తెలుగు సంస్కృతికి విదేశీయులు ఫిదా
పెందుర్తి: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా స్థానిక సంకల్ప కళాగ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కార్యశాల శనివారంతో ముగిసింది. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్‌నెస్ అసోసియేషన్ ఈస్ట్రన్ రీజియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ చేతివృత్తుల కళలు, పురాతన పద్ధతులను 50 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించారు. సహజ రంగులతో తయారయ్యే చేనేత వస్త్రాలు, లక్క బొమ్మల తయారీ, ఎద్దులతో నడిచే కట్టె గానుగ ద్వారా నూనె తీసే విధానం వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పప్పు దినుసులను రోళ్లు, రోకళ్లతో దంచడం, తిరగలితో విసిరే విధానాన్ని చూసి అబ్బురపోయారు. ఈ క్రమంలో పలువురు విదేశీ వనితలు స్వయంగా రోకలి పట్టి పప్పు దినుసులు దంచి సందడి చేశారు. అనంతరం ప్రకృతి పద్ధతిలో పండించిన పంటలతో సిద్ధం చేసిన సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. భారత నావికాదళ ఉన్నతాధికారుల సతీమణుల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సంకల్ప కళాగ్రామ నిర్వాహకులు ఆకుల చలపతిరావు, పార్వతి, జెమీల్యా సమన్వయం చేశారు.


