3,480 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,480 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థుల విద్యా హక్కులను దెబ్బతీస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవోలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల పీజీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. పరిశోధన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, అక్రమ ప్రవేశాలు వంటి అంశాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని నిరోధించకపోతే సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మణికంఠ, అజయ్, దేవీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


