స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి.. | Temple Built In Uttarakhand School To Calm Ghost, Student Fund Collection Sparks Controversy, Education Department Orders Probe | Sakshi
Sakshi News home page

స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి..

Apr 4 2026 11:02 AM | Updated on Apr 4 2026 11:42 AM

Schools Temple For Ghost Sparks Row Education Department Orders Probe

డెహ్రాడూన్: పాఠశాల అంటే అక్షరాలు నేర్పే సరస్వతీ నిలయం... ధైర్యాన్ని నూరిపోసే వేదిక. అయితే ఉత్తరాఖండ్‌లోని ఒక పాఠశాలలో ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆ స్కూలును ఒక దెయ్యం పట్టిపీడిస్తోందట. అందుకే దానిని  శాంతింపజేసేందుకు స్కూల్ ఆవరణలోనే ఒక గుడిని కట్టేశారు. ఇందుకోసం  విద్యార్థుల నుంచే చందాలు వసూలు చేశారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్‌లోని కౌసాని ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో గత కొంతకాలంగా వింత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్ల క్రితం స్కూల్ సమీపంలో ఒక నేపాలీ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అతని ఆత్మ పాఠశాల ఆవరణలో తిరుగుతోందని, అందుకే విద్యార్థులు భయపడుతున్నారని స్థానికులు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, ఆ ‘ఆత్మ’ను శాంతింపజేసేందుకు పాఠశాల యాజమాన్యం, పేరెంట్ టీచర్ అసోసియేషన్ (పీటీఏ) కలిసి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాయి.

విద్యార్థుల నుంచే వసూళ్లు
ఈ ఆలయ నిర్మాణం కోసం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 100 చొప్పున వసూలు చేశారు. ఇలా మొత్తం రూ. 21,800 వసూలు కాగా, మిగిలిన మొత్తాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భరించి మొత్తం రూ. 25,000తో ఆలయాన్ని పూర్తి చేశారు. ‘పిల్లలు పదేపదే అనారోగ్యం పాలు కావడంతో, వారిలో భయాన్ని పోగొట్టి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేలా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్కూల్ ప్రిన్సిపాల్ తాజ్‌బర్ సింగ్ నేగి మీడియాకు తెలిపారు.

రంగంలోకి విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం, అది కూడా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తీవ్రం కావడంతో జిల్లా విద్యాశాఖాధికారి వినయ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అక్షరాలు నేర్పాల్సిన చోట మూఢనమ్మకాలను ప్రోత్సహించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఏఐతో వ్యాక్సిన్ రెడీ.. జీవ ఆయుధాల ముప్పు తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement