అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐఐఎంవీలో వర్క్‌షాప్
తగరపువలస: అల్లూరి సీతారామరాజు జిల్లా స్థిరమైన వృద్ధి ప్రణాళిక రూపకల్పనపై గురువారం గంభీరం ఐఐఎంవీలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర విజన్–2047 మార్గదర్శకాలకు అనుగుణంగా, ‘సంపూర్ణత అభియాన్’ కింద 5 ప్రధాన అంశాలు, 46 సూచికలతో జిల్లా పనితీరును మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని కాఫీ, మిరియాలు, పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నాణ్యత, బ్రాండింగ్ , విలువ ఆధారిత తయారీపై దృష్టి సారించాలన్నారు. నీతి ఆయోగ్ ప్రాజెక్టులో భాగంగా 627 గృహాల నుంచి సేకరించిన సమాచారం, 213 కీలక సూచికల విశ్లేషణతో రూపొందించిన నివేదికను ఐఐఎంవీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ వర్క్‌షాప్‌లో ఐఐఎంవీ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్లు మారిశెట్టి విజయ, అంబేడ్కర్ పాల్గొన్నారు. తుది నివేదికను త్వరలోనే నీతి ఆయోగ్‌కు సమర్పించనున్నట్లు ప్రొఫెసర్ అభినాష్ సింగ్ తెలిపారు.


