ప్రభుత్వ సేవలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరిక
పాడేరు: ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పలు శాఖల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
ప్రత్యేక సెల్ ఏర్పాటు
ఐవీఆర్‌ఎస్ కాల్స్ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి నోడల్ ఆఫీసర్లుగా ఇంచార్జ్ డీఆర్వో అంబేద్కర్, ఇంచార్జ్ ఆర్డీఓ లోకేశ్వరరావులను నియమించారు. ప్రధానంగా గ్రామ సచివాలయ సేవలు, ఆసుపత్రి సేవలు, సివిల్ సప్లైస్, పట్టాదార్ పాసుపుస్తకాలు, మ్యుటేషన్ల వంటి విభాగాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో తేలిందని కలెక్టర్ వివరించారు. తక్కువ రేటింగ్ వచ్చిన శాఖల అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, ఫీడ్‌బ్యాక్ మెరుగుపడకపోతే శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిరంతరం ప్రతికూల స్పందన వచ్చే ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు.


