గగన గర్జనలతో సాగర సంబరం
యుద్ధ విమానాల విన్యాసాలు
ఏయూ క్యాంపస్: ఆకాశం గర్జించింది..ం సముద్రం సాక్షిగా నిలిచిందిం.. భారత నావికాదళ శౌర్యం మరొకసారి విశాఖ గగనతలాన్ని కంపింపజేసింది. లోహ విహంగాలు రెప్పపాటు వేగంతో దూసుకెళ్లి చేసిన సమన్వయ విన్యాసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తించిన ఈ ప్రదర్శనలు దేశభక్తి జ్వాలను రగిలించాయి. అయిల్ బంకర్‌లను లక్ష్యంగా చేసుకుని చేసిన సాహస విన్యాసాలు యుద్ధ సన్నివేశాన్ని తలపించాయి. చేతక్ హెలికాప్టర్ నుంచి మైరెన్ కమాండోలు సముద్రంలోకి దూకిన క్షణం ప్రేక్షకుల గుండెల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. అలల్ని చీల్చుకుంటూ తీరానికి చేరుకుని లక్ష్యాలను ఛేదించిన తీరు నావికాదళ దిట్టతను చాటిచెప్పింది. గగనతలంలో యుద్ధ సిద్ధతను సూచిస్తూ సుఖోయ్ విమానాలు యుద్ధవిమానాలు గర్జించగా, సముద్ర గస్తీ సామర్థ్యానికి ప్రతీకలైన డోర్నియర్ విమానాలు సమన్వయంతో విహరించాయి. నేలపై యుద్ధ టాంకులపై సైనికులు ప్రదర్శించిన ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు వారి త్యాగస్ఫూర్తిని, దేశనిబద్ధతను ప్రతిబింబించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ కార్యక్రమాల భాగంగా ఈ నెల 19న జరగనున్న అంతర్జాతీయ సిటీ పరేడ్‌కు ముందస్తు సన్నాహకంగా మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలు నగరాన్ని ఉత్సాహోత్సాహాలతో నింపాయి. విదేశీ అతిథులు, నావికాదళ ప్రతినిధులు మన సైనిక శక్తిని ఆసక్తిగా తిలకిస్తూ ప్రతి క్షణాన్ని తమ కెమెరాల్లో బంధించారు. సముద్రంలో వరుసగా నిలిచిన యుద్ధ నౌకలపై వెలిగిన విద్యుత్ కాంతులు, చివరగా నిర్వహించిన ఫైర్‌వర్క్స్ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ విశాఖ రాత్రిని వేడుకగా మార్చాయి. రాత్రి నౌకలపై నుంచి ప్రదర్శించిన లేజర్ షో ఎంతగానో ఆకట్టుకుంది.
మెరిసిన రాష్ట్ర జానపద సంపద
ఆర్‌కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ పరేడ్ సాంస్కృతిక వైభవం, సైనిక క్రమశిక్షణ, గగన విన్యాసాలతో అబ్బురపరిచింది. ఆంధ్రప్రదేశ్ జానపద సంపద వేదికపై మెరిసింది. ఆదివాసీ సంప్రదాయ నృత్యం థింసా నుంచి కోలాటం, డప్పు వాద్యం, కొమ్ము నృత్యం, కూచిపూడి, తప్పెటగుళ్లు, పులివేషం, బుట్టబొమ్మలు వరకూ ప్రతి ప్రదర్శన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సంప్రదాయ వేషధారణలో కళాకారులు లయబద్ధంగా చేసిన నృత్యాలు కనులవిందుగా నిలిచాయి.
గగన గర్జనలతో సాగర సంబరం
గగన గర్జనలతో సాగర సంబరం


