను డీఐజీ గోపినాథ్ జెట్టీ, అడిషనల్ ఎస్పీ మధుసూదన్‌తో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. పర్యాటకులు బీచ్‌కు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను మైరెన్ పోలీసులు అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు తుఫాన్ గురించి అవగాహన కలిగించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూసుకోవాలని, తీర ప్రాంతాలకు ఆనుకొని నివాసాల్లో ఉన్న మత్స్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో మైరెన్ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. వెలవెలబోయిన పర్యాటక ప్రాంతాలు తుఫాన్ ప్రభావంతో సాగర్‌నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలు వెలవెలబోయాయి. ఎప్పుడు సందడిగా ఉండే ఈ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు లేక బోసిపోయాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ, తిమ్మాపురం, మంగమారిపేట, చేపలుప్పాడ, భీమిలి తీర ప్రాంతాల మత్స్యకారులు, పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. -
ఆ గ్రామాల్లో రాకపోకలకు తాళ్ల వంతెనే ఆధారం
రాజవొమ్మంగి: సింగంపల్లి, కిండ్రకాలనీ గ్రామాల ప్రజల రాకపోకలకు తాళ్ల వంతెన మాత్రమే ఆధారంగా ఉంది. సింగంపల్లి, కిండ్రకాలనీ గ్రామాలు మండల కేంద్రానికి దూరంగా, ఉధృతంగా ప్రవహించే మడేరు వాగుకు ఆవలవైపు ఉన్నాయి. ఇక్కడ నివసించే గిరిజనులు వాగు దాటి ప్రమాదాల బారిన పడకుండా, రహదారి సదుపాయం కల్పిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఈ రెండు గ్రామాలకు వెళ్లేందుకు రోప్‌వేలు ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాల క్రిందట తుపాను ప్రభావంతో ఈ రెండు వంతెనలు దెబ్బతినగా, వాటికి మరమ్మతులు చేపట్టారు. ఈ గ్రామాల గిరిజనులు అత్యవసరంగా మండలకేంద్రం రాజవొమ్మంగి వెళ్లాలంటే దాదాపు 30 ఏళ్లుగా తాళ్ల వంతెనే ఆధారంగా ఉంది. ఈ తాళ్ల వంతెనలు కేవలం కాలినడకన వెళ్లే వారికి, ద్విచక్రవాహన దారులకు మాత్రమే ఉపకరిస్తుంది. ఈ రెండు రోప్–వేల నిర్వహణను సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ ఇటీవల పట్టించుకోడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. నిపుణులు వీటిని ఒకసారి పూర్తిగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
తుఫాన్ దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి
ఎమ్మెల్యే మత్స్యలింగం అనంతగిరి(అరకులోయటౌన్): తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అరకు నియోజకవర్గం ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ఇళ్లలో ఉంటూ జాగ్రతలు పాటించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం మండలంలోని చిలకలగెడ్డలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న నిత్యవసర వస్తువులతో పాటు ఇతర అవసరమైన వాటిని ముందుగా సమకూర్చుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితిలో అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 93815 58327, 93468 83782కు సంప్రదించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సన్యాసిరావు పాల్గొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: జెడ్పీటీసీ శెట్టి రోషిణి అరకులోయ టౌన్: మండలంలోని ప్రజలంతా మోంథా తుఫాన్‌కు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీటీసీ శెట్టి రోషిణి, యువజన నాయకుడు రేగం చాణిక్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. మోంథా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నందున ప్రజలు గెడ్డలు, వాగులు దాటవద్దన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఆర్ఐ, సచివాలయ సెక్ర టరీ
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ బొగ్గురోడ్డు–2 సచివాలయ పరిధిలో చిట్టివలసకు చెందిన ఒక వ్యక్తి ఇంటిపన్ను పేరు మార్చడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వై.స్వామినాయుడును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసి స్వామినాయుడును ప్రోత్సహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తాత పేరు మీదు ఉన్న ఇంటి పన్ను తన పేరిట మార్చాలని సెప్టెంబరులో బాధితుడు సచివాలయాన్ని సందర్శించారు. తరువాత అడ్మిన్, భీమిలి జోనల్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ వద్దకు తీసుకెళ్లగా రూ.60 వేలు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జరుగుతున్న బేరసారాల అనంతరం రూ.30 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీతో సహా సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ మాటు వేసి తాతా థియేటర్ డౌన్లోకి మార్చిన సచివాలయంలో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. తరువాత ఆర్ఐ రాజును చిట్టివలసలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. -
క్వారీ బ్లాసింగ్‌లు నిలపాలి
రాజవొమ్మంగి: జాతీయ రహదారి నిర్మాణ పనుల నేపథ్యంలో మండలంలోని జడ్డంగి వద్ద ఏర్పాటు చేసిన మెటల్ క్వారీ వద్ద బాంబు పేలుళ్లను ఆపాలని జడ్డంగి పీసా కమిటీ కార్యదర్శి తెడ్ల రాంబాబు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర్లు అనే మేకల కాపరి సోమవారం ఈ ప్రాంతంలో జరుగుతున్న పేలుళ్లకు భయపడి పరిగెత్తుతూ కింద పడిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు చేతిలోని కత్తి చేయి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు జడ్డంగి పీహెచ్‌సీకు తరలించగా ప్రథధమ చికిత్స అనంతరం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మెటల్ క్వారీ వద్ద ప్రమాదకరమైన బ్లాసింగ్ ఆపాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులు, సంభందిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. -
వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు
అడ్డతీగల: అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం వద్ద పెద్దేరు వాగుపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలకు సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్ తెలిపారు.తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా వాటిపై ప్రమాదకర పరిస్తితుల్లో రాకపోకలు సాగించవద్దన్నామన్నారు.తాము వాగు వద్దకు వెళ్లేసరికి వాగు దాటడానికి ప్రయత్నిస్తున్న పనుకురాతిపాలెం గ్రామస్తులను ఆపి పరిస్థితిని వివరించినట్టు చెప్పామన్నారు.ట్యూబులతో ప్రజలను వాగు దాటించడానికి యత్నిస్తున్న ఓ గ్రామస్తుడిని అడ్డుకొని గెడ్డదాటకుండా హెచ్చరించామన్నారు. రానున్న మూడు రోజులో మోంథా తుపాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తాయని ఎవ్వరూ వాగులు, వంకలు దాటకుండా ఇంటి వద్దనే ఉండాలని వారికి తెలియజేశామన్నారు. సీలేరు: సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో సీలేరు. దారకొండ. దుప్పులు వాడ. గుమ్మరేవులు. అమ్మవారి దారకొండ వంటి పంచాయతీలో గ్రామస్తులు గిరిజనులు మోంథా తుపానుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణం శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమైంది అన్ని చర్యలు చేపడుతుంది. గిరిజనులు ఎవతూ తుపాను మూడు రోజులు ఇంట్లోంచి బయటకు రావద్దని ప్రమాదంగా ప్రవహించే వాగులు గెడ్డలు దాటవద్దని ప్రమాదంగా ఉన్న గ్రామాలను ఇప్పటికే గుర్తించి మహిళా పోలీసుల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నామని. ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే సీలేరు పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే దవెంటనే చర్యలు చేపడతామని ఎవరు ఎటువంటి ఆందోళన పడవద్దని కోరారు. అలాగే గ్రామంలో ఉన్న యువకులు అప్రమత్తంగా ఉండి వృద్ధులు, చిన్నారులు పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఎస్ఐ యాసీన్ సోమవారం పలు గ్రామాలను సందర్శించి తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఏమి జరిగినా తక్షణమే సమాచారం ఇస్తే ఆదుకుంటామని కోరారు. -
అవినీతి నిర్మూలనకు సహకరించాలి
మోతుగూడెం సీఈ కార్యాలయం వద్ద ర్యాలీ చేస్తున్న అధికారులు, సిబ్బంది మోతుగూడెం: సర్దార్ వల్లబాయి పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నవంబరు 2వ తేదీ వరకు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో యాజమాన్యం ద్వారా లోయర్ సీలేరు సీఈ కార్యాలయంలో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ కేవీ రాజారావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలించడానికి అందరూ కలిసి నిజాయితీగా, పారదర్శకంగా నిబద్దతో పనిచేయాలని, ఉద్యోగం బాధ్యతయుతగా చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఈ చిన కామేశ్వరరావు, ఈఈలు బాలకృష్ణ, నాగ శ్రీనివాస్,వరప్రసాద్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయండి
అరకులోయటౌన్: మోంథా తుపాను ప్రభావం దష్యా ప్రజలను అప్రమత్తం చేయాలని మండల ప్రత్యేకాధికారి కె. కర్ణ అధికారులకు ఆదేశించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. అవసరమైన వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా వాటి పునరుద్దరణకు సిద్దంగా ఉండాలన్నారు. కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అన్ని శాఖ అధికారుల సమన్వయంతో పనిచేసి విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. రిలీఫ్ రిష్యూ ఆపరేషన్లు అవసరమైన విపత్తు నిర్వహణ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లు 6281779281, 9866266806 సంప్రదించాలన్నారు. ఎంపీడీఓ లవరాజు, ఎంఈఓ త్రినాధ్రా వు, ఎస్ఐ గోపాలరావు, మండలస్ధాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చింతపల్లి: మోంథా తుపాను ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా మండల స్ధాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వి.విజయ్‌రాజ్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలస్థాయి అదికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల అన్ని పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులను వాగులు వంకలు దాటి ప్రయాణాలు చేయకుండా అప్రమత్తం చేయాలన్నారు. పంచాయితీస్థాయి అధికారులు సిబ్బంది స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల కేంద్రానికి తెలియజేయాలన్నారు. తుపాను ప్రభావంతో ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా మండల స్థాయి అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దార్ శంకరరావు, ఎంఈవో ప్రసాద్, ఏపీవో రాజు, ఏపీఎం శ్రీనివాసరావు, ఏవో మధుసూదనరావు, సీడీపీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
దొంగనోట్ల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ఎంవీపీకాలనీ: నగరంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును ఇటీవల రట్టు చేసిన కేసులో ఎంవీపీ పోలీసులు మరో ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్‌కు పంపారు. ద్వారకా ఏసీపీ నరసింహామూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. కేసులో ప్రధా న నిందితుడు శ్రీరామ్ అలియాస్ గుప్తాను ముందుగా అరెస్టు చేశారు. తాజాగా వరప్రసాద్, ఆనంద్, కొప్పల గంగాధర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎంవీపీ, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు. -
గిరి రైతుల్లో గుబులు
● వెంటాడుతున్న తుపాను భయం ● దిగుబడి దశలో వరి, రాగుల పంటల ● ఆందోళనలో రైతాంగం సాక్షి,పాడేరు: బంగళాఖాతంలో ఏర్పడునున్న మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికి గిరిజన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్‌లో గిరిజన రైతులు 56వేల హెక్టార్లలో వరి, 17వేల హెక్టార్లలో రాగులు, చిరుధాన్యాల పంటలను సాగు చేశారు. ఈ పంటలన్నీ ప్రస్తుతం దిగుబడి దశలో కళకళాడుతున్నాయి. నవంబర్ నెల నుంచి పంట కోతలకు గిరిజన రైతులు సిద్దమవుతున్న తరుణంలో అల్పపీడన భయం నెలకొంది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ ప్రకటనలతో గిరిజన రైతుల్లో కలవరం ఏర్పడింది. లోతట్టు వ్యవసాయ భూముల్లో పంటలపై రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. గతంలోను అనేక తుపానులలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితిని గుర్తిచేసుకుంటున్న రైతులు భారీ వర్షాలు కురవకూడదని భావిస్తున్నాన్నారు. తిండి గింజల కోసమే వరి, రాగులు, ఇతర చిరుధాన్యాల పంటలను గిరిజన రైతులు సాగు చేస్తుంటారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులలో లోతట్టు పంట భూముల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువాలు తవ్వుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.భారీ వర్షాలు కురిస్తే నష్టమే భారీ వర్షాలు కురిస్తే పంటలకు నష్టం ఏర్పడుతుంది.లోతట్టు భూముల్లో వరిపంటను సాగు చేస్తున్నాను.దిగుబడి దశలో పంట ఉంది.ఈ పరిస్థితులలో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో భయంగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురవుతాయి. రాగుల పంట నేలవాలే ప్రమాదం ఉంది. – వంతాల మోహనరావు, గిరిజన రైతు, రంగిలిసింగి పంచాయతి, డుంబ్రిగుడ మండలం -
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
అరకులోయటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో తీవ్రనష్టమని జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి అన్నారు. మండలంలోని మారుమూల ఇరగాయి పంచాయతీ ఉరుములు గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా జెడ్పీటీసీ సభ్యురాలు రోషిణి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య కళాశాలలు నిర్మాణం చేడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటుపరం చేయడంతో పేదలకు వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందన్నారు. రాష్ట్రంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని జెడ్పీటీసీ రోషిణి డిమాండ్ చేశారు. ఇరగాయి సర్పంచ్ మాదల బుటికి, ఎంపీటీసీ జన్ని చెల్లమ్మ, ఉమ్మడి విశాఖజిల్లా ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, సీనియర్ నాయకులు నాగేష్, బొంజుబాబు, గిరిజనులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, ఎంపీటీసీలు కూడా పాపారావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కె హరి, గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు మఠం శకంర్, లీలారాణీ, హెచ్.బి.రామునాయుడు, మాజీ ఎంపీటీసీ మహాదేవ్, నాయకులు సింహాచలం, మోహన్‌రావు, నరసింగరావు, గురునాయుడు, సుమన్, నామమూర్తి, ప్రసాద్, గంగాధర్, సుందర్రావు పాల్గొన్నారు. జి.మాడుగుల: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్భ పంచాయతీ రోలంగిపుట్టు,చేపల్లి,పొర్లు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు చిట్టిబాబు, మసాడి గంగరాజు, పెదలువ్వాసింగి పంచాయతీ వంచేబు గ్రామంలో మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాలు కార్యక్రమం జరిగింది. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల వివరాలతో కూడిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుందని, ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వారు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలోనే నడవాలని, ప్రజానిధులతో నిర్మించిన భవనాల ఆస్పత్రుల పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. నాయకుడు చంటిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. గూడెంకొత్తవీఽధి: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతరేకంగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రింతాడ పంచాయతీ అసరాడలో ఆదివారం చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు పలాసి చిన్నారావు,దేశగిరి వీరన్నపడాల్, చినతల్లి, మురళీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
137 కిలోల గంజాయి స్వాధీనం
● విలువ రూ.13 లక్షలు ● ముగ్గురి అరెస్టు, ఇద్దరు పరారీ చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న రూ.13 లక్షల విలువైన 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ వినోద్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం ఎస్ఐ వీరబాబు, సిబ్బందితో లోతుగెడ్డ వంతెన వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 137 కిలోల మూడు గంజాయి మూటలను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల నుంచి కారు, రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. చింతపల్లికి చెందిన ఇద్దరు, గూడెంకొత్తవీధికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారని, వీరు చింతపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. గంజాయిని నర్సీపట్నం తరలిస్తున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. -
జి.మాడుగుల యూబీఐలో మంటలు
జి.మాడుగుల: స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. బ్యాంక్ సెలవు కావడంతో సెక్యూరిటీ గార్డు ఒక్కరే కాపలాగా ఉన్నారు. బ్యాంక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అతను వెంటనే బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బందికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. బ్యాంక్ తాళాలు తీయడంతో స్థానిక యువకుడు కొర్రా క్రాంతి కుమార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్నుంచి సరఫరా నిలిపివేశాడు. బ్యాంక్‌లో ఉన్న అగ్నిమాపక సిలిండర్లతో మంటలను అదుపుచేశాడు. అప్పటికే బ్యాంక్ క్యాబిన్లో కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్, ఏసీ, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. బ్యాంక్ ఇన్చార్జి మేనేజర్ జీవన్, ఎస్ఐ షణ్ముఖరావు సంఘటన స్థలానికి వచ్చి అగ్నిప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బ్యాంక్‌లో పరికరాలు దగ్ధం -
ధారకొండను మండల కేంద్రంగా ప్రకటించాలి
సీలేరు: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంటూ విద్య, వైద్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నేటికీ అందకుండా అంధకారంలో బతుకుతున్న మా గ్రామాలను ధారకొండ మండల కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి పథంలో గిరిజన గ్రామాలను నడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఐదు పంచాయతీ గిరిజన ప్రజలు కోరుతున్నారు. ఆదివారం దారకొండ వారపు సంతలో వేలాది మంది గిరిజనులు వివిధ పార్టీ నాయకులతో కలిసి దారకొండ మండల కేంద్రంగా ప్రభుత్వం తక్షణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. దాదాపుగా 50 ఏళ్లుగా మండల కేంద్రానికి దూరంగా ఉంటూ మా గ్రామాలు అభివృద్ధి చెందటం లేదని ఏ చిన్న అవసరమైన మూడు గంటల ఘాట్ రోడ్లు నరక ప్రయాణం చేసి మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని తీరా వెళ్లాక పనులు జరగక వెనుతిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. మా ఐదు పంచాయతీలు కొండ ప్రాంతంలో ఉండడంతో ప్రజాప్రతినిధులు గాని జిల్లా. మండల అధికారులు రాకపోవడంతో అభివృద్ధి చెందడం లేదని మా దారకొండ పంచాయతీలో మండల కేంద్రం ప్రకటిస్తే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దయచేసి ఈ ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నాయకులు విష్ణుమూర్తి. జగన్, విశ్వేరరావు, శ్రీనివాస్. ఎంపీటీసీ రామన్న తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే దేముడుకు ఘన నివాళి
● వెలగలపాలెంలోని స్మ ృతి వనం వద్ద వర్థంతి ● నిర్వహించిన కుటుంబ సభ్యులు ● ప్రజలకు ఎనలేని సేవలు: అరకు మాజీ ఎంపీ మాధవి కొయ్యూరు: మాజీ ఎమ్మెల్యే దివంగత గొడ్డేటి దేముడు ప్రజలకు ఎనలేని సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అరకు మాజీ ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలోని ఆయన స్మ ృతి వనం వద్ద పదో వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. అనేక భూ పోరాటాలను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు. అల్లూరి,అనకాపల్లి జిల్లా సీపీఐ కార్యర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దేముడు విగ్రహానికి ఎంపీతోపాటు ఆమె సోదరుడు మహేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇరువాడ దేముడు, రావణాపల్లి ఎంపీటీసీ ఐ.సత్యవేణి, గురుబాబు, మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు, నీలాపు సూరిబాబు పాల్గొన్నారు. -
ఉత్పత్తి మెండుగా..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాలకు మేలు చేశాయి. నిండుకుండను తలపిస్తున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. గత రెండేళ్లలో నాలుగు జలవిద్యుత్కేంద్రాలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పాదన సాధించాయి.ప్రాజెక్టులు నిండుగా..లక్ష్యానికి చేరువైన నాలుగు జలవిద్యుత్ కేంద్రాలుఆంధ్రా–ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంమోతుగూడెం: లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. దీంతో జలవిద్యుత్తోపాటు గోదావరి డెల్టా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఏపీ జెన్కో అధికారవర్గాలు పేర్కొన్నాయి. ● ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్‌లైన జోలాపుట్టు, బలిమెల జలాశయాల్లో ఆంధ్రా వాటాగా 64 టీఎంసీలు ఉన్నట్టు ఇరు రాష్ట్రాల అధికారులు లెక్క తేల్చారు. మొత్తంమీద డొంకరాయి, గుంటవాడ జలాశయాలతో కలుపుకుని 78 టీఎంసీలు ఉన్నట్టుగా జెన్కో అధికారులు నిర్థారించారు. రబీలో గతేడాది గోదావరి డెల్టాకు 60 టీఎంసీలు విడుదల చేశారు. ● కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి, పోర్బే జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 120 టీఎంసీలు నిల్వ ఉండగా రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటికే జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. బలిమెల జలాశయం మరో పది అడుగులకు చేరువలో ఉంది. మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. డొంకరాయి ప్రాజెక్ట్‌కు వరద తాకిడి నెలకొంది. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరద నీటిని జలాశయం గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి వివరాలు ● మాచ్‌ఖండ్: 23–24 లక్ష్యం 626 మిలియన్ యూనిట్లు కాగా 535.576 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి. 24–25 లక్ష్యం 630 మిలియన్ యూనిట్లు కాగా 554.698 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. ● అప్పర్ సీలేరు 23–24 లక్ష్యం 470 మిలియన్ యూనిట్లు కాగా 480 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 477 మిలియన్ యూనిట్లకు 495.7 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. ● డొంకరాయి 23–24 లక్ష్యం 99 మిలియన్ యూనిట్లు కాగా 105.732 మిలియన్ యూనిట్లు సాధించింది. 24–25లో 95 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 105.224 మిలియన్ యూనిట్లు సాధించింది. ● పొల్లూరు 23–24 లక్ష్యం 1084 మిలియన్ యూనిట్లు కాగా 1090 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 1095 మిలియన్ యూనిట్లు కాగా 1120.65 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. లోయర్ సీలేరు ప్రాజెక్ట్ జలాశయాలకు వరద తాకిడి పూర్తిస్థాయికి నీటిమట్టాలు 15,685 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జలవిద్యుత్ ఉత్పాదనకు, గోదావరి డెల్టాకు సమృద్ధిగా నిల్వలు ఏపీ జెన్కో అధికారవర్గాల వెల్లడి ఉత్పాదనకు ఢోకా లేదు జోలాపుట్టు, బలిమెల రిజర్వాయర్లతోపాటు డొంకరాయి, గుంటవాడ జలాశయాలు కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువలో ఉన్నాయి. దీనివల్ల ఈ ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదు. గోదావరి డెల్టాకు పుష్కలంగా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. – సీహెచ్ రాజారావు, చీఫ్ ఇంజనీరు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్పోర్బే పూర్తిస్థాయి : 930 అడుగులు ప్రస్తుత నీటిమట్టం: 921 అడుగులు నీటి నిల్వలు: 0.1410 టీఎంసీలు ఇన్‌ఫ్లో: 3750 క్యూసెక్కులు -
గల్లంతైన మత్స్యకారుడు క్షేమం
● ఆదుకున్న ఉప్పాడ జాలర్లు మహారాణిపేట: పెదజాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామోలు ఎల్లాజీ ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఎల్లాజీ క్షేమంగా ఉన్నట్టు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఎల్లాజీ చేపల వేటకు వెళ్లగా.. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే 25న కాకినాడ జిల్లా, తొండంగి మండలం, హూకుంపేట సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఎల్లాజీ ఆచూకీ లభించినట్టు జాయింట్ డైరెక్టర్ వివరించారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఎల్లాజీని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు గమనించి, ఒడ్డుకు తీసుకువచ్చి ఆదరించారు. పెదజాలరిపేటకు చెందిన పెద్దలు తెడ్డు రాజు, పర్సన్న ఆదివారం ఉప్పాడ వెళ్లి.. ఎల్లాజీని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎల్లాజీ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. -
వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ ● పాడేరు చేరుకున్న బస్సు యాత్ర ● స్థానిక వైద్య కళాశాల వద్ద ఆందోళన పాడేరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేంది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ఆదివారం పాడేరు చేరుకుంది. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించింది. ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టమన్నారు. రాష్ట్రంలో గిరిజన, పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. ఆశ్రమాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు రూ.6400 కోట్లు బకాయి విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతంలోని ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా దగా చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని నీరుగార్చేందుకు తమ స్వలాభం కోసం ప్రైవేటుపరం చేయడం మానుకోవాలన్నారు. ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఫణీంద్ర, కుళస్వామి, నాగభూషణం, మస్తాన్, కృష్ణ, తనీష్, జగదీష్, శ్రీనివాసరెడ్డి, అబ్బులు పాల్గొన్నారు. -
చింతూరులోరికార్డు స్థాయి ప్రసవాలు
● ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ కోటిరెడ్డి చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈనెలలో రికార్డు స్థాయిలో వంద ప్రసవాలు జరిగినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో గైనకాలజిస్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 64, ఫిబ్రవరిలో 48, మార్చిలో 50, ఏప్రిల్‌లో 68, మేలో 48, జూన్‌లో 54, జూలైలో 50, ఆగస్టులో 92, సెప్టెంబర్‌లో 95, అక్టోబర్‌లో 100 కాన్పులు నిర్వహించినట్లు కోటిరెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగావున్న వైద్యనిపుణుల పోస్టులు భర్తీచేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో కాన్పులు నిర్వహించిన ఆస్పత్రి వైద్యులను ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య అభినందించారు. -
గిరిజన గంగపుత్రుల జల దీక్ష
● కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించాలని వినతిరావికమతం: కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి కల్పించాలని కోరుతూ గిరిజన మత్స్యకారులు ఆదివారం జలదీక్ష చేట్టారు. ధర్మవరం పంచాయతీలో కామునిగెడ్డ మినీ రిజర్వాయర్ పరిధిలో పాత ధర్మవరం, ధర్మవరం గ్రామాల్లో గధప (పీవీటీజీ) తెగకు చెందిన గిరిజనులు మినీ జలాశయంలో చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరు 2022లో శ్రీపోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘంగా ఏర్పడ్డారు. సంఘానికి మత్స్యశాఖ అధికారులు మొదటిలో చేపలు పంపిణీ చేసేవారని, తరువాత నిలిపివేశారని, దీని వలన ఉపాధి కోల్పోయి తమ జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గోరా చిరంజీవి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ ఇరిగేషన్ ట్యాంక్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా నమోదు చేయాలని ఆగస్టు 11వ తేదీన జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామని, దానిపై ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి 315.62 ఎకరాల విస్తీర్ణం ఉందని రిపోర్టు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్వోసీ ఇచ్చినా నర్సీపట్నం మత్స్యకార శాఖ ఏడీ అధికారులు స్పందించలేదని, తక్షణమే అధికారులు స్పందించి మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తిస్తే మత్స్యకార సంఘానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందుతాయని, దీనిపై నర్సీపట్నం ఫిషరీస్ ఏడీ, సంబంధిత అధికారులు తక్షణమే మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించి న్యాయం చేయాలని కోరారు. -
‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’
ముంచంగిపుట్టు: ప్రతి రోజు మెనూ అమలు కావడం లేదు.. పెడుతున్న భోజనాలు సరిగ్గా ఉడకడం లేదు..ఎక్కువగా బంగాళదుంప కూరనే వండుతున్నారు.. మెనూపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవహిస్తున్నారు.. తినలేక కొన్ని సందర్భాల్లో ఆకలితో ఉంటున్నామని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం ఆల్పాహారం సరిగ్గా ఉడకకపోవడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1 విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. మా సమస్యలు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు, గిరిజన సంఘం నేతలకు తెలియజేసి వారి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సక్రమంగా మెనూ అమలు చేయడం లేదని ఆరోపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలే వార్డెన్ కావడంతో గత్యంతరం లేక పెట్టిందే తినాలి, ఉడకకపోయినా, రుచిగా లేకపోయినా సర్ధుకుపోతూ వస్తున్నామని వాపోయారు. ఈ విషయాన్ని ఏటీడీబ్ల్యూవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. పాఠశాలలో 371 విద్యార్థినులకు 21 మరుగుదొడ్లు ఉండగా, వీటిలో 12 పూర్తిగా పాడైపోగా, ఉన్న మరుగుదొడ్లకు సక్రమంగా తలుపులు లేవని చెప్పారు. జ్వరాలు వస్తే పట్టించుకునే వారే లేరని, సమస్యలతో చదువుకుంటున్నామన్నారు. తక్షణమే తమకు మెనూ అమలు చేసి, సమస్యలు తీర్చాలని విద్యార్థినులు వాపోయారు. పర్యవేక్షణ శూన్యం ముంచంగిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1పై డిడి, ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షణ పూర్తి కొరవడిందని, మెనూ అమలు కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాంగి కార్తీక్, శ్రీను, వైస్ ఎంపీపీ సత్యనారాయణ చెప్పారు. ఉడకని అన్నం, కూరలు, సక్రమంగా అమలు కాని మెనూతో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ ఆశ్రమ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం విద్యార్థుల కోసం వండిన ఆల్పాహారం తీని నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఫోన్లో ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో జగత్రాయ్కు తెలియజేశారు. దీంతో హూటహూటిన పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు తీరుపై తెలుసుకున్నారు. మెనూ తీరుపై హెచ్ఎం, వార్డెన్ అయిన లక్ష్మీని మందలించారు. సక్రమంగా మెనూ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, గిరిజన సంఘం నేతలు గాసిరాం దొర, శ్రీను,నారాయణ, గిరిజన మహిళ సంఘం మండల కార్యదర్శి ఈశ్వరి, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మెనూ అమలు కావడం లేదు..భోజనాలు ఉడకడం లేదు ముంచంగిపుట్టు పాఠశాల ఆవరణలో గిరిజన విద్యార్థుల ఆందోళన ఉదయం అల్పాహారం బాగోలేక నిరసనకు దిగిన వైనం కానరాని మౌలిక సదుపాయాలు.. తప్పని అవస్థలు -
చికిత్స పొందుతూ శిశువు మృతి
రంపచోడవరం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రస వ సమయంలో గర్భిణి మృతి చెందిన ఘటన లో శిశువుకు కూ డా చనిపోయింది. నరసాపురం గ్రామానికి చెంది కోట బాపనమ్మ ప్రసవం కోసం 12 రోజులు ముందే స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. ఆమెకు 19వ తేదీన ప్రసవం చేయడంతో శిశువుకు జన్మనిచ్చింది. తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. అయితే ప్రసవం జరిగిన రోజే శిశువును మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. శిశువు మూడు రోజులు చికిత్స తరువాత గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
నిలిపివేశారు. బంద్ అనంతరం పునరుద్ధరిస్తామని వారు పేర్కొన్నారు. చింతూరు: సబ్ డివిజన్ పోలీసులు గురువారం ఎస్ఐ పేరూరి రమేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల పూర్తి వివరాలు సేకరించి పంపించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ముందస్తుగా చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం జంక్షన్ మీదుగా, భద్రాచలం వైపు నుంచి చింతూరు వైపు వచ్చే వాహనాలను నెల్లిపాక మీదుగా దారి మళ్లించారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన యంత్రాలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ రామకృష్ణ వాహన తనిఖీలు చేపట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, డుడుమ మార్గాల్లో వచ్చే వాహనదారుల బ్యాగులు,లాగేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. వాహనాలకు రికార్డులు, లైసెన్సులు లేకపోవడంతో ఫైన్ విధించారు.సీఆర్పీఎఫ్ బలగాలు మండల కేంద్రంలో ప్రత్యేక గస్తీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మావోయిస్టులు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, మారుమూల పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాత్రి పూట పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తామని, ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన కోరారు. జి.మాడుగుల: పాడేరు–జి.మాడుగుల రోడ్డు మార్గంలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో వాహనాలను గురువారం సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలి పెట్టారు. రికార్డుల లేని వాహనాలుపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే తక్షణమే పోలీసులు సమాచారం అందించాలని వారు కోరారు. కొయ్యూరు:స్టేషన్ సమీపంలో సీఐ శ్రీనివాస్ ఆద్వర్యంలో కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్ వర్మ, శంకర రావు వాహన తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు. అడ్డతీగల: మండలంలోని వేటమామిడి జంక్షన్లో సీఐ బి.నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేశారు.ప్రధాన కూడళ్లలో నిఘా ఏర్పాటు చేశారు. మోతుగూడెం: స్థానిక ఎస్ఐ సాధిక్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది చెక్‌పోస్టు వద్ద వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
● తల్లి మృతితో మనస్తాపానికి గురై ఉరివేసుకున్న వైనం ● ధారకొండలో విషాదఛాయలు సీలేరు: గూడెంకొత్తవీధి మండలం ధారకొండ గ్రామానికి చెందిన కాలం కున్నత్ సునీల్ కుమారుడు నిఖిల్ (17) విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ తన భార్య, కుమారుడితో కలిసి కంచరపాలెంలో నివాసముంటున్నాడు. సునీల్ నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తుండగా, అతని భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు. వీరి కుమారుడు నిఖిల్ మధురవాడలోని పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సునీల్ భార్య మే నెలలో గుండెపోటుతో మృతి చెందడంతో నాటి నుంచి కుమారుడు నిఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. అందరితో ముభావంగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. నిఖిల్ దాచుకున్న సొమ్ముతో తన తల్లి బతికున్నప్పుడు ఓ చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడు. తల్లి మృతితో నిఖిల్ మనస్తాపం చెంది గురువారం తండ్రి లేని సమయంలో తన తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన చీరతో, చేతిలో తల్లి ఫొటోతో కప్బోర్డు డోర్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. నిఖిల్ మరణవార్తతో ధారకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విద్యా ప్రమాణాలు మరింత మెరుగుకు కృషి
గంగవరం : విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యాప్రమాణాలు మరింత మెరుగుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. శుక్రవారం ఆయన ఉదయం 8.45 నిమిషాలకు స్థానిక ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అసెంబ్లీలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయు హాజరును ఆయన పరిశీలించారు. అనంతరం టీఏఆర్‌ఎల్ అమలుపై ఆరా తీశారు. ఎఫ్ఏ 2 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన పుస్తకాలను తనిఖీ చేశారు. 1, 2, 3 , 4 తరగతుల విద్యార్థుల వర్క్ బుక్‌లను పరిశీలించారు. అక్టోబర్ నెలకు సంబంధించి ఖాళీలు ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాఠశాల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సెలవులో ఉన్న హెచ్ఎంను ఫోన్లో ఆదేశించారు. ఇన్చార్జి ఉపాధ్యాయుడు కె. కృష్ణ, సహోపాధ్యాయులు కె. బాపనమ్మ, కె. లావణ్య, సీఆర్పీ భాస్కర్, ఎంఐఎస్ కోర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు -
నేడు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిషేధం
● పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ పాడేరు : మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం పాడేరు డివిజన్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, ఇతరాత్ర ఆందోళన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేదని పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే పోలీసులనుంచి ముందస్తు అనుమతి పొంది 100 మందికి మించకుండా నిర్వహించాలన్నారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువ మందితో ఆందోళన కార్యక్రమాలు చేసి శాంతిభద్రతలు, ప్రజా భద్రతలకు, ప్రజా రవాణాకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సుగంధ ద్రవ్య పంటలతో అధిక ఆదాయం
చింతపల్లి: సుగంధ ద్రవ్య పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. గురువారం స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానంలో జాతీయ సుగంధ ద్రవ్య పంటల బోర్డు సౌజన్యంతో రైతులకు పసుపు, అల్లం, పిప్పలు, మిరియం, చింతపండు పంట ఉత్పత్తుల నాణ్యతపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఏడీఆర్ పసుపుసాగులో మెలకువలు, సస్యరక్షణ, పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులు వివరించారు. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, అనువైన రకాల ఎంపిక, సస్యరక్షణ, కలుపు నివారణ అంశాలను ఉద్యానవన శాస్త్రవేత్త శెట్టి బిందు వివరించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి సేంద్రియ ధ్రువపత్రం పొందే విధానం, రాయితీపై స్పైసెస్ బోర్డు అందించే ప్రోత్సాహకాల వివరాలను రైతులకు తెలియజేశారు. -
మలేరియా ప్రబలకుండా పటిష్ట చర్యలు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా మలేరియా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక జిల్లా మలేరియా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి తులసితో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో నమోదైన మలేరియా కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అధికంగా పాడేరు డివిజన్లో మూడు పీహెచ్‌సీల్లో, రంపచోడవరం డివిజన్ పరిధిలోని పీహెచ్‌సీల్లో తొమ్మిది, చింతూరు డివిజన్ పరిధిలో ఆరు పీహెచ్సీలో పరిధిలో మలేరియా తీవ్రత ఉందన్నారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో మలేరియా రోగులకు అందించిన చికిత్సలు, ప్రబలకుండా తీసుకున్న జాగ్రత్తలను ఆయన తెలుసుకున్నారు. మలేరియా సిబ్బందితో పాటు ఫీల్డ్ విజిట్‌కు వెళ్తున్న వైద్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో మలేరియాపై పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో మలేరియా సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు డుంబ్రిగుడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుఖ ప్రసవాలు ఎక్కువగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహరంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రసవ నిరీక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన గర్భిణులతో మాట్లాడారు. అనంతరం సిబ్బంది నుంచి మలేరియా కేసుల వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌లో మందులు, వ్యాక్సిన్లు పరిశీలించారు. పీహెచ్సీ పరిశుభ్రంగా ఉన్నందున సిబ్బందిని అభినందించారు.డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ -
జెండాలు పాతిన పొలాలు రైతులకు అప్పగింత
ఎటపాక: గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిన సాగు భూములను గిరిజనేతర రైతులకు అధికారులు గురువారం అప్పగించారు. నందిగామ, మూరుమూరు గ్రామాల పరిధిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునుకు గురవుతున్న సాగు భూములకు గిరిజనేతర రైతులు నష్ట పరిహారం పొందారు. అయితే సదరు రైతులు స్థానికంగా నివాసం లేకుండా అట్టి భూములు కౌలుకు ఇస్తున్నారని ఆ భూములు గిరిజనులకే చెందాలంటూ ఇటీవల గిరిజనులు జెండాలు పాతడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా గుర్తించి పూర్తి పరిహారం ఇచ్చి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించేవరకు తమ ముంపు భూములు తామే సాగుచేసుకుంటామని గిరిజనేతర రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో గిరిజనేతర రైతులు వారి భూములకు వారే హక్కుదారులని సబ్‌కలెక్టర్ ఆదేశాలు కూడా జారీచేశారు. ఈక్రమంలో గురువారం రైతులు వారి భూముల్లో దుక్కులు చేసుకుంటుండగా జెండాలు పాతిన గిరిజనులు అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఈసమాచారం తెలుసుకున్న తహసీల్దార్ కారం సుబ్బారావు,సీఐ కన్నపరాజు మురుమూరు,నందిగామ గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ముంపు భూముల్లో జెండాలు ఏర్పాటు చేయడం సరికాదని అట్టి భూములు హక్కుదారులే సాగుచేసుకుంటారని చెప్పారు. కాగా పరిహారం పొందిన భూముల్లో సదరు రైతులే సాగు చేసుకోవాలని, ఎవరికై నా కౌలుకు ఇస్తే రైతులపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేస్తామని గిరిజనేతర రైతులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించి ముంపు భూములను రైతులకు అప్పగించామని తహసీల్దార్ తెలిపారు. -
జెడ్పీటీసీ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
● రిమాండ్‌కు తరలింపు ● మిగిలిన నిందితుల గురించి విచారణ ● విలేకరుల సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి రోలుగుంట : కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలివి. కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గల చటర్జీపురంలో 139 సర్వే నెనంబర్లో 10.83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తుప్పలు తొలగించి, సదరు భూమిని పరిశీలించడానికి కూలీలతో కలసి ఈ నెల 20వ తేదీన జెడ్పీటీసీ అక్కడకు వెళ్లారు. ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కొన్ని కుటుంబాలతో జెడ్పీటీసీ నూకరాజుకు చిరకాల వైరం ఉంది. నూకరాజు వస్తున్న సమాచారం తెలుసుకొని, అతనితో విరోధం ఉన్న కేదారి రాజబాబు, అతని బంధువులు కాచుకొని ఉన్నారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు పథకం ప్రకారం కత్తులు, కర్రలతో నూకరాజు, అతని అనుచరులపై దాడి చేశారు. మిగిలిన వారు భయభ్రాంతులకు గురై పారిపోగా, నూకరాజును చుట్టుముట్టి కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జెడ్పీటీసీ నూకరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఇతనితో ఉన్న మాస లోవరాజుపైనా ప్రత్యర్థులు దాడి చేయగా అతని చేతికి గాయమైంది. సమాచారం తెలుసుకున్న వెంటనే కొత్తకోట సీఐ కోటేశ్వరరావు రోలుగుంట పోలీసులతో నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించిన నిందితులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను ఈ నెల 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొత్తకోట సీఐ కోటేశ్వర్రావు, రోలుగుంట ఎస్ఐ సిబ్బందితో వెళ్లి -
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
అడ్డతీగల: ప్రాచీన సంస్కృత భాషను నేటి తరాలకు అందించవలసి ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు.అడ్డతీగల మండలం వెదురునగరంలోని విశ్వహిందూ పరిషత్ ఒరియెంటల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంస్కృత భాష ప్రదర్శనను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమయ్యే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. భాష ప్రదర్శనకు కృషిచేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ తిరుపతి, గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, ఎంఈవోలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడాలి
● పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ● బంగారుమెట్ట ఆశ్రమ పాఠశాల, కించాయిపుట్టు అంగన్వాడీ కేంద్రం తనిఖీ ముంచంగిపుట్టు : ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, మెరుగుపడాలని బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. ముంచంగిపుట్టు మండలంలో గురువారం ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన చేశారు. కించాయిపుట్టు పంచాయతీ కేంద్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కేంద్రం మూసి ఉండడంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ ఇంటిలో కేంద్రం నిర్వహణ చేస్తూ ఉండడం, అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉండడంతో గ్రామంలో నిరుపయోగంలో పాఠశాల భవనానికి మరమ్మతులు చేసి అంగన్వాడీ నిర్వహణ జరపాలని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలకు నిర్వహించిన పరీక్ష పేపర్లను ఆమె పరిశీలించారు. పేపర్లు సరిగా ఉపాధ్యాయులు దిద్దక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీవో సూచించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. పెదబయలు : వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయపాలన పాటించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. గురువారం పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వను పరిశీలించి, ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని, వైద్య సిబ్బంది అకింతభావంతో పని చేయాలని, రోగులు ఉండే వార్డులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం అరడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల రికార్డులు పరిశీలించారు. -
ఊళ్లకు నీళ్లేవి?
గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరుఅందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలజీవన్ మిషన్ పనుల ఆశయానికి కూటమి ప్రభుత్వం గండి కొడుతోంది. జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.జలజీవన్ మిషన్‌కు ‘కూటమి’ గ్రహణంసాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి జల్‌జీవన్ మిషన్ తాగునీటి పథకాల పనులకు గండం ఏర్పడింది. ఈ పథకానికి సంబంధించి టెండర్ల ద్వారా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా పనులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో గిరిజనులకు తాగునీటి వెతలు తప్పడం లేదు. గడచిన వేసవిలోను తాగునీటి పథకాల పనులు పూర్తికాక గిరిజనులంతా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● జిల్లావ్యాప్తంగా 421 తాగునీటి పథకాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జల్‌జీవన్ మిషన్‌లో కాంట్రాక్టర్లంతా ఈ పనులను రెండేళ్ల నుంచి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు చెల్లించకపోవడంతో పనులన్నింటిని కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, బోరుబావి పనులు పూర్తిగా జరగకపోవడంతో జల్‌జీవన్ మిషన్ పనులన్నీ అలంకారప్రాయంగా మారాయి. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 421 తాగునీటి పథకాల పనులకు సంబంధించి రూ.21,06, 80,307లు వారికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ● జల్‌జీవన్ మిషన్ పథకంలో చేపట్టిన పనులకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్లర్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన కాంట్రాక్టర్లంతా కూటమి ప్రభుత్వ మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తో విజయవాడలో ధర్నా చేస్తున్నారు.తాగునీటికి ఇబ్బందులుపడుతున్నాం పాతపాడేరులో జల్‌జీవన్ మిషన్ పనులు సగం వరకు మాత్రమే జరిగాయి. బిల్లులు ఇవ్వలేదని చెబుతూ పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేసినా తాగునీటి సరఫరా వ్యవస్థ పనులు జరగక నిరుపయోగంగా మారాయి. దీనివల్ల తాగునీటి సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నాం. – సల్లా భీమలింగం, పాత పాడేరు గ్రామాల్లో నిలిచిన నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం 421 పనులకు రూ.21 కోట్లు పెండింగ్ పథకాల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిన వైనం అలంకారప్రాయంగా కుళాయిలు -
సిగనాపల్లి క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు
● ముగ్గురి అరెస్టు ● పెదవలస రేంజ్ అధికారి ప్రశాంతి కుమారి వెల్లడి చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పెదవలస ఇన్చార్జ్ రేంజ్ అధికారి కె.ప్రశాంతికుమారి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాల నిరోధానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సిబ్బందితో బేస్ క్యాంపులు,స్ట్రైకింగ్ ఫోర్సుతో గస్తీ చేపట్టామన్నారు. క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉందన్నారు. తాజాగా ఈ క్వారీలో తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని మూసివేశామన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తపాలెం గ్రామానికి చెందిన గెమ్మిలి చిట్టిబాబు, ధారకొండకు చెందిన భీమవరపు గణేష్, బూదరాళ్లకు చెందిన ఉప్పల బాలాజీరావు తవ్వకాలు జరుపుతుండగా తమ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. సెక్షన్ అదికారి నూకరాజు, ఎఫ్‌బీవో గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఏవోబీలో పోలీసుల అప్రమత్తం
● నేడు మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు ● గాలింపు చర్యల్లో బలగాలు సాక్షి,పాడేరు: వరుస ఎన్కౌంటర్లు, పోలీసు నిర్బంధానికి నిరసనగా మావోయిస్టు పార్టీ ఈనెల 24వ తేదీ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో వారి నుంచి ఒక్కసారిగా బంద్ ప్రకటించడంతో తనిఖీలు ముమ్మరం చేశాయి. ● ఏవోబీతోపాటు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లతో పాటు మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని వాహనాలను పోలీసు బలగాలు తనిఖీ చేశాయి.అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగులను సోదా చేయడంతో పాటు వారి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. ● మావోయిస్టులు తలపెట్టిన భారత్ బంద్‌ను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏవోబీ వ్యాప్తంగా పోలీసు బలగాలు గాలింపు చేపడుతుండగా, అటువైపు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టేషన్లు, కొత్తవలస–కిరండూల్ లైన్‌లోని అన్ని రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్లతో నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాత్రి పూట అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేత సీలేరు: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఎస్ఐ యాసిన్ ఏరియా డామినేషన్, వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఎటువంటి సాయం చేయవద్దని ఎస్ఐ సూచించారు. బంద్ ప్రకటన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ధారాలమ్మ తల్లి ఘాట్ రోడ్, సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే రాత్రిపూట బస్సు సర్వీసులను ముందు రోజు నుంచి అధికారులు నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి సీలేరు నైట్ హాల్ట్ బస్సు, విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నైట్ సర్వీసు, రాజమండ్రి నుంచి సీలేరు వచ్చే నైట్ బస్సును ఆర్టీసీ అధికారులు మావోయిస్టుల భారత్‌బంద్‌తో జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రత ఏర్పాటుచేశామని ఎస్పీ అమిత్‌బర్దర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రవేశద్వారాలు, ముఖ్యమైన చోట వాహనాల తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.మావోయిస్టుల బంద్‌తో ప్రజలు భయపడవద్దని, రోజువారి పనులు సాధారణంగా చేసుకోవాలన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. తనిఖీల సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అలాగే పోలీసులకు ప్రజలు తోడుగా ఉండి, శాంతిని కాపాడాలని, అత్యవసర పరిస్థితుల్లో112కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.గట్టి భద్రత: ఎస్పీ అమిత్ బర్దర్ -
ప్రజా సమస్యలపై శాంతియుత ఉద్యమాలు
పాడేరు : వైఎస్సార్సీపీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు చేస్తోందని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజాధనంతో నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉన్నత వైద్యానికి, వైద్య విద్యకు దూరంగా ఉన్న ఆదివాసీలకు ఓ వరంలా గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రూ.500కోట్లతో వైద్య కళాశాల తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో పది చోట్ల వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గత 16 నెలలుగా తమ పార్టీ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతోందన్నారు. వీటిని రాష్ట్ర గవర్నర్‌కు అందజేసి ప్రజల ఆకాంక్షను వివరిస్తామని చెప్పారు. దేవాలయాలాంటి వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఎన్ని ఉద్యమాలు చేపట్టి అయినా అడ్డుకుని తీరుతామన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు కిముడు శివరత్నం, శెట్టి రోషిణి, వైఎస్సార్సీపీ మహిళ విభాగం జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, పాంగి పరశురాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి రాంబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా సుబ్రమణ్యం, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, ఎస్టీ సెల్ జిల్లా మాజీ అద్యక్షుడు కమ్మిడి అశోక్, యువజన విభాగం నాయకులు రేగం చాణక్య, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, వనుగు బసవన్నదొర, గొల్లోరి నీలకంఠం, ఎంపీటీసీ దూసూరి సన్యాసిరావు, మాజీ సర్పంచ్‌లు పాంగి నాగరాజు, మినుముల కన్నాపాత్రుడు, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గల్లెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై 28న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రజల తరఫున నిలబడేది వైఎస్సార్సీపీ మాత్రమే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ -
18 గ్రామాల్లో జనగణన ప్రీ టెస్టింగ్
డీఆర్వో పద్మలతసాక్షి,పాడేరు: 2027లో నిర్వహించనున్న జనగణనకు సంబంధించి జిల్లాలో జి.కె.వీధి మండలంలో 6 పంచాయతీల్లోని 18 గ్రామాల్లో ప్రీ టెస్టింగ్ నిర్వహిస్తున్నామని డీఆర్వో కె.పద్మలత తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా శిక్షణ ఇచ్చారు. జనాభా లెక్కల విభాగం సమన్వయకర్త ప్రసన్నకుమార్, మరో ముగ్గురు అధికారులు కలిసి సమగ్ర శిక్షణ అమలుజేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ రెండు దశల్లో జనగణన జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా తొలుత సేకరించిన సమాచారాన్ని సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టంలో పొందుపరుస్తామన్నారు. ప్రతి 250 నుంచి 800 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ద్వారా జనగణన జరుగుతుందన్నారు. మండల రెవెన్యూ అధికారి చార్జి అధికారిగా కీలకపాత్ర వహిస్తారన్నారు. ప్రిన్సిపల్ సెన్సెస్ అఽధికారి నోడల్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జనగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్, జి.కె.వీధి, పాడేరు రెవెన్యూ అధికారు లు, సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వీడియో సమావేశం నిర్వహిస్తున్నడీఆర్వో పద్మలత, ఇతర అధికారులు -
హుండీ ఆదాయం లెక్కింపు
సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ ధారాలమ్మ ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఎండోమెంట్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, స్థానికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, నగదు రూ.7,40,192 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రత్యేక అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దులోఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఎటపాక: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్ఐ అప్పలరాజు బుధవారం రాత్రి పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి ట్రాక్టర్లలో సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.విదేశీయుల సందడి ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీయలు సందడి చేశారు. ఆస్ట్రేలియా, దక్షణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన 40మంది మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి,నిర్వహణను తెలుసుకున్నారు. వించ్ హౌస్‌లో ప్రయాణించి, వింత అనుభూతి పొందారు. ఒనకఢిల్లీ వారపు సంతకు బోండా, గదబ గిరిజనుల వేషధారణ, సంస్కృతి,సంప్రదాయ వివరాలను తెలుసుకున్నారు. వారు అమ్మే పూసలు,రింగులు కొనుగోలు చేయడమే కాకుండా వారితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు. -
గిరిజనులకు మెరుగైన వైద్యం దూరం
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదని వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన కోటం బాపనమ్మ వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. గురువారం ఆమె నరసాపురం గ్రామంలో గురువారం మృతురాలు భర్త, వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటం రాజన్నదొర ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతున్న బిడ్డ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్‌ఎంపీపీ పండా కుమారి, సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, నేతలు పండా నాగన్నదొర, బొబ్బా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి కోటం బాపనమ్మ మృతి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన బాధిత కుటుంబానికి పరామర్శ -
పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో సంతకాల సేకరణ ● గిరిజనుల విశేష స్పందన అరకులోయటౌన్: కూటమి ప్రభుత్వం పేద గిరిజన ప్రజలపై చేస్తున్న కుట్రలను ఆపాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో వైఎస్సార్సీపీ రచ్చబండ ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. పేద గిరిజన ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో పేద ప్రజలకు సంపూర్ణ విద్య, వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి, నిర్మాణా పనులు చేపడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో వాటిని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రయివేటు పరం చేసి, కార్పోరేట్ కంపెనీలకు అప్పగించడం సరికాదని, ఈ విధంగా చేయడంతో పేదలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు గిరిజనులంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. భీముడువలస పాఠశాలలో తనిఖీ మండలంలోని పద్మాపురం పంచాయతీ భీముడువలస పాఠశాలను అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. దీనిపై గైర్హాజరైన ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని ఈ మేరకు ఒక రోజు జీతం నిలిపివేసి, మెమో జారీ చేయాలని ఎంఈఓ త్రినాథరావుకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సూచించారు. పాంగి సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే మండలంలోని స్పోర్ట్స్ స్యూల్లో 9వ తరగతి చుదువుతున్న విద్యార్థి పాంగి సుశాంత్ (14)పై అగంతకుడు బ్లేడుతో గొంతు కొసి పరారైన సంఘటనలో అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. శాంతిభద్రతలను కూటమి ప్రభుత్వం కాపాడాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, సర్పంచ్ పెట్టెలి సుశ్మిత, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, పార్టీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్లాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్చక్షుడు కమిడి అశోక్, మండల కార్యదర్శి కొర్రా అర్జున్, నాయకులు పెట్టెలి సుక్రయ్య, జన్ని అర్జున్, మాదల రామకృష్ణ, కిల్లో బాలరాజు, జన్ని సన్యాశి, వెంకటరావు, రఘునాథ్, పాంగి నాగేశ్వరరావు, కామేష్, స్వాభి రామూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ పనసపుట్టు, అరమ పంచాయతీ ముసిరి గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలప్రై వేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాంగి పశురామ్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు. వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, అరమ ఎంపీటీసీ సభ్యురాలు డి.పద్మ, పోతంగి సర్పంచ్ వెంకటరావు, మాజీ జడ్పీటీసీ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ రాందాసు, మండల కార్యదర్శి మఠం శంకర్, నాయకులు తూమ్నాఽథ్, దశమి, బాబిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగుల: మండలంలో పెద్దలువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం సర్పంచ్ కొండపల్లి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకుడు బెదరా బంగార్రాజు, మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలతో కూడిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు తీరని వేదన
స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిస్థితులు నిర్వాసితులకు తీరని వేదనను మిగిల్చాయి. ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు ఇచ్చినవారిని ఇప్పుడు నిర్వాసితులు కాదనే కొత్తవాదనను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు తెచ్చారు. కేవలం ఆర్ కార్డు ఉన్నవారు మాత్రమే నిర్వాసితులని, వారి వారసులు నిర్వాసితులు కాదని పేర్కొనడంతో నిర్వాసితులను పని నుంచి తొలగించడం సులువైపోయిందని కంపెనీవర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం ఎంప్లాయిమెంట్ ద్వారా విధుల్లో చేరిన 250 మందిని మాత్రమే నిర్వాసితులుగా పరిగణించి మిగిలిన వారిని విధుల నుంచి తొలగించారని కార్మికులు చెబుతున్నారు. -
కూటమివి ‘గ్యాస్’ కబుర్లే
మహారాణిపేట(విశాఖ): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల’పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మూడో విడత చెల్లింపుల్లో లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. సిలిండర్ డెలివరీ తీసుకుని రోజులు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ కాకపోవడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ కోసం ఎదురుచూపు విశాఖ జిల్లా గణాంకాలే ఈ పథకం అమలులో ని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నా యి. మూడో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,46,110 మంది లబ్ధిదారులు సిలిండర్లను డెలివరీ తీసుకున్నారు. అయితే, వీరిలో కేవలం 87 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు రాయితీ సొమ్ము రూ.8.35 కోట్లు వారి ఖాతాలకు జమ అయ్యింది. అంటే సుమారు 2.59 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆగస్టులో ప్రారంభమైన మూడో విడత బుకింగ్‌లు నవంబర్ 30తో ముగియనున్నాయి. అక్టోబర్ చివరి వారం నడుస్తున్నా.. ఇంత భారీ సంఖ్యలో చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు సివిల్ సప్లైస్ డీఎస్వో, ఏఎస్వో కార్యాలయాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ (1800– 2333–555) కూడా ఏమాత్రం ఉపయోగపడటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీపై నీళ్లు చల్లిన నిబంధనలు ఎన్నికల ముందు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మెలికలు పెడుతోందని మహిళలు ధ్వజమెత్తుతున్నారు. తెలుపు రేషన్ కార్డు (రైస్ కార్డు) పనిచేస్తేనే ఉచిత గ్యాస్ అని నిబంధన పెట్టడం వల్ల మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈకేవైసీ, ఆధార్–బ్యాంకు ఖాతా అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో చాలా మందికి రాయితీ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. ఎన్ని కల ముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం మోసమేనని వారు మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన ఏది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుందని డీఎస్వో వి.భాస్కర్ చెబుతున్నారు. కానీ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సిలిండర్లు తీసుకున్నవారికి కూడా అక్టోబర్ చివరి నాటికి డబ్బులు పడలేదు. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. -
మరో 1200 మంది తొలగింపునకు చర్యలు?
స్టీల్‌ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో 13,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసేవారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ముందుకు రావడంతో దఫదఫాలుగా తొలగిస్తున్నారు. ఉక్కులో మొదటిసారి 1,503 మందిని తొలగించిన యాజమాన్యం రెండోసారి 1,600 మందిని తొలగించింది. అప్పుడప్పుడు పది మంది.. ఇరవై మంది చొప్పున సుమారు 550 మందిని ఇంటికి పంపించేసింది. తాజాగా దీపావళి రోజు మరో 500 మందిని తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మరో 1,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తారని తెలుస్తోంది. వీరుగాక టెండర్లు పూర్తవడంతో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు పనికోల్పోయారు. టెండరు పూర్తయిన కాంట్రాక్టర్‌కు రీ టెండర్ ఇవ్వకపోవడంతో వారి వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. -
సింహగిరిపై విశేషంగాశ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం విశేషంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. అర్చకుడు చక్రపాణి ప్రధాన కలశాన్ని శిరసుపై పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఆ జలాలను స్వామికి సమర్పించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఉక్కిరిబిక్కిరి
ఉక్కులో కాంట్రాక్టు కార్మికులతాజాగా 500 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు మొత్తంగా ఉపాధి కోల్పోయిన 5 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని ఉక్కు యాజమాన్యం కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం గాజువాక : విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ఉక్కు యాజమాన్యం ఇంటికి పంపించేస్తోంది. తాజాగా తొలగించిన 500 మందితో సహా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. మరో 1200 మంది కాంట్రాక్టు కార్మికుల మెడలో కత్తి వేలాడుతూనే ఉంది. ఈ విషయంలో నిర్వాసితులకు మరింత అన్యాయం జరుగుతోంది. ఇంతమంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇక్కడ కార్మికులు అవసరానికి మించి ఉన్నారంటూ సాక్ష్యాత్తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేస్తుండటంతో యాజమాన్య చర్యలకు అడ్డులేకుండా పోయింది. నిర్వాసిత కార్మికులను తొలగించవద్దంటూ స్వయానా కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని యాజమాన్యం కనీసం పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. కార్మికుల కొరత కార్మికులను ఎడాపెడా తొలగించడంతో చాలా విభాగాల్లో కార్మికుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్ఎంహెచ్పీ విభాగం పై భాగంలో గల కన్వేయర్ల నుంచి మెటీరియల్ కింద పడిపోతోంది. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే జామ్ అయిపోతుంది. అక్కడ కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో ఇటీవల జామ్ అయిన సంఘటనలు తలెత్తాయి. దీంతో వీఆర్ఎస్ పెట్టిన పర్మినెంట్ కార్మికులకు అక్కడ డ్యూటీ వేశారు. ఇదిలా ఉండగా, ప్లాంట్‌లో అత్యవసర విభాగాలు కొన్ని ఉన్నాయి. అక్కడ విధులకు కాంట్రాక్టు కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే గేటు పాసులు మూడు, ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇప్పుడు వైట్పాసులు ఇస్తున్నారు. వాటిని ఐదు రోజులు, పది రోజుల వ్యాలిడిటీ పొడిగిస్తున్నారు. దీంతో వారిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు పేర్కొంటున్నారు. భారీగా తగ్గిన పర్మినెంట్ ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చాక పర్మినెంట్ ఉద్యోగులు కూడా భారీగా తగ్గిపోయారు. ప్లాంట్‌లో 12 వేల మందికి పైగా గల ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 9,800 మందికి పడిపోయింది. మొదటిసారి వీఆర్ఎస్ కింద 1,126 మందిని, తాజాగా అమలు చేసిన వీఆర్ఎస్ కింద మరో 464 మందిని పంపించేసింది. ఇదికాక గత ఏడాది కాలంలో 2,300 మంది పదవీ విరమణ పొందారు. రానున్న ఏడాది మరో 1,000 మంది పదవీ విరమణ పొందనున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన యువ కార్మికుల్లో సుమారు 300 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కార్మికులు చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, ప్రజాప్రతినిధులు గాని కనీసం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 500 మంది చిరు కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్య చర్యలతో ప్లాంట్‌లో పని చేస్తున్న చిన్నా, చితకా కలిపి మరో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్టీల్‌ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్యాంటీన్లను యాజమాన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా క్యాంటీన్లలో పనిచేస్తున్న కార్మికులు పని కోల్పోయారు. -
నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసుల విచారణ వేగవంతం చేయాలి
పాడేరు రూరల్: నకిలీ కులధ్రువీకరణ పత్రాల జారీ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర డిమాండ్ చేశారు. మండలంలో తామరపల్లిలో మజ్జి కృష్ణారావు, ఆయన కుటుంబ సభ్యులు నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందారన్న ఫిర్యాదుపై బుధవారం ఆర్ఐ జోగరావు, వీఆర్వో నూకరత్నం విచారణ జరిపారు. ఆ నేపథ్యంలో రామారావు దొర ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆదివాసీల రిజర్వేషన్ల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. గతంలో మజ్జి కృష్ణారావు కుమార్తె మజ్జి మేఘమాల తామరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చచ్చేడి కులం (ఎస్సీ)గా రికార్డులో నమోదు అయిందన్నారు. ఇదే కుటుంబం 2019–2021లో ఎస్టీ కొండదొర కులం పేరుతో ధ్రువీకరణ పత్రాలు పొందారని చెప్పారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలతోనే నకిలీకుల ధ్రువీకరణ పత్రాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అదే గ్రామంలో నివాసముంటున్న బయ్యావరపు శ్రీనివాసరావు నాయీబ్రాహ్మణుడు(బీసీ)అయినా నకిలీ ఎస్టీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ నకిలీ ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేయాలని, పత్రాలు జారీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌యూ నాయకులు మాధవరావు, కిషోర్, పీసా కార్యదర్శి ప్రకాష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర


