భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

పాత నేరస్తుడు అరెస్టు, రూ.30.39 లక్షల విలువైన 16.5 తులాల బంగారం స్వాధీనం

అనకాపల్లి: మునగపాక మండలంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం వెల్లడించారు. ఈనెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మునగపాక మండలం గంతవానిపాలెంలో కరణం ఉమావతి తన ఇంటికి తాళం వేసి దేవాలయానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటిలో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 17.5 తులాల బంగారం చోరీ అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్‌ పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

అనకాపల్లి పట్టణానికి చెందిన కోన రాజేష్‌ దొంగతనం చేసినట్టు గుర్తించారు. నిందితుడిని ఈనెల 19న యలమంచిలి మండలం కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్ద పట్టుకుని, 16.5 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితునిపై గతంలో అనకపల్లి పట్టణపోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు చోరీ కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. రివకరీ చేసిన బంగారం విలువ సుమారు రూ.30.39లక్షలు ఉంటుందన్నారు.

గణనీయంగా పెరిగిన రికవరీ శాతం

పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న పటిష్ట చర్యల వల్ల దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం గణనీయంగా పెరిగిందని ఎస్పీ చెప్పారు. 2024 సంవత్సరంలో 46శాతం కేసుల్లో డిటెక్షన్‌, 60శాతం ప్రాపర్టీ రికవరీ, 2025 సంవత్సరంలో 59శాతం కేసుల్లో డిటెక్షన్‌, 63శాతం ప్రాపర్టీ రికవరీ సాధించగా, 2026 సంవత్సరంలో ఇప్పటి వరకూ నమోదైన రెండు ప్రధాన కేసుల్లో నూ 100శాతం డిటెక్షన్‌, 100శాతం ఆస్తి రికవరీ సాధించినట్టు తెలిపారు. ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో దగ్గరలో ఉన్నపోలీసు స్టేషన్‌లో సమాచారం అందించినట్లుయితే లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ప్రతి వీధిలో, ఇంటి వద్ద సీసీ కెమోరాలను ఏర్పాటు చేస్తే చోరీకి పాల్పడిన వ్యక్తులను త్వరితగతిన పట్టుకోవచ్చని తెలిపారు. అనంతరం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి సీఐ ఎస్‌.ధనుంజయరావు, మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు, సీసీఎస్‌ సీఐ కె.అప్పలనాయుడు, ఫింగర్‌ ప్రింట్‌ సీఐ టి.విజయ, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement