శివపూజకు వేళాయె..
గొలుగొండ/నర్సీపట్నం: మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. హరిహరులిద్దరికీ ప్రీతికరమైనది. మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ఎంతో నిష్టతో పుణ్యస్నానాలు ఆచరించి మహా శివుడ్ని దర్శించుకోనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ధారమఠం, ఉత్తరవాహిని శివరాత్రి స్నానాలు ఆచరించే భక్తులతో సందడిగా మారనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ధారమఠం శివాలయానికి తరలి రానున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. ఆలయం ప్రాంగణమంతా ఇప్పటికే భారీగా ముస్తాబు చేశారు. 15న రాత్రి మహా రుద్రాభిషేకం, జాగారం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో జలజలపారే జలపాతాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకోవడం కోసం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు.
నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సులు
గొలుగొండ నుంచి ధారమఠం శివాలయానికి వెళ్లడానికి నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. గొలుగొండ వద్ద భారీ చెక్‌పోస్టు ద్వారా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో గొలుగొండ, నర్సీపట్నం రూరల్, టౌన్, కృష్ణదేవిపేట, నాతవరం ఎస్‌ఐల ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా గురుదేవుల ఆశ్రమం....
బలిఘట్టం ఉత్తర వాహినిని ఆనుకున్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నిత్యం భక్తుల రాకపోకలతో గురుదేవుల ఆశ్రమం సందడిగా ఉంటోంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినాల్లో బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గురుదేవుల ఆశ్రమాన్ని సందర్శించి గురుదేవుల ఆశీస్సులు పొందుతారు. ఉత్తరవాహిని ఒడ్డున శ్రీరామ సమేత సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. స్వామి వారికి నిత్య పూజలు జరిపిస్తున్నారు.
ఉత్తర వాహినికి శివరాత్రి శోభ
సువిశాలమైన వాతావరణం... నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడిగా ఉండే ఉత్తర వాహిని మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. బలిఘట్టం త్రిశూల పర్వతంపై ప్రసిద్ధి చెందిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి, సమీపంలో నది ఉత్తర ముఖంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు స్తంభాలు, గోపురం సైతం రాతితోనే నిర్మించడం విశేషం. శివరాత్రి రోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


