అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న విమర్శ
దేవరాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని తరగతుల ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ఎటువంటి భరోసా, కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3వేల నిరుద్యోగ భృతి, ప్రతీ ఆడ పడుచుకు ఏడాదికి నెలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. విశాఖ ఉక్కు అభివృద్ధి, కడప ఉక్కు నిర్మాణం మాటే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితులకు కేవలం రూ. 6105 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఈ నిధులు గేట్లు పెట్టేందుకు సైతం సరిపోవని ఎద్దేవా చేశారు. ఇలాంటి బడ్జెట్ కేటాయింపులు చేస్తే మరో 20 ఏళ్లు అయిన పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర కేటాయింపులతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, నగదు బదిలీ ప్రవేశ పెట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. హక్కుగా రావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల సబ్ ప్లాన్ నిధుల ఊసెత్తకుండా అంకెల గారడి చేసి ప్రజలను మభ్య పెట్టారని వెంకన్న మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని, కార్పోరేట్ రంగాన్ని, టూరిజాన్ని మాత్రమే పెంచే దిశగా బడ్జెట్ ఉందని, ఈ బడ్జెట్‌తో 2047 కాదు, మరో 100 ఏళ్లు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, హరితాంధ్రగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు.


