పకడ్బందీగా టెన్త్ పరీక్షల నిర్వహణ
మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్, పక్కన ఎస్పీ అమిత్‌బర్దర్, డీఈవో రామకృష్ణారావు
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు జిల్లాలకు కలిపి మొత్తం 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 47 కేంద్రాల్లో 7,299 మంది రెగ్యులర్, 505 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు ఆయన వెల్లడించారు. పోలవరం జిల్లాలో 35 కేంద్రాల్లో 4,158 మంది రెగ్యులర్, 26 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఓపెన్ స్కూల్‌కు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 కేంద్రాల్లో 1,003 మంది, పోలవరం జిల్లాలో ఐదు కేంద్రాల్లో 414 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ఆయన తెలిపారు. ఇంటర్‌కు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 కేంద్రాల్లో 582 మంది, పోలవరం జిల్లాలో 3 కేంద్రాల్లో 603 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక, ప్రైవేట్ కేంద్రాలలో మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా సీసీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బందిని కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశ్నాపత్రాల తరలింపు సమయంలో తనిఖీ బృందాలకు ఎస్కార్ట్ పోలీసులు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దర్, డీఈవో రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


