పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన

పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన

పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ కార్యదర్శి వి. తులసి రెండు వారాలుగా విధులకు హాజరుకాలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్తాపుట్టు గ్రామానికి చెందిన వంతాల త్రినాథరావు మూడు నెలల క్రితం మృతి చెందగా, ఆయన భార్య గున్నమ్మ మరణ ధ్రువీకరణ పత్రం కోసం కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరికొందరు లబ్ధిదారులు కూడా మరణ ధ్రువపత్రాలు అందక ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ తీర్మానాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని గ్రామస్తులు ఆరోపించారు.కార్యదర్శికి ఫోన్‌ చేస్తే ఆమె భర్త ఫోన్‌ ఎత్తి దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీటీసీ పి. కృష్ణారావు, స్థానిక నేతలు విమర్శించారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కార్యదర్శి తులసిని వివరణ కోరగా.. అనారోగ్య కారణాలతో మెడికల్‌ లీవ్‌ కోరానని, ఎంపీడీవో సస్పెన్షన్‌లో ఉండటంతో సెలవు మంజూరులో జాప్యం జరిగిందని తెలిపారు. కాగా, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో సత్యప్రసాద్‌ స్పందిస్తూ.. తులసి ఈ నెల 9 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో సెలవు కోరారని, ఫిబ్రవరి 13న బొంగరం కార్యదర్శి ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఇకపై ప్రజలకు సేవల్లో జాప్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement