జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలి
వాలాబులో గిరిజన రైతులతో కలిసి
నిరసన వ్యక్తం చేస్తున్న వెంకన్న, బి.టి. దొర
దేవరాపల్లి: జీడిపిక్కలకు కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర డిమాండ్ చేశారు. మండలంలోని వాలాబు పంచాయతీలో సోమవారం జీడి రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జీడి పంటకు మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న వారికి చివరకు నష్టమే మిగులుతుందన్నారు. జిల్లాలో 90 వేల ఎకరాలలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో జీడిని ప్రధాన పంటగా పండిస్తూ గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. జీడి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేయడంతోపాటు జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటా నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూకురి రామకృష్ణ, మామిడి రవికుమార్, తామర్ల కొండబాబు, సూకురి నూకరాజు, ఎస్. సింహాచలం, తామర్ల బుజ్జిబాబు, ఇరత దేముడు పాల్గొన్నారు.


