చింత సెగ | - | Sakshi
Sakshi News home page

చింత సెగ

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

చింత

చింత సెగ

మన్యంలో చింతపండు సీజన్‌ మొదలైంది. ఊరంతా పులుపు.. గిరిజన రైతు గుండెల్లో మాత్రం చేదు అనుభవాలు.. ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి సగానికి పడిపోయి కుదేలవుతుంటే, అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కనీస మద్దతు ధర ఇవ్వకుండా కళ్లు మూసుకుంది. నాణ్యతలో నంబర్‌ వన్‌ అని కితాబులు ఇచ్చే పాలకులకు, ఆ చింతను సేకరించే గిరిపుత్రుల చెమట చుక్కల విలువ మాత్రం కనిపించడం లేదు. అటు దళారీల సిండికేట్‌, ఇటు అధికారుల ఉదాసీనత మధ్య చింతపండు రైతులు నలిగిపోతున్నారు.

కిలో రూ.50కు కొనుగోలు చేయాలి

చింతపండు సేకరణ నుంచి అమ్మకాలు వరకు కష్టం అధికంగానే ఉంటున్నా అమ్మకాల సమయంలో గిట్టుబాటు కావడం లేదు. వారపుసంతలు, మండల కేంద్రాల్లో కొనుగోలు ధరలు పెరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. జీసీసీ కిలోకు రూ.50 మద్దతు ధర ప్రకటించి న్యాయం చేయాలి. – పాంగి సత్యారావు,

గిరిజన రైతు, కామయ్యపేట,

హుకుంపేట మండలం

కిలో రూ.36 ధరతో కొనుగోలుకు ఆదేశాలు

ఉన్నతాధికారులు కిలో రూ.36 ధరకు చింతపండు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. గతేడాది కూడా ఇదే ధరకు కొనుగోలు చేశాం.అన్ని సంతల్లోను చింతపండు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం. చింతపండు ధరల పెంచాలని గిరి రైతుల డిమాండ్‌ను తమ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తాం.

– వి.కృష్ణప్రసాదరావు, డీఎం, జీసీసీ, పాడేరు

సాక్షి,పాడేరు:

జెన్సీ ప్రాంతంలో చింతపండు సీజన్‌ ప్రారంభమైనప్పటికీ, గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాల్సిన గిరిజన సహకార సంస్థ, గత ఏడాది వలే ఈ ఏడాది కూడా కిలోకు కేవలం రూ. 36 ధరనే ప్రకటించింది. మరోవైపు, ప్రైవేట్‌ దళారీలు సిండికేట్‌గా మారి అంతకంటే తక్కువ ధరకే కొనుగోళ్లు చేస్తూ గిరిజనులను నష్టపరుస్తున్నారు.

ధరల వ్యత్యాసం..

మైదాన ప్రాంతాల్లో కిలో చింతపండు రూ. 60 పలుకుతుండగా, ఏజెన్సీలో కనీసం రూ. 50 మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు, జీసీసీ అధికారులు దీనిపై స్పందించడం లేదు.

తగ్గిన దిగుబడి..

ఈ ఏడాది ప్రతికూల వాతావరణం వల్ల చింత చెట్లకు కాపు తగ్గింది. గతంలో ఒక చెట్టుకు సగటున 100 కిలోల దిగుబడి రాగా, ఈసారి అది 50 నుంచి 60 కిలోలకు పడిపోయింది. దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉన్నా, మార్కెట్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

పెరిగిన శ్రమ..

చింత కాయలు రాల్చడం, సేకరించడం, శుభ్రం చేసి వారపు సంతలకు తరలించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంత శ్రమ పడినా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యతలో మేటి..

మన్యంలోని చింతపండు నాణ్యతలో నంబర్‌ వన్‌గా గుర్తింపు పొందింది. దీనికి మైదాన ప్రాంతాల్లో భారీ డిమాండ్‌ ఉండటంతో ఏటా సుమారు రూ. 30 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది జీసీసీ సుమారు 100 లారీల చింతపండును సేకరించగా, ప్రైవేట్‌ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలకు తరలించారు. ఇంత ప్రాధాన్యత ఉన్న పంటకు సరైన ధర దక్కకపోవడం గిరిజన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది.

ఆందోళన బాటలో..

జీసీసీ ప్రకటించిన రూ. 36 మద్దతు ధరను నిరసిస్తూ అనంతగిరి మండలం బూరుగు గ్రామంలో గిరిజన మహిళలు చింతపండు బుట్టలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కిలోకు రూ. 50 చెల్లించి కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించని జీసీసీ

గతేడాది మాదిరిగానే కిలో రూ.36 కొనుగోలు ధర ప్రకటన

ధర పెంచకపోవడంపై ఉద్యమిస్తున్న గిరి రైతులు

జీసీసీ ధరను ఆసరాగా తీసుకుని మరింత తగ్గిస్తున్న వ్యాపారులు

మైదాన ప్రాంతాల్లో

కిలో రూ.60కు విక్రయం

ఆర్థికంగా నష్టపోతున్నా స్పందించని ప్రభుత్వం, అధికార యంత్రాంగం

చింత సెగ1
1/3

చింత సెగ

చింత సెగ2
2/3

చింత సెగ

చింత సెగ3
3/3

చింత సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement