తూనికల్లో తేడాలపై కేసులు నమోదు
చేపల దుకాణంలో తూనికలను తనిఖీ చేస్తున్న అనురాధ
మాకవరపాలెం: తూకాల్లో తేడాలున్న తొమ్మిది వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాకవరపాలెంలో ప్రతి మంగళవారం జరిగే వారపు సంతలో చేపలు, మాంసం దుకాణాల్లో తూకంలో తేడాల కారణంగా వినియోగదారులు మోసపోతున్నారని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్థానిక వారపు సంతలో చేపలు, మాంసం దుకాణాల్లో మంగళవారం లీగల్ మెట్రాలజీ అధికారి అనురాధ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎల్ మోడ్ కాలాల్లో ఉన్న తేడాలను గుర్తించారు. వినియోగదారులను మోసగిస్తున్న తొమ్మిది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇకపై తూకాల్లో తేడాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు కూడా తూనికల్లో తేడాలపై తమకు ఫిర్యాదులు చేయాలన్నారు.


