జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థులు
అరకులోయటౌన్: జాతీయస్థాయి హ్యాండ్ రైటింగ్, కలరింగ్ పోటీల్లో ప్రతిభ కనబరచిన అరకులోయ గురుకులం పాఠశాల విద్యార్థినులను ఏటీడబ్ల్యూవో వెంకటరమణ తదితరులు అభినందించారు. అరకులోయ గురుకులం పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంత విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ గిరిజన విద్యార్థుల్లో ఉందని, వారి ప్రతిభను వెలికితీస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మహారాష్ట్రలో ఔరంగబాద్‌కు చెందిన స్టూడెంట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ గతేడాది నవంబర్ 28న ఆన్‌లైన్‌లో నిర్వహించిన నేషనల్ కలరింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్–2025 పోటీల్లో 190 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో అరకులోయ గురుకులం పాఠశాల విద్యార్థినులు 8 మంది బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఏటీడబ్ల్యూవో తెలిపారు. వీరిలో నలుగురు బాలికలు నేషనల్ కలా గౌరవ్ అవార్డు సాధించగా. మరో నలుగురు బాలికలు నేషనల్ కళాభూషణ్ అవార్డు సాధించారన్నారు. విజేత విద్యార్థినులను స్పూర్తిగా తీసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయా విద్యార్థినులకు ప్రశంసపత్రాలు ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, ఎంఈవోలు వంతాల త్రినాథరావు, భారతీ రత్నం గురుకులం కో–ఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి తదితరులు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా సుమలత, ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ముమ్మన నాగరత్నం ఎంపికయ్యారు. అరకులోయ, అనంతగిరి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు సీహెచ్.భాస్కర్‌రావు, అల్లు సన్యాసినాయుడుతోపాటు గిరిజన గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ ముమ్మన నాగరత్నం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


