60 కిలోల గంజాయి స్వాధీనం
మాకవరపాలెం: ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రహీమ్ షరీఫ్(29) తన మినీ వ్యాన్‌తో అరకు మీదుగా ఒడిశాలోని పాడువ గ్రామానికి వెళ్లాడు. అక్కడ శ్రీను అనే వ్యక్తి నుంచి కిలో రూ.6,000 చొప్పున 60 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని వ్యాన్‌పై తరలిస్తుండగా మండలంలోని రాచపల్లి జంక్షన్‌లో శనివారం పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ గంజాయిని బయట విక్రయిస్తే రూ. 30 లక్షలు వస్తుందని చెప్పారు. గంజాయితోపాటు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రహీమ్ షరీఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని, ఈ కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి సయ్యద్ తన్వీర్, పాడువకు చెందిన శ్రీను పరారీలో ఉన్నారన్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్‌ఐ దామోదర్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


