చదరంగంలో రాణించాలి ● కలెక్టర్ దినేష్‌కుమార్
● ప్రతిభావంతులకు సర్టిఫికెట్ల పంపిణీ
చెస్ క్రీడాకారులతో కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు రూరల్: చదరంగం క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుమారు వంద మంది విద్యార్థులకు (బాలబాలికలు) బుధవారం కలెక్టర్ తన కార్యాలయంలో సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ముఖ్యంగా క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి వేదికగా నిర్వహించనున్న ’శాప్ లీగ్’ చదరంగం పోటీల్లో పాల్గొని, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జగన్‌మోహన్‌రావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సూరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


