పంచాయతీ ఆదాయానికి గండి
ఎస్.రాయవరం: మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వల్ల గ్రామ పంచాయతీ ఆదాయానికి తీవ్ర గండి ఏర్పడుతోందని సర్పంచ్ భూపతి అప్పారావు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.గ్రామానికి ఆర్టీసీ బస్సులు వస్తాయంటే 2002 సంవత్సరంలో పంచాయితీ పెద్దలు ఆర్టీసీకి స్థలం కేటాయించారన్నారు. అయితే అప్పట్లో చెల్లించాల్సిన స్థలం నగదు 24 సంవత్సరాలు గడుస్తున్నా రూ.26 లక్షలు చెల్లించలేదన్నారు. పైగా ఆర్టీసీ భవనం ప్రాంగణంలోకి బస్సులు రాకపోగా , ఆర్టీసీ అధికారులు భవనంలో గదులు అద్దెలకు ఇచ్చుకుని లబ్ధి పొందుతున్నారన్నారు. పంచాయతీకి చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడం వల్ల పంచాయతీ ఆదాయానికి గండి పడుతోందన్నారు. పంచాయతీలో కీలక ప్రదేశంలో ఈ స్థలం ఉండడం పలు సామాజక కార్యక్రమాలకు అద్దె నివాసులతో ఆటంకం కూడా ఏర్పడుతోందన్నారు. ఆర్టీసీకి అవసరం లేకుండా ఉన్న స్థలాన్ని యథావిధిగా పంచాయతీకి కేటాయించి ఇన్ని రోజులు తద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీకి కేటాయించాలని కోరారు.


