కలెక్షన్ల కలకలం | - | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల కలకలం

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

హెడ్‌ నర్సుల పోస్టింగ్‌ల్లో

సీఎంవోకు ఫిర్యాదు

13న కమిటీ విచారణ

మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన హెడ్‌ నర్సుల పదోన్నతులు, పోస్టింగ్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ రాధారాణి ఆధ్వర్యంలో ఇటీవల హెడ్‌ నర్సులకు పదోన్నతులు కల్పించి, పలు ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు జారీ చేశారు. అయితే ఈ పదోన్నతులు, పోస్టింగ్‌ల వెనుక లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విశాఖ సిటిజెన్‌ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బీవీకే బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదోన్నతులు పొందిన పలువురు నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆ ఫిర్యాదును కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ. వాణికి పంపించారు. అయితే హెడ్‌ నర్సుల పదోన్నతుల వ్యవహారం తన పరిధిలోకి రాకపోవడంతో.. సూపరింటెండెంట్‌ ఆ లేఖను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌కు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (మేల్‌) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 13న ఈ వ్యవహారంపై డాక్టర్‌ మీనాక్షి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

ఆ ముగ్గురే కీలకం..

ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి, ఈసీ సభ్యురాలు గౌరి.. పదోన్నతి పొందిన మొత్తం 30 మంది నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 30 మంది నర్సులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకురాళ్లను కూడా విచారణ అధికారి ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వీరికి కేటాయించిన వార్డుల్లో డ్యూటీలు చేయకుండా, నిత్యం క్లాక్‌ రూమ్‌లోనే ఉంటూ అక్కడి నుంచే సెటిల్‌మెంట్లు చేస్తున్నారని విమర్శించారు.

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌

అండదండలతోనే..

మిగతా నర్సులందరికీ ఎప్పటికప్పుడు డ్యూటీలు మారుస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఏళ్ల తరబడి ఒకే వార్డులో తిష్టవేశారని ఫిర్యాదులో ఆక్షేపించారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పద్మావతి అండదండలతోనే వీరు ఇలా రెచ్చిపోతున్నారని, ఎవరికై నా తమకు అనుకూలమైన డ్యూటీలు లేదా మంచి పోస్టింగ్‌లు కావాలంటే వీరిని కలిసి అడిగినంత ఇచ్చుకుంటే.. పద్మావతిని మేనేజ్‌ చేసి డ్యూటీలు వేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, వరలక్ష్మి స్పందిస్తూ.. తమకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణ అధికారి కోరితే అన్ని వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement