బకులూరు మైనింగ్‌ క్వారీపై విచారణ | - | Sakshi
Sakshi News home page

బకులూరు మైనింగ్‌ క్వారీపై విచారణ

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 9:32 AM

బకులూరు మైనింగ్‌ క్వారీపై విచారణ

బకులూరు మైనింగ్‌ క్వారీపై విచారణ

కొయ్యూరు: బకులూరు మైనింగ్‌ క్వారీపై వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు పాడేరు ఆర్డీవో లోకేశ్వరరావు బుధవారం బకులూరులో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు వర్గాలతో విడివిడిగా చర్చలు జరిపారు. రంగురాళ్ల తవ్వకాలకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, స్థానికులు తనను అడ్డుకుంటున్నారని పి. సత్యనారాయణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, కొండపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారని, వారిని నిరోధించాలని ఆర్డీవోను కోరారు. అనధికారిక తవ్వకాలను అడ్డుకోవాలని ఆర్డీవో పోలీసులను ఆదేశించారు. చట్టవిరుద్ధంగా ఎవరు తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సత్యనారాయణ, మైనింగ్‌ పనులు ప్రారంభమైన తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మైనింగ్‌ జరగబోయే ప్రాంతం రెవెన్యూ భూమి అని, దీనిని ఎవరూ ఆక్రమించకూడదని ఆర్డీవో స్పష్టం చేశారు. ప్రస్తుతం మైనింగ్‌ అధికారులతో కలిసి కొండపై సర్వే నిర్వహిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ విచారణలో తహసీల్దారు మురళీబాబు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిషోర్‌వర్మ, ఆర్‌ఐ దొర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement