ఖనిజాల జోలికొస్తే ఖబడ్డార్
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: పాడేరు ఏజెన్సీలోని ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ కుట్రలు పన్నుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఖనిజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే గిరిజనులు, ప్రజా సంఘాలు ఉద్యమించాయని, దీంతో వెనక్కి తగ్గిన చంద్రబాబు మళ్లీ బాకై ్సట్, ఇతర ఖనిజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బాకై ్సట్ తవ్వకాలకోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. చింతపల్లి, జర్రెల, అరకు ప్రాంతంలోని బాకై ్సట్ ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని, పాఠశాలలకు భవనాలు లేవని, రోగులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు లేక డోలీ మోతలే దిక్కవుతున్నాయని, వాటిని ప్రభుత్వం విస్మరించి గిరిజన ప్రాంత ఖనిజ సంపదను దోచుకునేందుకు కుట్రపన్నడం తగదన్నారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర నేతలు బాకై ్సట్ జోలికి వస్తే ప్రతిఘటన తప్పదన్నారు. అనంతగిరి మండలంలోని ఐదవ నాన్‌షెడ్యూల్ ఏరియా గ్రామపంచాయతీ ల్లో వేలాది ఎకరాల గిరిజనుల భూములు బడాబాబుల కబంధహస్తల్లోకి వెళ్లిపోయాయని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు నిలువనీడ లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. గిరిజన చట్టాలు, ఖనిజ సంపదను ప్రభుత్వాలు కాపాడాలని ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు.


