కాఫీ సాగుతో గిరిజనరైతులకు సుస్థిర ఆదాయం
గూడెంకొత్తవీధి: అల్లూరి జిల్లాలోని కాఫీ, మిరియాల వల్ల గిరిజన రైతులు సుస్థిర ఆదాయాన్ని పొందుతున్నారని ఇతర పంటల సాగుపైనా రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలుంటాయని తెలంగాణాకు చెందిన ప్రతినిధులు బృందం అభిప్రాయపడింది. 2024లో మిసెస్ ఇండియా అవార్డు పొందిన ముమ్ముడి సుష్మ ప్రస్తుతం తెలంగాణ రాష్త్ర బయోడైవర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందం శనివారం గూడెంకొత్తవీధి మండలంలో పర్యటించింది. ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానంలోని కాఫీ, మిరియాల తోటలను వీరు సందర్శించారు. ఇక్కడ కాఫీపై జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆఫీసర్ ఇన్‌చార్జి సునీల్‌బాబు ప్రతినిధి బృందం సభ్యులు అనిల్‌కుమార్, ప్రమోద, మురళి, ప్రశాంత్, సంజయ్, మణి, సుజాత, కాఫీబోర్డు జేఎల్‌ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


