కాంట్రాక్ట్ కార్మికుడు గణేష్ మృతిపై ఆందోళన
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్ యార్డ్‌లో మరమ్మతులు చేస్తూ, ప్రమాదవశాత్తు కింద పడి గంగిరి గణేష్ అనే కాంట్రాక్ట్
కార్మికుడు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుని బంధువులు, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు జెన్‌కో డివిజనల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ముమ్మాటికి జెన్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతి తల్లి, సోదరి ఆరోపించారు. ఎటువంటి అవగాహన లేని అన్–స్కిల్డ్ కార్మికుడితో 220 కేవీ విద్యుత్ లైన్ల వద్ద ప్రమాదకర పనులు చేయించడం వల్లే గణేష్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం, పోస్టుమార్టం నిర్వహించడంలో జాప్యం చేయడంపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కార్మికులకు కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదని నాయకులు నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో జెన్‌కో అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, అంత్యక్రియలకు తక్షణమే రూ.50 వేలు ఇస్తామన్నారు. మృతుని తల్లికి నెలకు రూ. పది వేల చొప్పున ఈఎస్‌ఐ పింఛను అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బంధువులకు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అన్–స్కిల్డ్ కార్మికులతో ప్రమాదకర పనులు చేయించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంకి చిన్నయ్య పడాల్, గడుతూరి సత్యనారాయణ, సీఐటీయూ నేతలు సుభాన్, విష్ణు, లక్ష్మణ్, ఎంపీటీసీ సాంబమూర్తి,ఉప సర్పంచ్ మళ్లీ ప్రసాద్. మాజీ సర్పంచ్ కారే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఏపీ జెన్‌కో అధికారుల నిర్లక్ష్యమే
కారణమని ఆవేదన
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని
మృతుడి తల్లి, సోదరి డిమాండ్
పోస్టుమార్టం నిర్వహించడంలో
జాప్యంపై మండిపాటు
కాంట్రాక్ట్ కార్మికుడు గణేష్ మృతిపై ఆందోళన


