పిప్పళ్ల ధర పతనం
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న పిప్పళ్ల పంటకు మంచిధర లేక గిరిజన రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పిప్పళ్ల రైతులకు ప్రతి ఏడాది ధర కలిసి వచ్చింది. గత ఏడాది 320 నుంచి రూ.350 వరకు ధర పలుకుతూ ఉండేది. దీంతో రైతుల కష్టానికి తగ్గ ఫలితం ఉండేది. పిప్పళ్ల సాగు ఎంతో శ్రమతో చేయాల్సిన పంట. రకం బట్టి రెండు నుంచి మూడేళ్ల వరకు పిప్పళ్ల సాగుకు సమయం పడుతుంది. గతంలో ధర మంచిగా ఉండడంతో గిరిజన రైతులు పిప్పళ్ల సాగుపై ఆసక్తి చూపేవారు. పిప్పళ్లను శీతల దేశాల్లో సుగంధ ద్రవ్యాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో డిమాండ్ ఉంటే ప్రతి ఏడాది పిప్పళ్లకు ధర పెరిగింది. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో జరిగే వారపు సంతల్లో ప్రతి ఏడాది అధికంగా పిప్పళ్లు అమ్మకానికి గిరిజన రైతులు తీసుకొని వచ్చేవారు. ఽఈ ఏడాది రూ.280 నుంచి రూ.300 వరకే ధర ఉండడంతో, ఆర్థికంగా నష్టపోయామని, వారపు సంతకు వచ్చిన పిప్పళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యాపారలు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ధర లేకపోవడానికి కారణమని చెపుతున్నారు.


