రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
చాపరాయి వద్ద ఏర్పాటు చేస్తున్న
రోడ్డు భద్రతపై హెచ్చరిక బోర్డు
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి వద్ద, అలాగే జైపూర్ జంక్షన్ వద్ద బుధవారం పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు. ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాల మేరకు, ఎస్‌ఐ ఎల్.సురేష్ ఆధ్వర్యంలో పలుచోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే వాహనదారులు అతివేగంగా బైక్‌లు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులలో అవగాహన కల్పించేందుకు, ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.


