పోలేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
● 60 ఎకరాల్లో తోటలు దగ్ధం
● అదుపులోకి రాని మంటలు
● రూ. 12 లక్షల ఆస్తినష్టం
పోలేపల్లిలో కాలిపోయిన జీడితోటలు
కొండ ప్రాంతంలో కాలిపోతున్న తోటలు
బుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 60 ఎకరాల్లో జీడిమామిడి, యూకలిప్టస్, ఆకేషియా తోటలు కాలిపోయాయి. ఇందులో 15 ఎకరాలు రైతుల భూమి, 45 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్టు పీకల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన తుంపాల శివప్రసాద్, నాగులపల్లి చిన్నమ్మలు, సీతా పరమేశ్వరి, పునుమళ్ల శ్రీనివాసరావు తదితర రైతులకు చెందిన జీడితోటలు, యూకలిప్టస్ తోటలు కాలిపోయాయి. రూ. 12 లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఆకేషియా, యూకలిప్టస్ తోటలు కాలిపోతుండగా, స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అయితే కొండ ప్రాంతంలోకి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక వెనుదిరిగినట్లు సర్పంచ్ సీతా పైడియ్యనాయుడు తెలిపారు. ఈ ప్రమాదంలో తోటలు కాలిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామాన్ని ఆనుకున్న కొండ ప్రాంతంలో ఇంకా మంటలు అదుపులోకి రాకపోగా, తీవ్రంగా పొగ రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం


