ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, పాడేరు: జి.మాడుగుల మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి కిల్లో ఆల్బర్ట్ ఫిలిప్స్ (13) గెడ్డలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం జి.మాడుగుల పోలీసు స్టేషన్ సమీపంలోని గెడ్డలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆల్బర్ట్ ఫిలిప్స్‌తో పాటు మరో ఇద్దరు గిరిజన విద్యార్థులు గెడ్డలో స్నానానికి దిగి ఈతకొట్టారు. ఆల్బర్ట్ ఫిలిప్స్ గెడ్డ మధ్యలోకి వెళ్లి బురదతో కూడిన ఊబిలో చిక్కుకున్నాడు. మిగిలిన విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమారుడు మృతి చెందడంతో తండ్రి కిల్లో నరసింహమూర్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన కుమారుడు మృతిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సాయిరామ్ పడాల్‌లు మాట్లాడుతూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
కిల్లో ఆల్బర్ట్ మృతదేహం (ఇన్‌సెట్) ఆల్బర్ట్ (ఫైల్)
ప్రాణం తీసిన ఈత సరదా


