చింతపండుకు గిట్టుబాటు ధర
● గిరి మహిళలు డిమాండ్
● తట్టలు నెత్తిన పెట్టుకుని వినూత్నంగా
నిరసన
అనంతగిరి (అరకులోయ టౌన్): గిరిజనులు సేకరించిన చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రొంపెల్లి పంచాయతీలో గిరిజన మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం చింతపండు తట్టలను నెత్తిన మోస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు.ఈ సందర్భంగా రొంపెల్లి వార్డు సభ్యుడు సోమల అప్పలరాజు, గ్రామస్తులు బూరుగ పెంటమ్మ, పోలమ్మ గిరిజన సహకార సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో కిలో చింతపండు ధర రూ. 60 పలుకుతుంటే, జీసీసీ కేవలం రూ. 36 ధర చెల్లించనుండటం గిరిజనుల శ్రమను అవమానించడమేనని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు ధరను రూ. 50కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వారపు సంతల్లో దళారుల ఆగడాలను అరికట్టాలి. తూకాల్లో మోసాలు (బెట్టు కాటాలు) జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజన రైతులకు అండగా నిలిచి, వారు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


