ఇరాన్ యుద్ధం కాస్తా కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా, పెట్రోల్ అంశాల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయాలతో సీనియర్ లీడర్లు విభేదించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని విభేదిస్తూ మోదీ ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అనంతర పరిస్థితులపై మోదీ ప్రభుత్వ దౌత్య వైఖరిని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే విమర్శించారు. మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం రాజీ పడుతోందని ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమనీ మృతి విషయంలో కూడా భారత వైఖరిని రాహుల్ తప్పు పట్టారు. ఖమేనీ హత్యను ఖండించాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. అలాగే, గ్యాస్, పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని బహిరంగంగానే రాహుల్ మాట్లాడారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు పరోక్షంగా తప్పు పడుతున్నారు. రాహుల్‌కు మద్దతు ఇవ్వకుండా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ విషయంలో భారత విదేశాంగ శాఖ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మనీష్ తివారీ వంటి నేతులు బీజేపీ సర్కార్‌కు మద్దతుగా మాట్లాడారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రభుత్వ విధానాన్ని బాధ్యతాయుతమైన రాజనీతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ప్రభుత్వం సరైన పనే చేస్తున్నట్లుందని అని అన్నారు. మరోనేత ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని భారతదేశం దౌత్యపరంగా నిర్వహించిన తీరును ఆయన... పరిణతి చెందినది మరియు నైపుణ్యంతో కూడినది అని ప్రశంసించారు. కమల్‌నాథ్ స్పందిస్తూ.. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏమీ లేదన్నారు. కొరత ఉందన్న వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ అంతర్గత కలహాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. ఈ సందర్బంగా.. "రాహుల్ గాంధీ ఒక అవకాశవాది.. దేశద్రోహి అని కాంగ్రెస్ నాయకులకు తెలుసు!" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కేంద్రం చర్యలను రాహుల్ గాంధీ తప్పుపడితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కేంద్రాన్ని ప్రశంసించారు. నాడు శశిథరూర్ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.


