పోతన్న.. పోటీ పరీక్షల్లో మిన్న
కె.కోటపాడు: డిప్యూటీ డీఈవో పరీక్ష ఫలితాల్లోనూ మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన కన్నూరి పోతన్న సత్తా చాటారు. సోమవారం రాత్రి వెలువడిన ఫలితాల్లో డిప్యూటీ డీఈవో పోస్టుకు ఎంపికయ్యారు. 2023 నవంబర్‌లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిప్యూటీ డీఈవోల పోస్టులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎంఏ, బీఈడీతోపాటు పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో రావికమతం మండలం మేడివాడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పోతన్న ప్రస్తుతం డిప్యూటీ డీఈవోగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రూపు–2 ఫలితాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు అర్హత సాధించడం విశేషం.
హాస్టల్ చదువులు సాగించి...
పోతన్న తల్లిదండ్రులు కృష్ణ, అక్కయ్యమ్మ వ్యవసాయం చేస్తుండేవారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కుమారుడిని హాస్టల్‌లో చేర్పించి చదివించారు. అతను కె.కోటపాడులో బీసీ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి వరకు, పెందుర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్, ఏవీఎన్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ, బీఈడీ చదివారు. 2008 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయుడిగా బుచ్చెయ్యపేట మండలం రాజుపాలెం, పెందుర్తి మండలం రెల్లికాలనీ పాఠశాలల్లో పనిచేశారు. వేసవి సెలవుల్లో విజయవాడ, విజయనగరం, నంద్యాల ప్రాంతాల్లో గ్రూపు–1, 2 పోస్టులకు కోచింగ్ తీసుకున్నట్టు పోతన్న తెలిపారు.


