ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్‌

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 7:10 AM

ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్‌

ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్‌

చింతపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చింతపల్లి మండలంలో భారీగా అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. సుమారు రూ. 46 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని అధికారులు గుర్తించారు. మంగళవారం చింతపల్లి మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక (సోషల్‌ ఆడిట్‌) నిర్వహించారు. మండలంలోని 17 పంచాయితీలకు సంబంధించిన పనుల వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. 13 పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల పేరిట రూ. 1.28 కోట్లు ఖర్చు చేసినట్లు చూపగా, అందులో రూ. 46 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది. పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేయడం, నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయకుండానే నిధులు డ్రా చేయడం వంటివి వెలుగుచూశాయి. పలు పంచాయతీల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణ పనులు పూర్తికాకపోయినా, రికార్డుల్లో మాత్రం పనులు ముగిసినట్లు చూపారు. తాజంగి పంచాయతీలో రూ.6 లక్షలు, బలపంలో రూ.5 లక్ష లు, గొందిపాకుల, ఎర్రబొమ్మలు: ఒక్కో పంచాయతీలో రూ. 3 లక్షల చొప్పున అవినీతి జరిగినట్లు గుర్తించారు. మిగిలిన పంచాయితీల్లోనూ నిర్వహణ నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఎవరినీ ఉపేక్షించం: పీడీ విద్యాసాగర్‌

ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి పైస్థాయి అధికారుల వరకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కఠిన నిర్ణయాలు అవసరం: ప్రజాప్రతినిధులు

అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టవద్దని ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్య కోరారు. ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అరికట్టవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శంకరరావు, ఎస్‌ఆర్‌పీ అచ్యుత్‌, ఏపీడీ సీతయ్య, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సామాజిక తనిఖీలో బయటపడ్డ

రూ. 46 లక్షల అవినీతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement