రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రం
● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు
● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు
● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం
● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే
● అరకు కాఫీపై అదే పాత పాట
సామాజిక న్యాయం ఎక్కడ?
రాష్ట్ర బడ్జెట్‌లో ఆదివాసీల సంక్షేమానికి ఒరిగిందేమీ లేదు. మహిళలకు నెలకు రూ. 1,500 (ఏడాదికి రూ. 18 వేలు), నిరుద్యోగ భృతి రూ. 3వేలు, రైతులకు రూ. 20 వేలు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు రూ. 15వేలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించింది. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనను భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు ఎదిరించాలి.
– అప్పలనర్స, జిల్లా కార్యదర్శి, సీపీఎం, పాడేరు
విశాఖకు విదిల్చింది..
బడ్జెట్‌లో మరోసారి మోసం
నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నేటికి హామీ అమలు చేయలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణం. ఏటా జవనరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినా ఆ ఊసే లేదు.ఉదోగావకాశాలు కల్పించకుంటే కనీసం ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి అయినా చెల్లించాలి.
– తాంగుల ధనలక్ష్మి, నిరుద్యోగ యువతి,
డింగూడ, ముంచంగిపుట్టు మండలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యేదాకా విశాఖలో పనులు మొదలుపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు.
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉత్తుత్తి ప్రేమను ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.605కోట్లు కేటాయించినట్లు చూపారు. అయితే, వాస్తవానికి ఇందులో సింహభాగం నిధులు పునరావాసం, జీతభత్యాలకే సరిపోనున్నాయి. ఈ రెండు పద్దులకే రూ. 400 కోట్లకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. అంటే, అసలైన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కనీసం రూ.200 కోట్లు కూడా మిగలవని స్పష్టమవుతోంది. మరోవైపు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రూ.470 కోట్లతో ప్రారంభించిన తాండవ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూమంత్రంగా కేవలం రూ.8.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
‘సూపర్ సిక్స్’జాడేది?
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్‌లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొన్ని అరకొర కేటాయింపులివే...
● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్‌లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది.
● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం.
● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు.
● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆదివాసీలకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదివాసీలకు ఎన్నడూలేనివిధంగా తీవ్ర అన్యాయం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ బడ్జెట్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతి గృహాల (హాస్టళ్ల) అభివృద్ధికి నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో స్పష్టత లేదు. పీవీటీజీ గిరిజనులకు పీఎం జన్‌మన్ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పడం లేదు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఆదివాసీల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి నిధులు కేటాయించాల్సి అవసరం ఉంది. ఇందుకుకోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– పొద్దు బాలదేవ్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ గిరిజన సంఘం
నిరుద్యోగ భృతి మాటేది?
రాష్ట్ర బడ్జెట్‌లో ఎలాంటి రాయితీలు, మేలు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదురు చూశారు. కానీ మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ బడ్జెట్‌లో దాని ఊసే లేదు. దీని కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నాం. ఇక ఈ ఏడాది భృతి లేనట్టే. పాలకులకు మళ్లీ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకువస్తుందేమో. బడ్జెట్ అంతా కల్లబొల్లి కబుర్లే అన్నట్టుగా ఉంది.
–వాండ్రాసి శివశంకర్, గ్రాడ్యుయేట్, నగరంపాలెం
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!


