రోడ్డు ప్రమాదంలో మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మృతి

Feb 18 2026 7:10 AM | Updated on Feb 20 2026 12:34 PM

-

రోడ్డు ప్రమాదంలో

ముగ్గురు యువకులు మృతి

మృత్యుపాశమైన మలుపు

కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారనగా ఘటన

మూడు కుటుంబాల్లో ఆగని రోదన

మహాశివరాత్రి పర్వదినం.. ఆ కొండకోనల్లో శివనామస్మరణ మారుమోగుతున్న వేళ, ముగ్గురు గిరిజన యువకులు భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. మరో కొద్దిసేపట్లో ఇళ్లకు చేరి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారనగా.. కాలం కాటు వేసింది. బైక్‌ ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. పది రోజుల క్రితమే తండ్రి అయిన రమేష్‌, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకై న సూర్యప్రకాష్‌, ఉన్నత చదువుల ఆశలతో ఉన్న పౌలు.. ఇలా ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ పసికందు ఏడుపు, తల్లిదండ్రుల రోదనలు చూస్తుంటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతోంది. 
 

సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడి పడి ఉన్న యువకులు

సాక్షి, పాడేరు: మహాశివరాత్రి పర్వదినం వేళ మత్స్యగుండం పుణ్యక్షేత్రంలో భక్తిశ్రద్ధలతో గడిపిన ఆ యువకులు.. మరో కొద్దిసేపట్లో ఇళ్లకు చేరుకుంటారనగా విధి వంచించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర బైక్‌ ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రమాదం జరిగిందిలా..

మత్స్యగుండం నుంచి పాడేరు వెళ్లే ప్రధాన రహదారిపై గుత్తులపుట్టు సంతబయలు ప్రాంతంలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వీరి బైక్‌ వేగంగా వెళ్లి ప్రహరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న గెమ్మెలి రమేష్‌ (25), వెనుక కూర్చున్న రేగం సూర్యప్రకాష్‌ (28), సీదరి పౌలు (20) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సూర్యప్రకాష్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గెమ్మెలి రమేష్‌ 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

నెల రోజుల క్రితమే

తండ్రి అయ్యాడు..

వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్‌ మృతి ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. అతనికి ఏడాది క్రితం వివాహమైంది.నెలరోజుల క్రితం భార్య జ్యోతి మగశిశువుకు జన్మనిచ్చింది. పసికందుతో ఉన్న భార్య, తన భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది.

ఉన్నత చదువుల ఆశలు ఆవిరి!

గొందిరాపకు చెందిన సూర్యప్రకాష్‌ తల్లిదండ్రులకు తనే సర్వస్వం. మోదమాంబ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతను, బాగా చదువుకుని తమ కష్టాలు తీరుస్తాడని ఆశపడిన తల్లిదండ్రులు రేగం పొట్టన్న, పెద్దమ్మలు ఇప్పుడు పుత్రశోకంతో కుమిలిపోతున్నారు.

ఇంటర్‌లోనే అనంతలోకాలకు..

మదర్‌ థెరిసా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సీదరి పౌలు అకాల మరణం ముల్లుమెట్ట గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. దైవ సేవకుడైన తండ్రి సీదరి రాజారావు తన కుమారుడి మృతదేహం వద్ద రోదించడం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.

మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. బంధువుల ఆర్తనాదాల మధ్య గిరిజన సంప్రదాయ ప్రకారం ముగ్గురు యువకులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా అందరినీ కలచివేసింది.

యువకుల మృతదేహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement