గంటవానిపాలెంలో చోరీ
మునగపాక: మండలంలోని గంటవానిపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలోని బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయినట్టు గుర్తించిన బాధితులు మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పి.ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాలివి. గంటవానిపాలెం గ్రామంలో కరణం శ్రీనివాసరావు, ఉమాపతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆమావాస్య కావడంతో పక్కనే ఉన్న కశింకోట మండలం పేరంటాలపాలెంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శన తిలకించేందుకు వారు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సరికి దొంగలు ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు అపహరించినట్టు గుర్తించి మునగపాక పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో యలమంచిలి సీఐ ధనుంజయరావు, మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు విచారణలో ఉందని నష్టం ఎంతమేర అన్నది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ధనుంజయరావు మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


