విరిగిపడిన విద్యుత్ స్తంభం
● ధ్వంసమైన పెంకుటిల్లు
● ఇద్దరికి తీవ్ర గాయాలు
పాడేరు: మండలంలోని డి.గొందూరు పంచాయతీ పాలమాను చిలక గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన ఓ విద్యుత్ స్తంభం ఇళ్లపై విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనివల్ల ఒక పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదం జరిగిన తీరు..
గ్రామంలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం పూర్తిగా పాడైపోయింది. శనివారం ఉదయం ఆ స్తంభం ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న పెంకుటింటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో పనులు చేసుకుంటున్న సీసా లక్ష్మమ్మ, సీసా విశ్వేశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు
ప్రమాద సమాచారం తెలుసుకున్న సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. దీనివల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. అనంతరం గాయపడిన వారిని గ్రామస్తుల సహాయంతో ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
శిథిలమైన విద్యుత్ స్తంభాన్ని మార్చాలని సర్పంచ్ రాంబాబుతో పాటు గ్రామస్తులు అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పంచాయతీ పరిధిలో శిథిలావస్థకు చేరిన మిగిలిన స్తంభాలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అదుపుతప్పివాహనం బోల్తా
చింతపల్లి: కొత్తపల్లి జలపాతం వద్ద నుంచి విశాఖ బయలుదేరిన వాహనం లోతుగెడ్డ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఽశనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రెండు కుటుంబాలు ఏజెన్సీ పర్యటనకు వచ్చాయి. మధ్యాహ్నం కొత్తపల్లి జలపాతం వద్ద భోజనాలు ముగించుకుని మైదాన ప్రాంతానికి తిరిగి పయనమయ్యాయి. మార్గం మధ్యలో లోతుగెడ్డ, చెరుకుంపాకల గ్రామాల మధ్య వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలు కానందున ఊపరిపీల్చుకున్నారు.
విరిగిపడిన విద్యుత్ స్తంభం
విరిగిపడిన విద్యుత్ స్తంభం


