కేఆర్ మార్టు భస్మీపటలం
అగ్ని ప్రమాదానికి గురైన కేఆర్ మార్ట్
కష్టాన్నే నమ్ముకుని కూడబెట్టిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న ‘కేఆర్ మార్టు’ భస్మీపటలమైంది. ఇది కళ్ల ముందే కాలిపోతుంటే మార్టు యాజమాని నిశ్చేష్టుడిపోయాడు. మంటలార్పడం వీలుగాక ఆర్తనాదాలు చేశాడు. తన కలల ప్రపంచం ఒక్కసారిగా అగ్నికి ఆహుతై బుగ్గి పాలవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. పూడిమడక రోడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
అచ్యుతాపురం రూరల్: పూడిమడక రహదారిలో కేఆర్ మార్ట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ ప్రాణనష్టం గానీ జరగలేదు. ఫ్లేంబుల్ సామగ్రి ఉండటంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినా వీలులేకుండా పోయింది. యలమంచిలి, అనకాపల్లి, ఏపీఐఐసీ, ఏషియన్ పెయింట్స్, లారస్ పరిశ్రమల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాయి. అప్పటికే అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఒక్కసారిగా మార్టు మొత్తం చుట్టేయడంతో కాలి బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు యలమంచిలి ఫైర్ సేఫ్టీ అధికారి డి.రాంబాబు, బంగార్రాజు నిర్ధారించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్‌రావు, ఎస్‌ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
కలల ప్రపంచం బుగ్గి పాలవడంతో కన్నీరుమున్నీరు..
కేఆర్ మార్ట్ ప్రొప్రైటర్ కోన వెంకటరావు చిన్నప్పటి నుంచి కష్టాన్నే నమ్ముకున్నారు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ సంపాదించి సొమ్ముతో ఆరేళ్ల క్రితం పెట్టుకున్న మార్ట్‌లో హౌస్ కీపింగ్, గ్రోసరీ, కిరాణా, ప్లాస్టిక్, స్టేషనరీ, తదిదతర సామగ్రి హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయిపోవడంతో గుండెలవిసేలా విలపించాడు. కుటుంబీకుల ఆర్తనాదాలు వర్ణనాతీతంగా మారాయి. సొంత సొమ్ముతోపాటు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా అగ్గి పాలైందని ఆవేదన చెందారు.
రెండు నెలల్లో మూడో ప్రమాదం
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రెండు నెలల్లో అదే ప్రాంతంలో కిలో మీటరు పరిసరాల్లో ఇది మూడో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. షార్ట్ సర్క్యూట్‌లే ప్రధాన కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రూ.లక్షలు, రూ.కోట్లలో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఎంత మేరకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో ఇప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలింది. షార్ట్ సర్క్యూట్‌లు జరగడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ సరిలేకపోవడం ప్రధాన కారణం. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫ్లేంబుల్ మెటీరియల్ దగ్గర దగ్గరగా ఉంచడం వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విద్యుత్ విశ్లేషకులు చెబుతున్నారు.
జిల్లా స్థాయి చెస్ పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి పూజారి శైలజ
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్ పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అదికారిణి పూజారి శైలజ మంగళవారం ప్రారంభించారు. అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో బాలబాలికలు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఆరుగురు చెస్ క్రీడాకారులు గెలుపొందారు. వీరు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 24న శాప్ లీగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైకిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. అండర్ –18 విభాగంలో బాలబాలికలకు పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి సబ్బవరం మండలం దేవీపురం వరకూ సైకిలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు కె.ఎం.ఎల్.నాయుడు, మోటూరి నాగేశ్వరరావు, చెస్ ఆర్బిటరీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
కేఆర్ మార్టు భస్మీపటలం
కేఆర్ మార్టు భస్మీపటలం
కేఆర్ మార్టు భస్మీపటలం


