ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం, ఆపై ప్రధాని దిగిరావడం.. వెరసి పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అగ్ని గుండంలా మారిపోయింది.
యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. 85 శాతం చమురును ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా దిగుమతి చేసుకునే పాకిస్తాన్‌కు ఇది శాపంగా మారింది. శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 42.7 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 485కి చేరుకుంది. ఈ నిర్ణయంతో జనం బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.
ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పెంచిన ధరను అదే రోజు రూ. 378కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ తగ్గిన ధర కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. మీ జీవితాలు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను విశ్రమించను’ అని ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్ ధర తగ్గించినప్పటికీ, డీజిల్ ధర సామాన్యుడిని వణికిస్తోంది. లీటర్ డీజిల్ ధరను రూ. 335.86 నుంచి ఏకంగా రూ. 520.35కి పెంచారు. అయితే, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దానిపై విధించే లెవీని తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్‌పీజీ (ఎల్‌పీజీ), సీఎన్‌జీ (సీఎన్‌జీ)ధరలను 29 శాతం మేర పెంచారు.
పాక్ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలు
పాకిస్తాన్‌లో ప్రజా నిరసనల సెగను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక రాయితీలను ప్రకటించింది
ఉచిత ప్రయాణం: ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్లో 30 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
సబ్సిడీలు: సింధ్ ప్రభుత్వం మోటార్ సైకిలిస్టులకు, చిన్న రైతులకు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది.
రవాణా ఛార్జీలు: పెరిగిన ధరల భారాన్ని ప్రయాణికులపై వేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ రవాణాదారులను కోరారు.
వీధుల్లోకి జనం: ‘మమ్మల్ని చంపేయండి’
లాహోర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ‘ప్రభుత్వం మాపై పెట్రోల్ బాంబు వేసింది. మమ్మల్ని చంపేయండి. ఈ భారాన్ని మేము భరించలేము’ అని నిరసనకారుడు నవీద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరసనకారుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన ధరల పెరుగుదల కాదని, ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.
ముందున్నది గడ్డు కాలమే..
పాకిస్తాన్ జనాభాలో దాదాపు 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. మార్చి 28న ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే వారాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివే. యుద్ధం సద్దుమణగకపోతే దాయాది దేశ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి..


