అడియాసలు
ఆశలు..
● పసుపునకు గిట్టుబాటు ధర కరువు
● నష్టాల బారిన గిరిజన రైతులు
● పట్టించుకోని యంత్రాంగం
ఎండబెట్టిన పసుపు
పెదబయలు: ఏడాది పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పసుపు, పిప్పళ్ల పంట సాగు చేసినా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏజెన్సీలో పండించే పంటల్లో పసుపు, పిప్పళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. సేంద్రియ విధానంలో అల్లూరి జిల్లాలో పండించే ఈ పంటలు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంటారు. రాష్ట్రీయపరంగా ఆయా పంటలకు మార్కెట్ బాగుంది. ప్రస్తుతం పసుపు, పిప్పళ్లు పంట చేతికందింది. పంటల సేకరణలో గిరిజన రైతులు నిమగ్నమై ఉన్నారు. పలు సంతల్లో ఇప్పటికే మార్కెట్ ప్రారంభమైంది. అయితే పంటలకు ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లేక గిరిజన రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం కనీసం ఆదుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పతనమైన ధరలు.. ఆందోళనలో రైతులు
దేశంలో అస్సాం తరువాత ఎంతో నాణ్యత గల పసుపు అల్లూరి జిల్లాలో లభ్యమవుతుంది. దీంతో ఇక్కడ పండించే పసుపునకు జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అల్లూరి జిల్లాలో వేల ఎకరాల్లో పసుపు సాగు జరుగుతోంది. పెదబయలు మండలంలోని 23 గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కువగా పసుపు సాగు జరుగుతుంది. మండలం నుంచి ప్రతీ ఏడాది వేల టన్నుల పసుపు పంట తీసి వారపు సంత మార్కెట్‌కు తరలిస్తుంటారు. మైదాన ప్రాంత వ్యాపారులు సంతలో కొనుగోలు చేస్తుంటారు. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రైతులు పసుపు పంట సేకరణలో నిమగ్నమయ్యారు. పంట తీసిన తరువాత పసుపును కొమ్ములు, దుంపలుగా వేరు చేసి ఉడికించిన తరువాత వాటిని కల్లాల్లో ఎండబెడుతున్నారు. ఎండిన తారువాత పసుపునకు రంగు వచ్చేంత వరకు వివిధ మార్గాలో రాపిడి రంగు వేస్తున్నారు. బాగా ఎండిన తరువాత మార్కెట్‌కు తీసుకుని వచ్చి రైతులు అమ్మకాలు చేస్తున్నారు. అయితే పసుపు పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ప్రస్తుతం పెదబయలు వారపు సంత మార్కెట్‌లో కిలో పసుపు రూ.130 ధరలోపే కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం స్పందించి పసుపు పంటకు గిట్టుబాటు దర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
గిరిజన రైతులు ఎక్కువగా పండించే పంటల్లో పసుపు ఉంది. అయితే పసుపు పంటకు గిట్టుబాటు ధరలు ఉండడం లేదు. ఏడాదంతా కష్టపడి సాగు చేస్తే రైతు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.
– పోయిభ కృష్ణారావు, రైతు,
గొందికోడాపుట్టు గ్రామం, పెదబయలు మండలం
పసుపు కొనుగోలుకు ఆదేశాలు
ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ(జీసిసి) ద్వారా పసుపు కొనుగోలుకు ఆదేశాలున్నాయి. సంతల్లో ప్రైవేట్ వ్యాపారులు ఇష్టమైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. బాగా ఎండిన పసుపు మాత్రమే కొనుగోలు చేస్తాం.
– జి.అప్పన్న, జీసీసీ మేనేజర్,
జీసీసీ బ్రాంచ్, పెదబయలు మండలం
అడియాసలు


