అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే ! | Iran war and Pushkaralu dont miss this Wedding season | Sakshi
Sakshi News home page

అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే !

Apr 4 2026 2:50 PM | Updated on Apr 4 2026 3:45 PM

Iran war and Pushkaralu dont miss this Wedding season

యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం పెళ్లికి రెట్టింపు ఖర్చు  

వాయిదా వేద్దామంటే.. మున్ముందు పుష్కరాల అడ్డు 

ఇప్పుడు కాకుంటే పుష్కరాల తరువాత ఏడాది ఆగాల్సిందే

ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే పుష్కరాల తరువాత ఏడాది కాలం పాటు ఈ ప్రాంత వాసులు వివాహాది శుభకార్యాలు జరుపుకోరు. అందుకే ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లిళ్లు జరుపుకోవాలని ఆతృత పడుతున్నారు. అయితే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరిగిన వంట నూనెలు, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెళ్లివారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేద్దామా అంటే.. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయి. దాంతో పెళ్లిళ్లు చేసుకునేవారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. 

ఇదీ చదవండి: ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్‌!

శుభకార్యాలు జరపరెందుకంటే.. 
గోదావరి జిల్లాల వాసులు చనిపోయిన తమ పితృ దేవతలకు పుష్కరాల సమయంలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు. అందువల్ల పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు శుభకార్యాలు జరపకూడదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వారితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన చాలా మంది ఈ సమయంలో శుభకార్యాలను జరుపుకోరు. ఈ ప్రాంతాల వారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇది శాస్త్ర విరుద్ధమని భావించేవారు పుష్కరాల తరువాత ఏడాదిపాటు శుభ కార్యాలకు దూరంగానే ఉంటారు. 

భారంగా మారిన ధరలు 
ప్రస్తుతం పెరిగిన ధరలు పెళ్లిళ్లు జరుపుకునే వారికి పెను భారంగా మారాయి. డెకరేషన్‌కు వినియోగించే పచ్చిపూలతో పాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  

గ్యాస్‌ ధరలు ఇలా..: సిలిండర్‌ పెరిగిన ధరతో కలిపి రూ.954కాగా, బ్లాక్‌లో రూ.2 వేలకు విక్రయిస్తున్నారు.   కమర్షియల్‌ సిలిండర్‌ పెరిగిన ధరతో కలిపి రూ.1,930 కాగా, బ్లాక్‌లో దొరకడం లేదు. ఒకవేళ దొరికితే రూ.3 వేలకు విక్రయిస్తున్నారు.  

భారీగా వివాహాలు 
ప్రస్తుత ముహూర్తాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న సన్నిధి పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. బలమైన ముహూర్తాల్లో ఇక్కడ వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈనెల 11, 12, 29 తేదీల్లో పెళ్లిళ్లు అతి భారీగా జరనున్న నేపథ్యంలో ఇప్పటికే కొండపైన, కొండ కింద కల్యాణ మండపాలు, గదులు దాదాపుగా అన్నీ ముందే బుక్‌ అయిపోయాయి. కేటరింగ్, వాయిద్యకారులు, డెకరేషన్‌ వ్యాపారులు, పురోహితులు బిజీబిజీగా ఉన్నారు.

ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement