భేతాళుడు నాన్‌స్టాప్‌గా నవ్విండు! | vikramarkudu bethaludu Interesting story | Sakshi
Sakshi News home page

భేతాళుడు నాన్‌స్టాప్‌గా నవ్విండు!

Feb 21 2026 5:44 AM | Updated on Feb 21 2026 5:44 AM

vikramarkudu bethaludu Interesting story

హ్యూమరమరాలు

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని కేర్‌ఫుల్‌ గా దించి, భుజాన వేసుకొని కేర్‌ హాస్పిటల్‌ సందులోనుంచి ఎప్పటిలాగే మౌనంగా పంజాగుట్ట శ్మశానం వైపు నడక సాగించాడు. అప్పుడు శవంలోని భేతాళుడు ... ‘రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చకోదగినది. కొన్ని దశాబ్దాలుగా నేను ఏదో ఒక కథ చెప్పి క్లైమాక్స్‌లో ప్రశ్న అడగడం, చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని వార్నింగ్‌ ఇవ్వడం, నువ్వు భయపడినట్లు నటించడం... ఇవన్నీ ఎందుకు చెప్పు, ఈసారి నేను చెప్పడం కాదు నువ్వే చెప్పు’ అన్నాడు భేతాళుడు. ‘నాకు కథలు రావు. జోక్స్‌ వస్తాయి. చెప్పమంటావా ... హీ... హీ...’ అని నవ్వాడు విక్రమార్కుడు. ‘నవ్వాల్సింది నువ్వు కాదు... వినే నేను. సరే చెప్పేయ్‌’ అన్నాడు భేతాళుడు. అప్పుడు ముచ్చటగా మూడు జోక్‌లు చెప్పాడు విక్రమార్కుడు.

జోక్‌ నెం:1 సమయం రాత్రి ఒంటిగంట. దేవడోస్‌ ఎప్పటిలాగే ఊగుతూ తూగుతూ వెళుతున్నాడు. ఒక పోలీస్‌ అడ్డుకొని...‘ఇంత రాత్రి ఎక్కడికి వెళుతున్నావు?’ అని గద్దించాడు. ‘మందు తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఉపన్యాసం వినడానికి వెళుతున్నాను’ అని చెప్పాడు డోస్‌. ‘ఇంత రాత్రిపూట ఎవరు ఉపన్యాసం ఇస్తారు?’ అని అశ్చర్యంగా అడిగాడు పోలీస్‌. ‘ఇంట్లో నా భార్య’ అని వినయంగా చెప్పాడు దేవ డోస్‌.

జోక్‌ నెం: 2 ఒక తాగుబాబు ఒక హోటల్‌కు వెళ్లి ‘హోటల్లో వే..డి వే...డిగా ఏముంది?’ అని అడిగాడు. ‘సూప్‌’ అన్నాడు సర్వర్‌. ‘అంతకంటే వే...డిగా ఏముంది?’ అడిగాడు బాబు. ‘వేడి వేడి నీళ్లు’ అన్నాడు సర్వర్‌. ‘అంతకంటే...వే...డిగా ఏముంది?’ అడిగాడు బాబు. ‘పొయ్యిలో  నిప్పులు ఉన్నాయి’ అన్నాడు సర్వర్‌. ‘గుడ్‌...ప్లేట్‌ నిప్పులు పట్రా’ అని ఆర్డర్‌ ఇచ్చాడు బాబు. ‘నిప్పులతో ఏం చేసుకుంటారండీ!’ ఆసక్తిగా అడిగాడు సర్వర్‌. ‘సిగరెట్‌ కాల్చుకోవాలి. త్వరగా పట్రా’ అని జేబులో నుంచి సిగరెట్‌ పాకెట్‌ తీశాడు తాగుబాబు.

జోక్‌ నెం: 3 అర్ధరాత్రి తరువాత బార్‌ నుంచి ఇంటికి  వచ్చిన లిక్కర్‌ చెంగప్ప తలుపులు దబాదబా బాదడం మొదలుపెట్టాడు. చెంగప్ప భార్య తలుపులు తీసింది. ‘ఎవరు మీరు. నా ఇంట్లో మీకేం పని?’ గద్దించాడు చెంగప్ప.
భార్య: నన్నే గుర్తు పట్టలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా గుర్తులేదా?
లిక్కర్‌ చెంగప్ప: సారీ డియర్‌.. మందుకొడితే  కొన్ని విషాదాలు మరిచిపోతాను...
  
‘రాజా విక్రమార్కా. వృథా ప్రయత్నం చాలా డెడికేటెడ్‌గా చేశావు. కాని ఒక్క జోక్‌కూ నవ్వు రాలేదు’ నిష్ఠూరాలాడాడు భేతాళుడు. విక్రమార్కుడు బుర్ర గోక్కున్నాడో లేదో, బుర్రకు సుమారు రెండు అడుగుల ఎత్తులో మెరుపులాంటి ఐడియా మెరిసింది. వెంటనే తన నడుం బెల్ట్‌లో నుంచి చిన్న సీసా తీశాడు.
‘ఏమిటది?’ అడిగాడు భేతాళుడు. జవాబు చెప్పకుండా ఆ సీసాలోని ద్రవాన్ని భేతాళుడి గొంతుకు రాశాడు విక్రమార్కుడు. ఇక అంతే... భేతాళుడు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు!

‘విక్రమార్కా...తెలిసో తెలియకో నీతో గేమ్స్‌ ఆడాను. నవ్వలేక చస్తున్నాను. నవ్వి నవ్వీ చస్తానేమోనని భయంగా ఉంది.  ఇంతకీ ఈ మందు పేరేమిటి?’ హ్హా హ్హా హ్హా అని నవ్వుతూనే  అత్యంత భయంగా అడిగాడు భేతాళుడు. ‘దీన్ని అమెజాన్‌లో కొన్నాను. ఈ సీసా పేరు.. నవ్వింత–తుళ్లింత–ఒళ్లంత (ఎన్‌టీవో). నవ్వను గాక నవ్వను అనుకునే నాన్‌లాఫర్స్‌ కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు’ అని చెప్పి భళ్లున నవ్వాడు విక్రమార్కుడు.

– యాకుబ్‌ పాష
 

Advertisement
 
Advertisement
Advertisement