పుణ్యధామం
గిరిజన సంస్కృతికి నిలయం, ప్రకృతి మాత ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాల హృదయం.. జిల్లాలోని పావన పుణ్యక్షేత్రం మత్స్యగుండం. ఉత్తర వాహినిగా ప్రవహించే మత్స్యగెడ్డ తీరాన, శివనామ స్మరణతో కొండకోనలు ప్రతిధ్వనించే వేళ వచ్చేసింది. సాక్షాత్తు మత్స్యరూపంలో ఉన్న దేవతలు భక్తులకు దర్శనమిచ్చే ఈ అద్భుత క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి రమణీయత కలగలిసిన ఈ పుణ్యధామంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రకృతి ఒడిలో
సాక్షి, పాడేరు: ప్రకృతి ఒడిలో పులకించే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు.. వీటన్నింటి మధ్య కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రం మత్స్యగుండం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని భక్తుల పాలిట ఆరాధ్య దైవమైన మత్స్యలింగేశ్వర స్వామి క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
పురాణ వైభవం..
హుకుంపేట మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి వందేళ్ల పైబడిన ఘన చరిత్ర ఉంది. జి.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాంతంలో చిన్న ధారగా మొదలయ్యే మత్స్యగెడ్డ, మత్స్యగుండం మీదుగా జోలాపుట్టు రిజర్వాయర్ వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రవహించే నీరు ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది. కిముడుపల్లి నుంచి వచ్చే గేదెగెడ్డ ఇక్కడ కలవడం వల్ల ఈ సంగమ స్నానం అత్యంత పవిత్రమైనదని, ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చేపలే ఇక్కడ దేవతలు..
మత్స్య దేవతలు ఇక్కడ ప్రత్యేకత. బండరాళ్ల మధ్య కొలువుదీరిన ఈ చేపలను గిరిజనులు సాక్షాత్తు దైవ స్వరూపాలుగా ఆరాధిస్తారు. భక్తులు భక్తితో మురిలు, అటుకులు, కొబ్బరి ముక్కలను సమర్పిస్తే, వేల సంఖ్యలో చేపలు కనువిందు చేస్తూ పైకి వస్తాయి.
● మత్స్యగుండం ఎగువన కొలువుదీరిన మత్స్యలింగేశ్వర స్వామి, సమీపంలోని నాగదేవత పుట్ట భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి.
మూడు రోజుల సంబరం
ఈ నెల 14వ తేదీ (శనివారం) నుంచి 16వ తేదీ (సోమవారం) వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వీటిని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక గిరిజనులతో హుకుంపేట మండలం మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంతకుమారి అధ్యక్షతన ఇటీవల ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. భక్తుల విరాళాలతో మత్స్యలింగేశ్వర స్వామి ఆలయానికి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపపట్టాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
జాతర షెడ్యూల్
శనివారం ఉదయం 5 గంటల నుంచి మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. జాతరలో ఇది అత్యంత ముఖ్యమైన రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మఠం పంచాయతీలో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. రాత్రికి మత్స్యలింగేశ్వర స్వామి వారి కల్యాణం జరుగుతుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉత్సవాలు చివరి రోజు సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. రాత్రితో జాతర ముగుస్తుంది.
పుణ్యధామం
పుణ్యధామం
పుణ్యధామం


