ఏయూపై అదే వివక్ష
ఆంధ్రా యూనివర్సిటీపై ప్రభుత్వం తన వివక్షను కొనసాగిస్తోంది. ఇప్పటికే వర్సిటీ నిర్వహణలో రోజుకో కొత్త నిబంధనలతో ఆంక్షలు విధిస్తుండగా.. తాజాగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ తన వైఖరిని మరోసారి తేటతెల్లం చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో(2024–25) ఏయూకి రూ.417 కోట్లు కేటాయించారు. అయితే 2025–26 నాటికి ఆ మొత్తాన్ని రూ.389 కోట్లకు తగ్గించారు. సవరించిన అంచనాల సమయానికి ఈ నిధులను మరింత కుదిస్తూ రూ.379 కోట్లకు పరిమితం చేశారు. చివరకు వాస్తవ లెక్కల నాటికి ఇది రూ.300 కోట్లకు పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కూడా కేవలం రూ.389 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి ఏయూకి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా, నిధుల విడుదల సమయంలోనూ భారీ కోతలు విధిస్తున్నారని స్పష్టమవుతోంది.


