కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
రావికమతం: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ్‌కృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఇక్కడ జరిగే ఉత్సవాల సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షించారు. ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలెన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు స్నాన ఘాట్‌ల వద్ద ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 70 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దొండపూడి చెక్‌పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లో స్నానాల ఘాట్‌లను సిద్ధం చేశామని, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిజర్వాయర్, ఆలయం వద్ద సీసీకెమెరాలుతో నిరంతర నిఘాతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చోడవరం ఎమ్యెల్యే రాజు సహాయ సహకారాలతో ఆలయం వద్ద మూడు రోజులపాటు 28 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


