ఇండియానా: అమెరికాలో ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకుని స్థిరపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా పంజాబీ సిక్కులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇండియానా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం కారణంగా భారీ సంఖ్యలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు (సీడీఎల్) రద్దయ్యాయి. 2026, ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావడంతో వందలాది మంది భారతీయుల ఉపాధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఏమిటీ కొత్త చట్టం?
ఇండియానా బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్స్ (బీఎంవీ) ‘హౌస్ ఎన్‌రోల్డ్ యాక్ట్ 1200’ ప్రకారం మొత్తం 1,790 నాన్-డొమిసైల్డ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. గతంలో చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఉన్న విదేశీయులకు ఈ లైసెన్సులు ఇచ్చేవారు. అయితే తాజా మార్పుల ప్రకారం కేవలం మూడు రకాల వీసా కేటగిరీలకు (H-2A - వ్యవసాయ కార్మికులు, H-2B - తాత్కాలిక కార్మికులు, E-2 - ఇన్వెస్టర్లు) మాత్రమే ఈ లైసెన్సులు పొందే అర్హత ఉంటుంది. మిగిలిన వీసాలపై ఉన్న డ్రైవర్లందరినీ అనర్హులుగా ప్రకటిస్తూ, మార్చి 16నే నోటీసులు జారీ చేశారు.
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
ఇటీవల కాలంలో నాన్-డొమిసైల్డ్ డ్రైవర్ల వల్ల జరిగిన ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ రికార్డుల పరిశీలన, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, సరైన శిక్షణ వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించారు.
భారతీయులపై ప్రభావం
అమెరికాలో లాంగ్-హాల్ ట్రక్కు రవాణా రంగంలో భారతీయ సంతతికి చెందిన వారు, ముఖ్యంగా పంజాబీ కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది. తాజా రద్దుతో చాలా మంది డ్రైవర్లు తమ స్థాయిని కోల్పోయి, కేవలం సాధారణ డ్రైవింగ్ లైసెన్సులకే (Regular DL) పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు వేల సంఖ్యలో లైసెన్సులను రద్దు చేయగా, ఇప్పుడు ఇండియానా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా సరఫరా గొలుసు (Supply Chain)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గుండె గుభేల్: యుద్ధం మరో 20 రోజులు?


